More

  భారత్ ‘‘సముద్ర వ్యూహం”.. డ్రాగన్ కు ముచ్చెమటలు!!

  విదేశాంగ విధాన నిర్ణయంలో, లక్ష్యాలు నిర్దేశించడంలో రక్షణరంగం ఆదర్శవంతమైన సాధనం. దేశాల మధ్య సఖ్యత ఘర్షణాత్మక వాతావరణాన్ని నివారించడమే కాక, పరస్పర విశ్వాసాన్ని పెంచుతుందీ…అంటారు భారత రక్షణ రంగ పరిశోధకులు కల్నల్ అరవింద్ గుప్తా. బడ్జెట్ పద్దు-2022-23 ప్రవేశపెట్టిన ప్రతి ఏటా రక్షణ రంగ కేటాయింపులపై వామపక్షాల విమర్శలు షరామామూలుగానే వినపడుతుంటాయి. దేశం అన్నమో రామచంద్రా అని అల్లాడుతుంటే..ప్రభుత్వం ఆయుధాలు కొనేందుకు ఉత్సాహం చూపుతోందని…దశాబ్దాలుగా నేలబారు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
  రక్షణ రంగం అనగానే పాకిస్థాన్ గుర్తుకు రావడం, ఇటీవలి కాలంలో చైనా గురించి ప్రస్తావించడం పరిపాటిగా మారింది. దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ ప్రాతిపదికన భారత రక్షణ విధానం ఖరారు కాదు. సమగ్రతకూ, సుస్థిర అభివృద్ధికీ…సౌభ్రాతృత్వానికీ, సామాజిక ప్రగతికీ, పటిష్ఠ రక్షణకూ, పారిశ్రామిక అభివృద్ధికీ ఉన్న పరస్పర బంధం గురించిన ఎరుకలేకపోవడం మూలంగా ‘రక్షణ రంగ కేటాయింపు’లను ఎగతాళి చేయడం అలవాటుగా మారింది.
  తొంభయ్యో దశకం తర్వాత రక్షణ రంగంపై పీ.వీ.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించినా, కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక కనుసన్నల్లోనే సాగింది. 2009-10వ సంవత్సరంలో రక్షణ రంగానికి కేవలం 2.8శాతం కేటాయింపు చేసింది నాటి కేంద్ర ప్రభుత్వం. అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో 17.6శాతం అన్నమాట. 2019-20 నాటికి అది 2శాతంగా పడిపోయింది.
  జీడీపీలో 15.5శాతం కేటాయింపులకు పరిమితమైంది. ఆ తర్వాత రక్షణరంగంపై కేంద్రం నియమించిన స్టాండింగ్ కమిటీ బడ్జెట్ లో కనీసం 3శాతం కేటాయించాలని ప్రతిపాదించింది. నిజానికి ప్రతిపక్షాలు, వామపక్ష మేధావులు ఆరోపిస్తున్నట్టూ కేంద్రం రక్షణ బడ్జెట్ ను అర్థరహితంగా పెంచడం లేదు. పరిస్థితికి తగినట్టూ, ఆర్థిక వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని క్రమేపీ రక్షణ రంగాన్ని మరింత పరిపుష్ఠం చేస్తోంది.
  గత ఏడేళ్లుగా మోదీ ప్రభుత్వం రక్షణ రంగ కేటాయింపులను విచ్చలవిడిగా పెంచుతూ పోయిందా? 2014లో ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయుధ దిగుమతులు తగ్గాయా? పెరిగాయా? స్వదేశీ తయారీ ఆయుధాల ఎగుమతి రంగంలో మన దేశం నిజంగానే ప్రగతిని సాధించిందా? స్వదేశీ ఆయుధ తయారీలో డీఆర్డీఓ పాత్ర ఏంటి? ఇండో-పసిఫిక్ వ్యూహం తాజా బడ్జెట్ పద్దులో ప్రతిఫలించిందా? డ్రాగన్ నియంత్రణను ఆర్థిక శాఖ పరిగణలోకి తీసుకుందా?
  ఇలాంటి అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను…..
  గడచిన రెండేళ్ల కాలంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రక్షణరంగంపై దృష్టి సారించింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2020, ఫిబ్రవరి 15న లక్నో కేంద్రంగా రక్షణ రంగంలో సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు భావసారూప్యం కలిగిన దేశాలన్నీఒక్క తాటిపైకి వచ్చాయి. ఉగ్రవాదం, మహిళల అక్రమ రవాణ ముఠాల నియంత్రణ, సైబర్ దాడులను దీటుగా ఎదుర్కోనేందుకు రక్షణ వ్యూహాలను సిద్ధం చేయాలని భావించాయి.
