జిత్తులమారి చైనాకు క్వాడ్ కూటమి కొరకరాని కొయ్యలా తయారవుతోంది. నానాటికి మితిమీరిపోతున్న చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ ప్రోద్బలంతో క్వాడ్ కూటమి ఏర్పాటైంది. జట్టుకట్టిన భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. డ్రాగన్ ముచ్చెమటలు పట్టిస్తోంది. దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించుకోవాలనుకునే కుతంత్రాలకు ఈ చతుర్భుజ కూటమి చెక్ పెట్టనుంది. ఇందులో భాగంగా క్వాడ్ దేశాలు నావికా విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరిగే సంయుక్త విన్యాసాల్లో యుద్ధ సామర్థ్యాలను ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ప్రదర్శించబోతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. సభ్య దేశం కాకపోయినా ఫ్రాన్స్ కూడా క్వాడ్ తో జతకట్టి చైనాకు సవాలు విసిరేందుకు సిద్ధమైంది. అంతేకాదు, క్వాడ్ దేశాలు జరుపబోయే నావికా విన్యాసాలకు ఫ్రెంచ్ నావికాదళమే నాయకత్వం వహిస్తోంది.
లా పెరౌజ్ పేరుతో జరిగే క్వాడ్ నావికా విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే రెండు ఫ్రెంచ్ యుద్ధ నౌకలు కొచ్చి నౌకాశ్రయానికి చేరుకున్నాయి. టొనెర్రే అనే హెలికాప్టర్ వాహక నౌక, సుర్కౌఫ్ అనే లా ఫయెట్టే క్లాస్ ఫ్రిగేట్ నౌకలు భారత తీరానికి తరలివచ్చాయి. ఈ రెండు నౌకలు ఇక్కడి నుంచి బంగాళాఖాతానికి వెళ్లి సైనిక విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి. ఫిబ్రవరిలో బయలు దేరి.. మార్చి 31న కొచ్చికి చేరుకున్న ఈ రెండు ఫ్రెంచ్ యుద్ధ నౌకలు.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఐదు నెలలపాటు మోహరిస్తారు. తద్వారా వ్యూహాత్మక ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మోహరించే సామర్థ్యం తనకు ఉందని ఫ్రాన్స్ పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపినట్టయింది. ఈ ప్రాంతంలో ప్రధాన భాగస్వాములతో కలిసి కార్యకలాపాలను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఈ చర్యలు దోహదపడతాయి. మరీ ముఖ్యంగా భారత దేశంతో కలిసి పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. మరోవైపు 148 మంది ఫ్రెంచ్ నావికా దళ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ మోహరింపు వల్ల అవకాశం లభిస్తుంది.
సంయుక్త విన్యాసాల తర్వాత రెండు ఫ్రెంచ్ యుద్ధ నౌకలు ఇండో-పసిఫిక్‌లోనే కొనసాగుతాయి. ఆ తర్వాత జపాన్‌కు వెళ్తాయి. జూలై మొదటి పక్షంలో తిరిగి ఫ్రాన్స్‌కు వెళ్తాయి. ఈ ప్రయాణ కాలంలో రెండుసార్లు దక్షిణ చైనా సముద్రంలో ప్రయాణిస్తాయి. ఇది దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చెలాయించాలనుకుంటున్న చైనాకు హెచ్చరిక లాంటిది. ఈ చర్యతో ఈ జలాల్లో స్వేచ్ఛాయుత నావికా యానం, ఈ జలాలపై నుంచి గగనతలంలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి అందరికీ అవకాశం ఉండాలనే క్వాడ్ దేశాల ప్రతిపాదనకు ఫ్రాన్స్ మద్దతు తెలిపినట్టయింది. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే కాదు.. రానున్న రోజుల్లో క్వాడ్ కూటమికి మరికొన్ని దేశాలు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా వున్నాయి. వచ్చే నెలలో క్వాడ్ సభ్య దేశాలైన భారత్, ఆస్ట్రేలియాతో పాటు, ఫ్రాన్స్, ఇండోనేషియా విదేశాంగ మంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో చైనా ఆగడాలకు చెక్ పెట్టేలా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.