ఏపీ పంచాయతీ నాలుగు దశల ఎన్నికలు ముగిసాయి. సాధరణ ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో చాలాచోట్ల ఘర్షణలు, వాగ్వాదాలు దర్శనమిచ్చాయి.. మొత్తం నాలుగు విడతలను పరిశీలిస్తే కొన్ని చోట్ల చెదరుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయని చెప్పాలి.
అధికార పార్టీ అయితే ప్రజాస్వామ్యం నెగ్గిందని.. అన్ని ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కనిపించదని అంటోంది. విపక్షాలు మాత్రం అరాచకాలతో ఫలితాలు సాధించారని.. ప్రతిపక్షాలు నెగ్గిన చోట కూడా.. వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా అధికారులను బెదిరించారంటూ ఆరోపిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా నాలుగు విడతల్లోనూ అధికారులు ప్రకటించిన ఫలితాల బట్టి చూస్తే వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. దాదాపు అన్ని జిల్లాలోనూ 70 శాతానికి పైగా సీట్లు అధికార పార్టీ మద్దతు దారులే గెలిచారు.
నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు. సుమారు 10,890 మంది సర్పంచులు, 47,500 మంది వార్డు మెంబర్లు నేరుగా ఎన్నికైనట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకితభావంతో పని చేసిందని కితాబిచ్చారు. ప్రతి విడతలో 80 శాతానికి పైగా స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ముందుగా భావించామని, అయితే కోర్టులో కేసుల కారణంగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని ఎస్‌ఈసీ అన్నారు. అవాంతరాలు తొలిగి పోయాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మార్చి 2 నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. పట్టణ ఓటర్లు కూడా పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి విజ్ఞప్తులపై చర్చిస్తున్నామని.. వాటిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు.