మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన త్వరలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. 88 ఏళ్ల శ్రీధరన్ విజయ్ యాత్రలో భాగంగా బీజేపీలో చేరనున్నారని కేరళ బీజేపీ విభాగం తెలిపింది.
మరికొన్ని నెలల్లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తన స్వస్థలం మళ్లాపురంలో బీజేపీలో చేరికపై శ్రీధరన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. గత 10ఏళ్లుగా కేరళలోనే ఉంటున్నానని, పలు ప్రభుత్వాల పనితీరును తాను చూశానన్నారు.
నా అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకు బీజేపీ సరైన మార్గమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అవకాశం ఇస్తే బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమేనని తన మనసులో మాటను బహిర్గతం చేశారు. కేరళ ఎన్నికలు తనకు ఓ మంచి అవకాశమని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, దేశంలో మెట్రో రైళ్ల రూపకర్తగా, మెట్రో మ్యాన్‌గా శ్రీధరన్‌కు అరుదైన ఘనత దక్కింది. శ్రీధరన్ 2011లో న్యూఢిల్లీ మెట్రో నుంచి రిటైర్ అయ్యారు. ఆ తరువాత నుంచి కేరళలోనే సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమయ్యారు. అయితే వయసురీత్యా బీజేపీ నియమాలు, నిబంధనలు శ్రీధరన్‌ను ఎన్నికల బరిలోకి దిగకుండా అడ్డుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి మెట్రోమ్యాన్ డ్రీమ్ నెరవేరుతుందా లేదా అనేది.