ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటం, లావాలా ఉప్పొంగిన చైతన్యం, జాతీయవాద రాజకీయాలకు ప్రతిరూపం వీర్ సావర్కర్. ఒక జాతీయవాద విప్లవకారుడు మంచి కవిగా, రచయితగా, సాహితీవేత్తగా కూడా రాణించడం అరుదు. అలాంటి అరుదైన దేశభక్తుడూ, హిందూత్వ రాజకీయ సేనాని సావర్కర్ భారత దేశ చరిత్రలో చిరస్మరణీయుడు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా నేషనలిస్ట్ హబ్ ఆ మహనీయుడికి వినమ్రంగా నివాళి అర్పిస్తోంది.
వీర్ సావర్కర్ నిష్ర్కమణ తర్వాత భారత దేశ రాజకీయాల్లో ఓ కుదుపు వచ్చింది. 1966లో సావర్కర్ మరణం తర్వాత సరిగ్గా దశాబ్ద కాలానికి దేశమంతా కారాగారమైంది. గాంధీ హత్య తర్వాత అపప్రదను ఎదుర్కొన్న రైటిస్ట్ రాజకీయాల ప్రాసంగీకత మరింత పెరిగింది. 1977 దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత రామపక్ష రాజకీయ నినాదం మరింత విస్తృతమవుతూ వచ్చింది.
ఆధునిక భారతదేశ రాజకీయ చరిత్రలో వీర్ సావర్కర్ కంట్రిబ్యూషన్ ఏంటి? దేశ రాజకీయ భవితవ్యంపై సావర్కర్ కు ఉన్న దూరదృష్టి ఎలాంటిది? వామపక్ష పార్టీలు, వారి మద్దతుతో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి సావర్కర్ పట్ల గుడ్డి వ్యతిరేకత ఉండటానికి కారణమేంటి? సావర్కర్ పై వామపక్ష పార్టీలు చేసిన అసత్య ప్రచారమేంటి? వర్తమాన రాజకీయాల్లో సావర్కర్ ప్రాసంగీకత ఏంటి?
ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
1857వ సంవత్సరంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఓటమి పాలై ఉండవచ్చు కానీ అది రగిల్చిన స్వాతంత్య్ర కాంక్ష ఎన్నో పోరాటాలకు నాంది పలికింది. లోక మాన్య తిలక్, సుభాష్ చంద్ర బోస్, మోహన్‌దాస్ గాంధీ వంటి నేతల వ్యక్తిత్వాలను సమున్నతంగా తీర్చి దిద్దింది.
గాంధీ నాయకత్వం సత్యం-అహింస మార్గాలనవలంబిస్తే వీర సావర్కర్, భగత్‌సింగ్, మదన్‌లాల్ ఢింగ్రా, రాజగురు వంటి విప్లవకారులు సాయుధ తిరుగుబాటును ఆశ్రయించారు. ఆ వీరులు చేసిన బలిదానాల కారణంగా శాంతి, సంప్రదింపు, సర్దుబాటు బాటలో స్వాతంత్ర్యం వచ్చింది.
సావర్కర్ అనగానే ఆయన తిరుగుబాటు తత్వం గుర్తుకు వస్తుంది. కానీ ఆయన వ్యక్తిత్వం, రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రజ్ఞ, దార్శనికత, సాహిత్య కృషి, హిందూ సమాజానికి చేసిన సేవలు చరిత్రలో నమోదు కాని వాస్తవాలు.
హిందూత్వను రాజకీయ అంశంగా చేసిన సాహసీ, ద్రష్ట వీర్ సావర్కర్. అండమాన్ నుంచి తిరిగి వచ్చిన సావర్కర్ ‘హిందుత్వ-హూ ఈజ్ హిందూ?’ అనే పుస్తకం రాశారు. అందులో ఆయన “మొదటిసారి హిందుత్వను ఒక రాజకీయ ఆలోచనా విధానంగా ఉపయోగిస్తున్నట్టూ’’ బాహటంగానే తేల్చిచెప్పారు. సెల్యులర్ జైలు గదిలో ఆయన గడిపిన 9 ఏళ్ల 10 నెలల శిక్షా కాలం సావర్కర్ లో మరింత పట్టుదలను పెంచింది. భారత దేశ భవిష్యత్ రాజకీయాలను మరింత తీక్షణ దృష్టితో అంచనా వేశారు సావర్కర్.
అండమాన్ సెల్యూలార్ జైలు రికార్డుల ప్రకారం అక్కడ ప్రతి నెలా ముగ్గురు, నలుగురు ఖైదీలకు ఉరిశిక్ష వేసేవారు. ఉరిశిక్ష వేసే ప్రాంతం ఆయన ఉన్న గదికి సరిగ్గా కింద ఉండేది. గొంతుమీద కత్తి వేలాడుతున్నా వెరవని ధీశాలి వీర్ సావర్కర్.
1937 నుంచి హిందూ మహాసభ అధ్యక్షునిగా ప్రత్యక్ష రాజకీ యాల్లో సావర్కర్ చేసిన కృషి అత్యంత కీలకమైంది. 1937లో అహ్మదాబాద్‌లో జరిగిన అఖిల భారత హిందూ మహాసభ వార్షిక వేడుకల్లో అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘భారత రాజ్యాన్ని పూర్తిగా భారతీయంగానే ఉండ నివ్వండి. ఎన్నికల హక్కుల్లోగాని, ఉద్యోగాలలోగాని, పదవులలోగాని, పన్నుల విధానాలలోగాని, హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య భేదాలు చూపవద్దన్నారు సావర్కర్.
‘భారత రాజ్యంలోని ప్రతి వ్యక్తినీ వ్యక్తిత్వం ఆధారంగా నిలబడ నివ్వండి. ఒక వ్యక్తికి ఒక ఓటు అనే దానిని సార్వజనీన సిద్ధాంతంగా ఉంచాలంటూ’’ తేల్చి చెప్పారు. సావర్కర్ గొప్ప రాజకీయ దార్శనికుడు. దేశ విభజన జరిగి ఒక ముస్లిం దేశం ఏర్పడగలదని 1937లోనే అంచనా వేసిన ద్రష్ట సావర్కర్.
సావర్కర్ 1908లో లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ను రాశారు. నాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్య్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పిన సాహసి సావర్కర్. దీన్ని ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ పుస్తకాన్ని నిషేధించింది.
1924 నుంచి 1937 వరకు సావర్కర్ రత్నగిరిలో గృహనిర్భందంలోనే ఉన్నారు. సావర్కర్ ను చివరకు ఐదు సంవత్సరాలు రాజకీయాలలో పాల్గొనకూడదనే షరతుతో 1937లో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. 5 సంవత్సరాల కాలాన్ని ఆయన హిందువులను సంఘటితం చేసేందుకు, అంటరాని తనం నిర్మూలనకు ఉపయోగించుకున్నారు. రత్నగిరి జైలులో ఉండగా సావర్కర్ ‘హిందుత్వ’ అనే పుస్తకం రాశారు.
1948లో మహాత్మా గాంధీ హత్య జరిగిన ఆరు రోజులకు గాంధీ హత్యకు కుట్ర పన్నారని వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ముంబైలో అరెస్ట్ చేశారు. గాంధీ హత్యలో ప్రమేయం ఉన్న 8 మందితో ఆయన్ను కూడా అరెస్టు చేసినపుడు సావర్కర్ వ్యక్తిత్వానికి గట్టి దెబ్బ తగిలింది. అయితే, తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు.
సావర్కర్ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయనపట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు.
