మనిషికి మెదడు చాలా ప్రధానం. ఎందుకంటే, దానివల్లే ఆలోచించగలుగుతాడు. పనులన్నీ చేసుకోగలుగుతాడు. మరి మెదడు ఉంది కాబట్టి గుండె అక్కర్లేదంటామా..? గుండెతో ఆలోచించలేం. కానీ, మెదడుతో సహా దేహంలోని అవయవాలన్నీ గుండె వల్లే పని చేస్తాయి. సంస్కృతి కూడా అటువంటిదే..!
అమెరికా లాంటి దేశాలు ఇంకా అయిదు వందల ఏళ్ల చరిత్ర కూడా లేకుండానే.. ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అందుకు కారణం, ఆర్దిక అభివృద్ధి, ఆయుధాలు. వాటితో ఆయా దేశాలు అగ్ర రాజ్యాలు అయిపోయాయి. యూరోపియన్ దేశాలు ఆసియా, ఆఫ్రికాల్ని దోచుకుని సంపన్న దేశాలైపోయాయి. కానీ, ఇవేవీ సదరు దేశాలకి వేల ఏళ్ల చరిత్రని, సంస్కృతిని, నాగరికతని తెచ్చి పెట్టలేవు. భారతదేశం లాంటి దేశంతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా.. మరే దేశమూ.. పురాతనత్వం, సనాతనత్వం విషయంలో పోటీ పడలేవు. ఇక్కడ ఆకాశాన్ని అంటే ఆలయ గోపురాలు నిర్మిస్తున్నప్పుడు నేటి అగ్ర రాజ్యాల్లో జనం జంతు చర్మాలు కప్పుకుని గుహల్లో బతికేవారు..! మన నాగరికత పతాక స్థాయిలో ఉండగా.. వాళ్లు పచ్చి మాంసం తినేవారన్నది.. పచ్చి నిజం..!
భారతదేశ చరిత్ర, సంస్కృతి గురించి మాట్లాడుకున్నప్పుడు.. మనం ఓ సామెత తప్పక గుర్తుకు చేసుకోవాలి. మా తాతలు నేతులు తాగరని గొప్పలు చెప్పుకోవటం వల్ల.. నిజంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే, అమెరికా కంటే మనం పురాతనులం, సనాతనులం అంటూ స్వోత్కర్ష చేసుకోవటం మాత్రమే కాక.. వెనక్కి చూస్తూ అడుగు ముందుకు వేయాలి..! ఏక కాలంలో భూత కాలాన్ని అనుభూతి చెందాలి, భవిష్యత్తుని భద్రం చేసుకోవాలి. వర్తమానంలో ప్రవర్ధమానం అయ్యేందుకు ఏం చేయాలో.. తెలిసి ప్రవర్తించాలి..! నరేంద్ర మోదీ ఇవన్నీ చేస్తుండటమే.. 2014 తరువాతి కాలపు నవ శకంలో.. అసలైన విశేషం..!
భారతదేశానికి వెయ్యేళ్ల బానిసత్వం తరువాత 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ 75 ఏళ్లు గడిచాయి. స్వతంత్ర భారత అమృతోత్సవాలు కూడా మనం జరుపుకున్నాం. కానీ, తొలి ప్రధాని నెహ్రూ మొదలు మన్మోహన్ వరకూ పాలకులు ఎందరు మారినా దేశ సౌభాగ్యం సంపూర్ణంగా మారలేదు. అలాగని మోదీ వచ్చాక ఇండియా అంతర్జాతీయంగా ఇనుమడించిపోతోందని మనల్ని మనం మోసం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ, ఓ ప్రస్ఫుటమైన మార్పు 2014 తరువాత చిన్న నిప్పు రవ్వలా మొదలై దావానలంలా వ్యాపించేందుకు క్రమంగా రాజుకుంటోంది..! అదే మన సాంస్కృతిక పునరుజ్జీవనం..!
మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా.. ఆర్దిక అభివృద్ధి, ఆయుధాలతో ఆత్మరక్షణ.. ఇవన్నీ దేశానికి మెదడు లాంటివి. సంస్కృతి, చరిత్ర మొదలైనవి గుండెకాయ. అవి కోల్పోతే ఏ దేశమైనా సహజత్వం లేని రోబోట్ లాగా మారిపోతుంది. అందుకే, ప్రధాని మోదీ మెదడుపై, గుండెపై సమానంగా దృష్టి సారిస్తున్నారు. ఆర్దికంగా మనం ఏం సాధించలేదని వాదించే వారు భారత్‌లో చాలా మందే ఉంటారు. వాళ్లలో కొందరు నిజంగానే లోపాల్ని ఎత్తి చూపుతూ ఉండవచ్చు కూడా. కానీ, అత్యధికులు మాత్రం మోదీ పట్ల వ్యతిరేకతతో మాత్రమే ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. మోదీ నల్లధనం వెనక్కి తెచ్చి నాకు పదిహేను లక్షలు ఖాతాలో వేస్తానన్నాడు అనేవారు మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. మరోవైపు రూపాయి విలువ పడిపోతోంది, పెట్రోల్ ధర పెరిగిపోతోందని వాపోయేవారు కూడా సాటి భారతీయులే. కానీ, మోదీ పాలనలోని లోపాలెన్నో, విజయాలు కూడా అన్ని ఉన్నాయి. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల కాలంలో.. నమో కాకుండా మరే ప్రధాని ఉన్నా.. ఇప్పుడున్నంత భద్రంగా దేశం ఉండేది కాదన్నది నిజంగా నిజం..! ఎవరు ఒప్పుకోకున్నా.. ఒప్పుకుని తీరాల్సిన.. కళ్ల ముందు కానవచ్చే సత్యం..!
శ్రీలంక, పాకిస్థాన్ మొదలు అమెరికా, జర్మనీ, బ్రిటన్ వరకూ ప్రపంచ దేశాలన్నీ ఆర్దిక కష్టాలతో సతమతం అవుతున్నాయి. అయినా కూడా అటువంటి ప్రపంచ పటంలోనే మన దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి వారి అభిప్రాయం సాక్షిగా.. దూకుడుగా ముందుకు సాగుతోంది. మన గ్రోత్ రేట్ గురించి ఇంట ఎంత మంది పెదవి విరిచినా.. బయట మాత్రం ప్రశంసలు ఎదురవుతున్నాయి. అందుక్కారణం మోదీ నినదించిన ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటివే..! కరోనా వ్యాక్సిన్లు మొదలు అత్యాధునిక ఆయుధాల వరకూ ఇప్పుడు భారత్‌లోనే ఎన్నెన్నో తయారవుతున్నాయి. దీనివల్ల భారత్ దిగుమతులు అన్నీ మానేసుకుందని కాదు. ఎగుమతులు మతిపోగొట్టేలా పెరిగిపోయాయని కూడా కాదు. ప్రపంచపు అయిదవ అతి పెద్ద ఆర్దిక వ్యవస్థగా అవతరించిన భారత్ మోదీ నేతృత్వంలో సరైన దిశగా సరైన అడుగులు వేస్తోందని మాత్రమే..!
వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారత్ అంటే.. కేవలం ఆర్దికాభివృద్ధి, ఆయుధ సంపత్తి మాత్రమేనా..? కానే కాదు..! ఆ విషయం కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తెలుసు. అందుకే, దేశం నలుమూలలా సాంస్కృతిక వారసత్వ పతాకాలు సగర్వంగా రెపరెపలాడుతున్నాయి. తాజాగా నమో ఉజ్జయినీ మహాకాలుడ్ని దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనదైన ఉజ్జయినీ అనాదిగా సనాతన ధర్మానికి కేంద్రమై విలసిల్లుతోంది. అంతేకాదు, మధ్యప్రదేశ్ లోని మహాకాల క్షేత్రం భారత్‌కి మధ్య భాగం కూడా. మన పురాతన గణిత పండితులు, పంచాంగకర్తలు అందుకే అక్కడ్నుంచీ కాల గణన చేసేవారు. మహాకాలుడు అంటే కాలానికి అధిపతి, అతీతుడు అని అర్థం..! ఆయన సమక్షంలోనే మన వాళ్లు వేలాది ఏళ్లుగా కాలాన్ని, గ్రహగమనాల్ని లెక్కిస్తున్నారు. గ్రహణాల వంటి ఖగోళ విశేషాల నిర్ణయం కూడా ఉజ్జయినీ స్థానం నుంచే మన వారు చేస్తూ వస్తున్నారు. అటువంటి కాలాతీత కాలేశ్వరుని క్షేత్రంలో మోదీ కాలుమోపారు.
