భారత్‎లో పాక్ మహిళా సర్పంచ్..!

0
1439

మన దేశంలో నకిలీ ముఠాలున్నంత కాలం.. నకిలీగాళ్ల ఆటలు సాగుతూనేవుంటాయి. తాజాగా యూపీలో వెలుగుచూసిన సంఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పాకిస్తాన్‎కు చెందిన ఓ మహిళ ఏకంగా గ్రామ సర్పంచ్ అయిపోయింది. చాలా కాలంగా తన వీసాను పొడిగించుకుంటూ వెళుతున్న ఆ మహిళ.. ఏకంగా సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలుపొందింది. ఈ విషయం తెలుసుకుని షాక్ కు గురైన పోలీసులు.. ఆ తర్వాత తేరకుని.. పరారీలో వున్న ఆమెను కొద్దిరోజుల పాటు వెతికి మరీ పట్టుకున్నారు. యూపీలోని జలేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ కు చెందిన బానో బేగం అనే మహిళ.. యూపీలోని ఎటా దగ్గర్లోని గడావు గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఆమె ఇటీవల బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయంపై జలేసర్ పోలీస్ స్టేషన్‎కు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో జనవరి 1న పంచాయతీ రాజ్ అధికారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బానో బేగం.. అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు ఊరినుంచి పారిపోయింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఆమెకోసం వెతికిన పోలీసులు, ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు. ఎటా జిల్లా ఎస్ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇక, పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన బానో బేగం.. 35 ఏళ్ల క్రితం ఎటాలోని తన బంధువు ఇంటికి వచ్చింది. అక్కడే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఎటాలోనే దీర్ఘకాలిక వీసాపై ఆమె నివాసం ఉంటోంది. పలుమార్లు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసినా రాలేదు. ఆపై తన వీసాను పొడిగించుకుంటూ భారత్ లోనే ఉండిపోయింది. ఈ క్రమంలో 2015లో పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఎన్నికైంది. తర్వాత అక్కడి గ్రామ సర్పంచ్ మరణించడంతో బానో బేగం తాత్కలిక సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆ పదవిలో ఉండేసరికి అందరూ ఊరిపెద్దే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆమె 65 ఏళ్ల ఓ పాకిస్థానీ అని తెలిసి అంతా షాక్‌ అయ్యారు. బానో బేగం యాక్టింగ్ హెడ్ అయిన తరువాత గ్రామ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసి కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఆమె ఎన్నికైన సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న ధ్యాన్ సింగ్ సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి బానో బేగంను కోర్టు ముందు నిలిపారు.

నిబంధనల ప్రకారం, విదేశీయులు భారతదేశంలో నిర్వహించే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు. అయితే, సదరు మహిళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆధార్ కార్డు, ఓటర్‌ కార్డు, రేషన్ కార్డు కూడా సిద్ధం చేసుకుంది. అసలు పౌరసత్వమే లేని ఆమెకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆధార్, ఓటర్ ఐడీ ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా మోసానికి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here