TJU జర్నలిస్టుల ప్రజా చైతన్య యాత్ర

0
1168

బంగారు తెలంగాణ వచ్చింది. ఇక అంతా ఓకే..! మన బతుకులు బాగుపడ్తాయ్ అని..,  అటు సామాన్య ప్రజానీకం నుంచి, ఇటు జర్నలిస్టుల వరకు అంతా సంతోషపడ్డారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో.. ఆ సంతోషం కాస్తంతా కూడా లేకుండా పోయింది.

ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే అన్యాయం చేస్తోంది. జర్నలిస్టుల ద్వారా ఉద్యమంలోకి వచ్చిన నేతలే ఇప్పుడా జర్నలిస్టులనే విస్మరించారు. ప్రస్తుతం మీడియా చానళ్లు, పత్రికా యాజమాన్యాలు…ప్రభుత్వానికి భయపడే పరిస్థితులు సృష్టించబడ్డాయి. యాజమాన్యాలే ప్రభుత్వానికి దాసోహం అయ్యాయి. కొన్ని పార్టీలు అయితే ఏకంగా అటు పత్రికలను, ఇటు చానళ్లను నిర్వహిస్తున్నాయి.  ఫలితంగా ప్రజలకు చేరాల్సిన వాస్తవాలు ప్రతి రోజు సమాధి చేయబడుతూనే ఉన్నాయి.

మరోవైపు తెలంగాణ మీడియాలో ఇప్పటికీ జర్నలిస్టులకు అన్యాయమే జరుగుతోంది. ఎన్నికల ముందు జర్నలిస్టులకు 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామన్నది టీఆర్ఎస్. ప్రతి జర్నలిస్టుకు ఇండ్లు… ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు.జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా అన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్న ఇంత వరకు కూడా… ఈ హామీలు అమలుకు నోచుకోలేదు.

ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో టీ జర్నలిస్టులను వేధించి అవమానపరిచినవారే… ఈ రోజు అన్ని చానెళ్లు, పత్రికల్లో అందలాలెక్కి కూర్చున్నారు. ప్రభుత్వం కూడా వారినే ఆదరిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో మమేకమైన చిన్నపత్రికలను ఇప్పుడు పట్టించుకోవడమే లేదు. ఇక పని చేయించుకొని మీడియా యాజమాన్యాలు… వేతనాలు ఇవ్వకుండా జర్నలిస్టులను కొలువుల్లోంచి తీసేస్తున్నాయి. అటు యాజమాన్యాలపై ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకునేవారే లేరు. జర్నలిస్టులకు వారి జీతాలు ఇప్పించేవారే కరువయ్యారు.  

ఇక కరోనా సమయంలో అయితే… జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా మారింది. వేతనాల్లో కోతలు పడ్డాయి. నిత్యవసరాలకు అనేక కష్టాలు పడ్డారు. అదే సమయంలోయాజమాన్యాలు కూడా తమ ప్రతాపాన్ని చూపాయి. చాలా మంది జర్నలిస్టులను క్రాస్ కటింగ్ పేరుతో అర్థాంతరంగా ఉద్యోగం నుంచి తీసివేశాయి. వేతనాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టాయి. అనారోగ్యంబారిన పడిన జర్నలిస్టులు ఎందరో అసువులు బాసారు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను… ప్రజలకు తెలియజెప్పి..వారిలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టుంది. మన బాధలు ప్రజలకు చెబుదాం. జనం బాధలు మనం తెలుసుకుందాం. జనం…మనం…, కలిసి ఈ నియంతృత్వాన్ని కూలుద్దామనే నినాదంతో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ తోపాటు…మిగిలిన సభ్యులు అందరూ ఈ యాత్రలో పాల్గొంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరిస్తున్నారు. సమాజంలో… ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న ఎంతో కొంత ప్రభావితం చేయగల జర్నలిస్టులనే  ఇండ్లు , 100 కోట్ల నిధులు, ఇవ్వకుండా  మోసం చేసిన ప్రభుత్వం…  ప్రజలను మోసం చేయడం  ఓ లెక్కనా…!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seventeen − 12 =