  రక్షణ ఉత్పత్తుల నూతన ఆవిష్కరణ అవసరాన్ని గుర్తించి, వివిధ దేశాల శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఆయుధ ఉత్పత్తిని వేగిరం చేయాలని నిర్ణయించాయి. దిగుమతులను సాధ్యమైనంత నివారించి, స్వదేశీ ఆయుధ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని 40కి పైగా దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భారత రక్షణ రంగ ఎగుమతులు- 2018-19 నాటికి 10,745 కోట్లకు చేరాయి. వచ్చే అయిదేళ్లలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిని 35వేల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష నిర్దేశనం చేసుకుంది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అదే సంకల్పం ప్రస్ఫుటించింది.
  ఎగుమతులు విస్తరించని పక్షంలో రక్షణ బడ్జెట్‌ఎంత పెరిగినా- దేశీయ అవసరాలు తీరే పరిస్థితి లేదు. కేవలం దిగుమతులతోనే ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడమూ సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ సామగ్రి దిగుమతుల్లో భారత్‌రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితి మారాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. రక్షణ రంగ ఎగుమతులు సాధారణ ఎగుమతులతో పోలిస్తే పూర్తిగా భిన్నం. అంతర్జాతీయ శక్తుల ఆంక్షల పరిధిలో ఈ ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. భారత్‌సైతం ‘వాసెనార్‌’-Wassenaar Arrangement, ‘ఎంటీసీఆర్‌’-Missile Technology Control Regime లాంటి అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగస్వామి.
  చిన్న, మధ్యశ్రేణి ఆయుధాలు, పరికరాలు, విడిభాగాల ఎగుమతులే అధికం. తేలికపాటి హెలికాప్టర్లు, పెట్రోలింగ్‌నౌకలు, ఆర్మర్‌ప్లేట్స్‌, స్లీపింగ్‌బ్యాగ్స్‌, బులెట్‌ప్రూఫ్‌జాకెట్లు, పేలుడు నుంచి రక్షణ ఇచ్చే దుప్పట్లు, హెల్మెట్లను 42 దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. ఒక్క అమెరికాకే అయిదువేల కోట్ల రూపాయల విలువైన పరికరాలను 2018-19లో భారత్‌ఎగుమతి చేసింది. ఇటీవల 350 కోట్ల విలువైన 50వేల బోఫోర్స్‌శతఘ్నుల్లో ఉపయోగించే అమ్యూనిషన్ ను యూఏఈకి ఎగుమతి చేసే ‘ఆర్డర్‌’ను మనదేశం దక్కించుకుంది.
  గడచిన రెండేళ్ల కాలంలో పాకిస్థాన్, చైనాలతో ఘర్షణ తీవ్రం కావడంతో సరిహద్దుల రక్షణ, త్రివిధ దళాల ఆధునీకరణ, ఆయుధ సంపత్తి సమీకరణ, స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని వేగిరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. తాజా బడ్జెట్ లో కేటాయింపులు సుదీర్ఘలక్ష్యాల కారణంగానే పెంచింది.
  భారత్‌తయారు చేసిన తేజస్‌యుద్ధవిమానంపట్ల- మలేసియా, కొలంబియా, ఇండొనేసియా, ఈజిప్ట్‌, శ్రీలంక వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. కానీ, ఈ విభాగంలో చైనాకు చెందిన జె-17, దక్షిణ కొరియాకు చెందిన గోల్డెన్‌ఈగిల్‌, రష్యాకు చెందిన యాక్‌ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా రక్షణ ఉత్పత్తులు పెరిగి.. భారత్‌కు యుద్ధవిమాన విపణి ద్వారాలు తెరుచుకుంటే- రక్షణ రంగ ఎగుమతుల్లో పురోగతి ఖాయం. ఇక భారత్‌ రూపొందించిన బ్రహ్మోస్‌క్షిపణులకు రష్యాలో తయారైన పీ-800 ఆనిక్‌క్షిపణులు విపరీతమైన పోటీ ఇస్తున్నాయి.