నరేంద్ర మోదీ ‘మహాకాల్ లోక్’ కారిడార్ ఆవిష్కరణ ద్వారా ఉజ్జయినీ క్షేత్రంలో తొలి దశ అభివృద్ధి పనుల్ని లోకానికి చాటారు. డెబ్బై అయిదేళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో కేవలం సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్ర ఆలయం తప్ప మరేదీ ప్రభుత్వం చొరవతో నిర్మించలేదు. అభివృద్ధి చేయలేదు. సెక్యూలర్ సంకెళ్లు తమకు తామే తగిలించుకున్న గత హిందూ పాలకులంతా అసలు గుడికి వెళ్లటం, నుదుటన బొట్టు పెట్టుకోవటమే ఓట్లను, ఓటర్లను దూరం చేసే మహాపాతకంగా భావించారు. వారికి విరుద్ధంగా హిందూత్వ రథంపై.. సాంస్కృతిక కపి ధ్వజం ధరించిన మన మోదీ.. అర్జునుడై దేశం నలుమూలలా దిగ్విజయ యాత్ర చేస్తున్నారు..! తాజా ఉజ్జయినీ పర్యటనకి ముందు కూడా ఆయన సోమనాథ్, కాశీ, అయోధ్య, కేదార్ అంటూ యావత్ భారతాన్ని కలయదిరిగారు..!
భారతీయుల క్షేత్రాలేవీ నిన్న మొన్నటి చరిత్రలోనివి కావు. కాశీ లాంటి అనాది పుణ్య ధామాలైతే చరిత్రకి అందని రోజుల నుంచీ అస్థిత్వంలో ఉన్నాయి. వారణాసిలోని ఒక్కో మట్టి పొరలో కనీసం వందేళ్ల చరిత్ర దాగుంటుంది. తవ్వితే తెలియబడేవి ఎన్నోన్నో. అటువంటి కాశీ విశ్వనాథుని కారిడార్ ఇప్పుడు యాత్రీకులకి, పర్యాటకులకి ప్రధానాకర్షణ..! గంగలో స్నానం చేసి చేతులెత్తితే నేరుగా విశ్వనాథుని ఆలయ గోపురం కనిపించటం.. మోదీ చలువే. అందర్నీ ఒప్పించి ఇరుకు ఇరుకు గల్లీల హిందూ పుణ్యక్షేత్రాన్ని కొత్త అందంతో ఇనుమడింపజేశారు ప్రధాని..! అయితే, వారణాసి తన స్వంత నియోజక వర్గమని మాత్రమే నమో దృష్టి సారించలేదు. సప్త మోక్ష పురాల్లోని మరో ప్రధాన కేంద్రం అయోధ్యను కూడా వివాదం నుంచీ సంపూర్ణంగా వెలుపలికి లాగేశారు.
మోదీ శకంలోనే వందలేళ్ల అయోధ్య రామాలయ వివాదం ముగింపుకొచ్చింది. అంతేకాదు, కోర్టు దాటి అయోధ్య క్షేత్రానికి చేరిన చారిత్రక, సాంస్కృతిక మైలురాయిని.. నరేంద్రుడే శంకుస్థాపన కూడా చేశాడు. ఆయన వేసిన పునాది రాయి మరికొన్ని నెలల్లోనే భవ్య రామాలయమై మనకు ముందు సాక్షత్కరించబోతోంది..! జ్ఞానవాపిలోని జ్యోతిర్లింగస్వరూపుడ్ని, మథురలోని ముగ్ధమనోహరుడ్ని కూడా భరతజాతి ముందుకు వేంచేపు చేసేందుకు.. రంగం సిద్ధమవుతోంది..!