జీవితంలో చివరి రెండు దశాబ్దాలు సావర్కర్ రాజకీయ ఏకాకిగా, అపకీర్తితో గడిపారు. ఆయన జీవిత చరిత్ర రాసిన రచయిత ధనంజయ్ కీర్ తన ‘సావర్కర్ అండ్ హిజ్ టైమ్స్’ పుస్తకంలో “ఎర్రకోటలో జరిగిన విచారణలో జడ్జి ఆయన్ను నిర్దోషిగా, నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టేకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే కొంతమంది నిందితులు సావర్కర్ పాదాలమీద పడ్డారంటూ వివరించారు.
అండమాన్ జైల్లో ఉంటున్నప్పుడు రాతి ముక్కలనే పెన్నుగా చేసుకున్న ఆయన గోడలపై 6 వేల కవితలు రాశారు. వాటిని కంఠస్థం కూడా చేశారు. అంతేకాదు, వీర్ సావర్కర్ ఐదు పుస్తకాలు కూడా రాశారు. కానీ, ఆయన పేరును మహాత్మా గాంధీ హత్యతో జోడించగానే, ఆయన కనిపించరు. సావర్కర్ రాజకీయ ఐడియాలజీ మాత్రమే కనిపిస్తుంది. 1966లో మరణించిన రెండు దశాబ్దాల తర్వాత వీర్ సావర్కర్ భారత రాజకీయాల్లో ఒక ‘పోలరైజింగ్ ఫిగర్’ అయ్యారు. ఇంకోమాటలో చెప్పాలంటే 1990ల తర్వాత సావర్కర్ ప్రాసంగీకత మరింత పెరిగింది.
వామపక్షాలు చేసే ప్రధాన విమర్శ బ్రిటీష్ పాలకులకు సావర్కర్ ‘అండర్ టేకింగ్’ రాసిచ్చారన్నది తరచూ వినిపిస్తుంటుంది. బ్రిటీష్ పాలన అత్యంత పాశవికంగా కొనసాగుతున్న కాలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే సావర్కర్ ‘అండర్ టేకింగ్’ రాసిచ్చారన్నది ప్రధానం. కేవలం సావర్కర్ మాత్రమే కాదు, నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీపాద అమృత డాంగే సైతం బ్రిటీష్ రాణిని ఉధ్దేశిస్తూ ‘అండర్ టేకింగ్’ లెటర్ రాసిచ్చారన్నది చారిత్రక వాస్తవం.
పలు సందర్భాల్లో సాయుధ తిరుగుబాటు చేస్తున్న బృందాల విషయంలో గాంధీ పట్టింపు లేకుండా వ్యవహరించారన్న విమర్శల వెనుక సైతం వ్యూహాత్మక కారణాలే ఉన్నాయంటారు చరిత్రకారులు. బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ రూపకల్పనలో నిమగ్నమైన సుభాష్ చంద్రబోస్ వైఖరిని ఖండిస్తూ నెహ్రూ బ్రిటీష్ పాలకులకు లేఖ రాసిన ఉదంతం ఉండనే ఉంది.
వలస పాలన కాలంలో వివిధ రాజకీయ నేపథ్యాలున్న సంస్థలు, వ్యక్తులు తీవ్ర నిర్బంధం కారణంగానో, స్వాతంత్ర్య పోరాటాన్ని విస్తరించాలన్న కాంక్షతోనో కొన్ని సందర్భాల్లో తాత్కాలిక వెనుకడుగువేసి ఉండవచ్చు. దాన్ని రాజీపడటంగా అర్థం చేసుకుంటే అది సంకుచితత్వమే తప్ప చారిత్రక దృష్టి కాదు.
సావర్కర్ దార్శనికత వర్తమాన భారత రాజకీయాలకు అవసరం. సావర్కర్ తన రచనల్లో పేర్కొన్న అంశాలు కొన్ని నేడు ఉనికిలో ఉండకపోవచ్చు. కానీ, పరిస్థితిని అంచనా వేసి, భవిష్యత్తును ఊహించగల సావర్కర్ దూరదృష్టి సావర్కర్ నుంచి మనం స్వీకరించడమే ఆయనకు మనమిచ్చే నివాళి.