భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. గత కొన్నేళ్లుగా కవ్వింపు చర్యలు కొనసాగిస్తూ ఎందరో ప్రాణాలు తీసింది పాకిస్తాన్. అటు భారత సైన్యం కూడా ఉగ్రదేశం పీచమణచేలా.. సరిహద్దులను కాపాడుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దులు అనుక్షణం ఎంత ఉద్రిక్తంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు నుంచి ఇటైనా.. ఇటు నుంచి అటైనా.. చిన్న చీమ బోర్డర్ దాటినా కూడా మామూలుగా వుండదు వ్యవహారం. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఓ భారతీయ హెలికాప్టర్.. ఆకస్మాత్తుగా పాకిస్తాన్ లో ప్రత్యక్షమైంది. ఇస్లామాబాద్ విమానాశ్రయంల అత్యవసరంగా దిగేందుకు.. హెలికాప్టర్ సిబ్బంది ప్రయత్నించడం.. అందుకు పాకిస్తాన్ పౌర విమానయాన అధికారులు అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండయింది. ఇందకీ ఏం జరిగింది..? ఇండియన్ హెలికాప్టర్ పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది..?
ఇంతకీ విషయం ఏంటంటే.. బ్రిటన్‌కు చెందిన ఓ పేషెంట్‌ను తీసుకుని.. ఇండియన్ ఎయిర్ అంబులెన్స్ కోల్‌కతా నుంచి తజికిస్తాన్ రాజధాని దుషన్‌బేకు బయల్దేరింది. అందులో ఎయిర్ అంబులెన్స్ లో బ్రిటన్‌కు చెందిన పేషెంట్‌తోపాటు ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నారు. అయితే, హెలికాప్టర్ ఎమర్జెన్సీ టేకాఫ్ అయితే తీసుకుంది కానీ.. అందులో సరిపడా ఇంధనం మాత్రం లేదు. దీంతో మార్గమధ్యంలో ఇబ్బంది రాకుండా ఉండాలంటే అత్యవసరంగా ఇంధనం నింపుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాడు పైలెట్. ఆ సమయంలో హెలికాప్టర్ పాకిస్తాన్ గగనతలంలో ఎగురుతోంది. దీంతో వెంటనే పైలెట్ పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధికారులను సంప్రదించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరాడు. పాకిస్తాన్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండయింది. ఆ వెంటనే ఇంధనం నింపుకుని.. రెండు గంటల తర్వాత తజికిస్తాన్‌కు బయల్దేరింది.
ప్రాణాపాయ స్థితిలో వున్న రోగిని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వినియోగించే విమానాన్ని ‘ఎయిర్ అంబులెన్స్’ అంటారు. ఈ అంబులెన్స్‌లో అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడటానికి కావాల్సిన అన్ని వస్తువులు, సౌకర్యాలు ఉంటాయి. రోగి క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి, రహదారి రద్దీని నివారించడానికి ఎయిర్ అంబులెన్స్‌లను ఉపయోగిస్తారు. అయితే, ఈ ఎయిర్ అంబులెన్స్ క్లిష్ట పరిస్థితులు ఎదురైతే.. ఏ దేశమైనా ప్రొటొకాల్స్ పక్కన బెట్టి ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాల్సి వుంటుంది.