భారత దేశ ఉత్తరాన కేదార్ క్షేత్రంలోనూ మోదీ సాంస్కృతిక పునరుద్ధరణ.. సమున్నతంగా చేశారు. కేదార్వేశ్వరుని ఆలయ అభివృద్ధి మాత్రమే కాదు కేరళలో అవతరించిన ఆదిశంకరుని.. హిమాలయ పర్వతాల మధ్యలో సంస్థాపించారు..! కేరళ నుంచి కేదార్ దాకా ఆసేతు హిమాచలం ఒకే ఒక్క భారతదేశమన్న సాంస్కృతిక, చారిత్రక సందేశం ప్రపంచానికి అందించారు. ఉత్తర, దక్షిణ.. ఆర్య, ద్రవిడ.. విభేదాలు మాట్లాడే విదూషకులకి.. ఏ దూషణా లేకుండానే.. మౌనంగా సమాధానమిచ్చారు..!
ఉత్తరాన కేదార్, కాశీలే కాదు పశ్చిమాన సోమనాథ్లోనూ మోదీ నేతృత్వంలో సనాతన ధర్మం సరికొత్త శోభని సంతరించుకుంది. సోమనాథ్‌తో పాటూ ఈ మధ్యే మోదీ సందర్శించిన మొధేరాలోని సూర్య దేవాలయం వంటి అనేక క్షేత్రాలు ప్రధాని పర్యటనలతో ప్రధానాకర్షణలు అవుతున్నాయి. ఇంతలా హిందూ ధర్మాన్ని తన నుదుటిపై భస్మ రేఖలతో, పచ్చటి గంధంతో చాటిన గత ప్రధాని ఎవరైనా ఉన్నారా..? సమాధానం ఎవరికి వారికే దొరుకుతుంది..!
మోదీ సాంస్కృతిక సమరానికి మన దక్షిణాపథం కూడా నెలవైంది. చైనా నుంచీ జిన్‌పింగ్ లాంటి ప్రపంచ నేత పర్యటనకొస్తే.. మహాబలిపురం తీసుకువెళ్లి మన మహాశిల్పకళని కళ్లకు కట్టారు..! చైనా అధ్యక్షుడికే కాదు.. తానేంటో తమిళ ద్రవిడవాద మేధావులకి కూడా మోదీ చాటి చెప్పారు..! అంతేకాదు, ప్రపంచపు అతి పెద్ద విశిష్టాద్వైత విగ్రహం తెలుగు నేలపై స్థాపిస్తే.. విశిష్ట అతిథిగా భాగ్యనగరానికి విచ్చేసి.. విలక్షణత చాటుకున్నారు. రామానుజచార్య విగ్రహ ఆవిష్కరణ సమయంలో మోదీ నుదుటిపై మూడు నామాలు ధరించి తీరు నభూతో న భవిష్యతి..! అటువంటి పని గతంలో ఏ ప్రధాని చేయలేదు. ఇక మీదట ఎవరైనా చేస్తారో లేదో.. అనుమానమే..! భారతదేశంలోని ‘భిన్నత్వంలో ఏకత్వం’పై మోదీకున్న నిబద్ధత అలాంటిది..!
చివరగా.. భరతమాతకు మకుటం అంటూ మనం చెప్పుకునే కశ్మీరాన్ని దశాబ్దాల పాటూ ఇంటి దొంగలు, బయటి రాక్షసులు మనకు కాకుండా చేయాలని చూశారు. మోదీ ఆర్టికల్ 370 రద్దు ద్వారా వారందరి కుట్రల్ని, పన్నాగాల్ని రద్దు చేశారు. అంతటితో ఆగక అలనాటి శారదా క్షేత్రంలో మరోసారి సనాతనమైన వెలుగుల్ని నింపేందు కోసం వీలైన ప్రతీ సహకారాన్ని అందిస్తున్నారు..! అనంతనాగ్‌లోని వందల ఏళ్ల నాటి మర్తాండ సూర్య దేవాలయంలో మళ్లీ పూజాదికాలు మొదలయ్యాయి..! పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు అతి దగ్గరగా ఒకప్పటి సర్వజ్ఞ పీఠానికి గుర్తుగా.. ఆధునాతన సరస్వతీ ఆలయం రూపొందుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శారదాంబ ఆలయం ప్రస్తుతం పీఓజేకేలో ఉంది. దానికి అతి దగ్గరగా భారత భూభాగంలో నూతన ఆలయం నిర్మాణం అవుతోంది..!
మోదీ సాంస్కృతిక బృహత్ కార్యచరణలో అన్నీ గుళ్లు, గోపురాలు మాత్రమే కాదు. ఈ దేశం కోసం అహరహం తపించిన అనుపమాన దేశ భక్తులు కూడా ఈ తరం భారతీయుల ముందుకు బృహత్ రూపాలు ధరించి తిరిగి వస్తున్నారు..! పశ్చిమ సముద్ర తీరంలో మన ఉక్కు మనిషి ఉత్కృష్ఠమైన గౌరవాభిమానాలతో సగర్వంగా నిలిచి ఉన్నాడు. సర్ధార్ పటేల్ విగ్రహ స్థాపన తరువాత దేశ రాజధాని ఢిల్లీలో.. ఒక విధంగా మన తొలి ప్రధాని అయిన.. సుభాష్ చంద్రబోస్, మనకు కర్తవ్యపథాన్ని చూపిస్తూ విరాజమానుడయ్యాడు. ఎక్కడ ఒకప్పుడు ‘కింగ్స్ వే’పై బ్రిటన్ రాజు విగ్రహం ఉండేదో.. అక్కడ ఇప్పుడు కర్తవ్యపథంగా మారిన రాజ్‌పథ్‌పై.. సుభాష్ చంద్రబోస్ దర్శనమిస్తున్నాడు..! సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఇది కాక.. మరేంటి..?
అటు మొఘలుల్ని, ఇటు బ్రిటీషు వార్ని కూడా నియంత్రించిన, నిలువరించిన మరాఠా హైందవీ సామ్రాజ్యానికి మూలపురుషుడు.. మన అవతార పురుషుడు ఛత్రపతి శివాజీ కూడా మహాస్వరూపంతో మహారాష్ట్ర తీరంలో నెలకొనబోతున్నాడు. శివాజీ మహారాజు విగ్రహం అరేబియా సముద్ర జలాల్లో అంతెత్తున అవతరించేందుకు కాస్త సమయం పట్టినా.. ఆ అద్భుతం కూడా త్వరలో తప్పక సాక్షత్కరిస్తుంది..!
మోదీ చేపట్టే పుణ్య క్షేత్రాల, సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధి పనులు, భారీ విగ్రహాల ప్రతిష్టాపనా క్యార్యక్రమాలు.. సహజంగానే కొందరి విమర్శలకు కారణం అవుతుంటాయి. వర్షం కురిస్తే.. పంటలు పండితే.. అందరికీ సంతోషమే. కానీ, నేలని దున్నేటప్పుడు కొన్ని క్రిమికీటకాలు నాగలి కింద నలిగిపోయి మరణిస్తాయి. ఇదీ అటువంటిదే. దేశ సంక్షేమం, దేశాభివృద్ధి కోసం చేసే పనులు కూడా కొందరికి నష్టం చేకూరుస్తాయి. వారి ఆరోపణలు, ఆక్రందనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోదీ ప్రపంచం దృష్టికి తీసుకొస్తున్న భారతీయ సాంస్కృతిక కేంద్రాలు, క్షేత్రాలు, మహోన్నతుల మహావిగ్రహాలు.. కేవలం కీర్తి కోసం మాత్రమే కాదు. ప్రతీ ఏటా కోట్లాది మంది పర్యాటకుల్ని అవి ఆకర్షిస్తాయి..! తద్వారా దేశానికి ఆర్దికంగా కూడా మేలే జరుగుతుంది. తమని తాము సెక్యూలర్ అని ప్రకటించుకున్న గత చేత కాని ప్రభుత్వాలు కశ్మీర్‌ని రావణ కాష్టం చేశాయి. మోదీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం… 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక పర్యాటకుల్నీ, యాత్రీకుల్ని మంచు కొండల మనోహర లోకంలోకి ఆహ్వానించింది..! సంస్కృతి, చారిత్రక సముద్ధరణ అంటే దేశం ఆర్దికంగా ఎదగటం కూడా..! ఈ విషయం ఇప్పటికైనా మన రాజకీయ నాయకులు అందరూ గుర్తించి, గ్రహించి.. ఓట్ల సంకుచితత్వం, మతపరమైన దివాలాకోరుతనం.. మానుకుని దేశ శ్రేయస్సు కోసం పని చేయాలి. వేల ఏళ్ల సంస్కృతిని, చరిత్రని వక్ర దృష్టితో చూడటం మాని.. ఘనమైన వారసత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరూ భుజాలకెత్తుకోవాలి..! జై హింద్..!!