  వీటికి బ్రహ్మోస్‌స్థాయి సామర్థ్యం లేకపోయినా- ధర విషయంలో రాజీపడుతున్న చిన్న దేశాలు వాటి వైపు మొగ్గుచూపుతున్నాయి. రష్యాపై అమెరికా ఆంక్షల కారణంగా పరిస్థితి భారత్‌కు కొంత అనుకూలంగా మారింది. ధనుష్‌శతఘ్నులు వంటివి అంతర్జాతీయ విపణిలోకి వస్తే భారత్‌స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. దీంతోపాటు అభివృద్ధి చెందిన దేశాల ఆయుధాల ధరలతో పోలిస్తే భారత్‌ఆయుధాల ధర కొంత తక్కువగా ఉంటుంది.
  ఇండో-పసిఫిక్‌లో చైనాతో తీవ్ర పోటీ నెలకొనడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను ఓ మోస్తరు పెంచింది. నావికాదళానికి పెద్దపీట వేసింది. వాయుసేన ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన క్యాపిటల్‌ బడ్జెట్‌లో సింహభాగం దక్కించుకుంది. నావికాదళ కేటాయింపుల్లో 43శాతం పెరుగుదల కనిపించింది.
  2022-23 ఆర్థిక సంవత్సరానికి సైనిక దళాలకు మొత్తం 5.25లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. గతేడాది కేటాయించిన 4.78లక్షల కోట్ల కంటే 9.82శాతం పెంచి 46,970 కోట్లను అదనంగా కేటాయించారు. రక్షణ దళాలు చెల్లించే పెన్షన్ల మొత్తం కూడా 3శాతం వరకు పెరిగింది. రక్షణ బడ్జెట్‌లో త్రివిధ దళాల జీతాలు, రేషన్‌, నిర్వహణ ఖర్చులు, పెన్షన్లు వంటి వ్యయాలు పోను ఆయుధ కొనుగోళ్లకు వెచ్చించే దాన్ని కేపిటల్ అలోకేషన్స్ అంటారు. ఈ కేటాయింపులను 12.82 శాతం పెంచి 1.52 లక్షల కోట్లు కేటాయించింది.
  వాయుసేనకు ఈ సారి కేపిటల్ బడ్జెట్‌56,851 కోట్లు దక్కింది. గతేడాదితో పోలిస్తే ఇది కేవలం 4.5శాతం ఎక్కువ. ఇక నావికాదళానికి 47,590.99 కోట్లు దక్కాయి. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 43 శాతం ఎక్కువ. ఇక ఆర్మీకి ఈ ఏడాది కేటాయింపుల్లో కోత పడింది. ఈ సారి కేవలం 32, 102 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.36,481 కోట్లతో పోలిస్తే ఇది 12.2శాతం తక్కువ.
  చైనా నావికాదళం వద్ద సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యధిక నౌకలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం హిందూమహా సముద్రంలో కూడా మెల్లగా కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో డ్రాగన్‌కు అడ్డుకట్ట వేయాలంటే భారత నావికాదళం అధునాతన సామర్థ్యాలను తప్పనిసరిగా అందిపుచ్చుకోవాల్సిందే. అంతేకాకుండా.. గతేడాది రక్షణ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని నావికాదళమే అత్యధికంగా వినియోగించుకొంది.
  వాయుసేనకు కేటాయించిన మొత్తంలో కేవలం 70శాతం మాత్రమే వాడుకొంది. సైన్యానికి కేటాయించిన నిధుల్లో కేవలం 40శాతం మాత్రమే వాడుకోవడంతో ఈ సారి కోతపెట్టక తప్పలేదు. త్రివిధ దళాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలను అత్యధికంగా వాడుతున్నది నావికాదళమే. న్యూక్లియర్‌సబ్‌మెరైన్లు, టార్పిడోలను భారత్ తయారు చేస్తోంది. తాజా బడ్జెట్‌లో ఆయుధ కొనుగోళ్లకు కేటాయించిన మొత్తంలో 68శాతం దేశీయ కొనుగోళ్లకే వెచ్చించాలని నిర్ణయించింది.
  కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయం గరిష్ఠంగా పడిపోయింది. భారత రక్షణరంగ కేటాయింపుల్లో వృద్ధి మందగించింది. వాస్తవానికి 2021-22 సంవత్సరంలో 4.78లక్షల కోట్లను కేటాయించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.4శాతం మాత్రమే అధికం.
  కాకపోతే కీలక ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు అవసరమైన కేపిటల్ అలోకేషన్స్ ను 19శాతం పెంచింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా ఇదే సమయంలో చైనాతో ముప్పును ఎదుర్కొంటున్న జపాన్‌తన రక్షణ రంగ బడ్జెట్‌ను భారీగా పెంచి 4.69 బిలియన్‌డాలర్లకు చేర్చింది. జపాన్‌చరిత్రలో ఇదే అతిపెద్ద డిఫెన్స్‌బడ్జెట్‌. ఇక తైవాన్‌కూడా గతేడాది మధ్యలో 8.6 బిలియన్‌డాలర్లను అదనంగా రక్షణ రంగానికి కేటాయించింది.
  త్రివిధ దళాల అవసరాలు తీరాలంటే కొన్నేళ్లపాటు దేశ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 3 నుంచి 3.5శాతం కేటాయింపులు ఉండాలని నిపుణులు పదే పదే చెపుతున్నారు. 2020లో చైనాతో ఘర్షణలు తీవ్రం కావడంతో తూర్పు లధాక్ ప్రాంతంలో అనేక లోపాలను గమనించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇందుల్లో భాగంగానే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ను మరింత పటిష్ఠం చేసింది.
  భారత్‌వాడుతున్న మిగ్‌ విమాన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 450 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 42 వైమానిక దళ స్క్వాడ్రన్లు అవసరం కాగా.. ప్రస్తుతం దాదాపు 30 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత 18 నెలల్లో రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74శాతానికి పెంచింది. కొన్ని రిజర్వ్డ్ పరికరాలు మాత్రం భారత్‌నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన విధించింది. డిఫెన్స్‌అక్విజేషన్‌ప్రోసీజర్‌ను విడుదల చేసింది.
  గడచిన ఏడేళ్లుగా డీఆర్డీఓ చేస్తున్న కృషి కారణంగా భారత రక్షణ రంగం స్థిరమైన పురోగతిని సాధిస్తోంది. డీఆర్డీఓ కృషి వల్ల నేల మీద నుంచి నేలకు, నేల నుంచి నింగికి, నింగి నుంచి నింగికి ప్రయోగించే క్షిపణులను, క్రూజ్‌క్షిపణులు, పలు వేదికల నుంచి ప్రయోగించగల క్షిపణులు రూపొందాయి. తేజస్‌యుద్ధ విమానం, అర్జున్‌ట్యాంకు, ఉప్రగహ విధ్వంస క్షిపణి, రాడార్‌నిరోధక రుద్రం క్షిపణి, పినాక రాకెట్‌వ్యవస్థ, రుస్తుం-2 పైలట్‌రహిత విమానం రూపకల్పనతో అపూర్వ విజయాలు సాధించింది.
  ఏసా రాడార్లు, జలాంతర్గాముల కోసం సోనార్లు, ఎలక్ట్రానిక్‌యుద్ధ వ్యవస్థలు, అత్యధిక దూరాలదాకా గుండ్లను పేల్చగలిగే 155 మి.మీ. శతఘ్ని తదితర అధునాతన ప్రత్యేక ఆయుధాలను రూపొందించింది. ఇలాంటి ప్రత్యేక పరిజ్ఞానాలున్న అతి కొద్ది దేశాల సరసన భారత్‌సగర్వంగా నిలుస్తోంది.
  ఇటీవల నేల మీద నుంచి నేలకు ప్రయోగించే ప్రళయ్‌క్షిపణిని ప్రయోగించి స్వల్పకాలంలోనే సంక్లిష్ట ఆయుధాలను సృష్టించే సత్తా ఉందని నిరూపించింది. అత్యాధునిక అగ్ని-పి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. శత్రు డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేయగల వ్యవస్థనూ రంగంలోకి దించుతోంది. ఈ డ్రోన్‌నిరోధక సాంకేతికతను పరిశ్రమలకూ బదిలీ చేస్తోంది. మన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను శత్రు రాడార్లు, క్షిపణుల నుంచి రక్షించే అధునాతన ఎలెక్ట్రానిక్‌యుద్ధ సాంకేతికతను సిద్ధం చేసింది.
  రాబోయే రోజుల్లో పొరుగుదేశాలతో వచ్చే తలనొప్పులను సాహసంతో ఎదుర్కోనేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. రక్షణ రంగం అనగానే కేవలం యుద్ధదృష్టితో వ్యాఖ్యలు చేయడం సరికాదు. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో బహుముఖ రంగాల్లో పోటీ పడాలంటే దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రాథమిక కర్తవ్యం.

  Related Stories