More

  నిఘా దిగ్గజం ‘ మొస్సాద్’ కు చుక్కలు చూపించిన ‘ హమాస్ ‘

  పశ్చిమాసియాకు ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. చమురు వనరు, వ్యూహాత్మక భూభాగం, సముద్ర వాణిజ్యం, దాని చుట్టూ రాజకీయం, వీటి వెన్నంటే ఉగ్రవాదం…ఇదీ పశ్చిమాసియా అనిశ్చితికీ, అమెరికా ఆధిపత్యానికీ, ఆసియా ఖండంలో అశాంతికీ కారణం. ఇజ్రాయెల్, ఈజిప్టు సరిహద్దులలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉన్నప్పటికీ హమాస్‌కు ఇన్ని అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి ? గాజాను గుప్పిట పెట్టుకున్న ‘హమాస్’ పథకం ప్రకారం వేసిన ఉచ్చులో ఇజ్రాయిల్ పడిందా? హమాస్ వినియోగిస్తున్న టెక్నాలజీ ఏంటి? ఆయుధ తయారీలో అనుసరిస్తున్న విధానాలేంటి? వందేళ్ల పశ్చిమాసియా అశాంతికి చరమగీతం పాడగలమా? లేదా అసాధ్యమా? ఉచ్చులు బిగించడం హామాస్ కు ఎలా సాధ్యం? హమాస్ వెనుక ఇరాన్ ఉందా? హమాస్ ఒంటికన్ను ఉగ్రవాది గురించిన వివరాలేంటి? ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  మధ్య ప్రాచ్యమని అమెరికా పిలిచే పశ్చిమాసియా రాజకీయాలు అర్థం చేసుకోవడమంటే ‘‘understanding Middle Eastern politics is like playing three-dimensional chess underwater, with all the pieces moving simultaneously ’’ అంటారు భారత జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్. అంటే ముగ్గురు అటగాళ్ల మధ్యసాగే చదరంగ వ్యూహాన్ని అర్థం చేసుకోవడమంత కష్టమనీ, అన్ని పావులూ ఒకే సారి ఎత్తుగడలో భాగమవుతుంటే జీర్ణం కావడం అసాధ్యమని అర్థం. రష్యాలో వచ్చిన అక్టోబర్ విప్లవం మొదలు ఇప్పటి వరకూ అరేబియా సముద్ర తీరంలో ముసలం నానాటికీ తీవ్రమవుతోంది. ‘‘HAMAS’’ అనే హంతక ముఠా ప్రపంచ గెరిల్లా యుద్ధకళకు కొత్త పాఠాలు నేర్పింది. మట్టి నుంచి మారాణాయుధాలు తయారు చేయడం నేర్చుకుంది. ఇజ్రాయిల్ పేల్చిన రాకెట్ శకలాలతో షార్ట్ రేంజ్ శతఘ్నులను తయారు చేయడం నేర్చుకుంది. టన్నెళ్ల సాయంతో యూదు రాజ్యాన్ని అస్తిరతకు గురిచేసే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ ఏడాది మే 10న మొదలైన గాజా యుద్ధం వెనుక ఆశ్చర్యానికి గురిచేసే వాస్తవాలున్నాయి. ఉగ్రసంస్థ హమాస్ 2000 తర్వాత మొదలు పెట్టిన రెండో ‘ఇంతిఫదా’ను సరికొత్త గెరిల్లా యుద్ధతంత్రం సాయంతో విజయవంతం చేయాలని వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగానే Subterranian Warfare రణతంత్రాన్ని మరింత తీవ్రం చేసింది. శతృవు ఆయుధ ప్రయోగం వల్ల పోగుపడిన వ్యర్థాలతో ఆయుధ తయారీ కోసం కొత్త ప్రయోగాలు చేసింది. ఫైబర్ గ్లాస్ నుంచి డ్రోన్లు, ఇనుప పైపులతో రాకెట్లు, ఉప్పు, ఆముదంతో రాకెట్ ఇంధనాన్ని తయారు చేయడం ఆరంభించింది. ఇప్పటి వరకు హమాస్ కేవలం ప్రాథమిక శ్రేణి రాకెట్లను మాత్రమే తయారు చేసుకోగలదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల మూలంగా సాధారణంగానే ఇజ్రాయిల్ ను సమర్థించే దేశాల స్వరం కాస్త తగ్గింది. అమెరికా ఎన్నికల తర్వాత ఆ దేశ విధానంలో మార్పు వచ్చింది. చైనా సహజంగానే పాలస్తినాకు, దాని మద్దతుదారైన ఇరాన్ కు అండగా నిలుస్తోంది. రష్యా మధ్యే వాదాన్ని అనుసరిస్తోంది. దీంతో హమాస్ శక్తి గతంలో కంటే పెరిగిందంటారు నిపుణులు.

  మరోవైపు ఇజ్రాయిల్ పొరుగున ఉన్న లెబనాన్ లో మీసం మెలేస్తున్న హిజ్బుల్లా హమాస్ కు పూర్తి స్థాయి మద్దతు తెలుపుతోంది. ఈ పరిస్థితిని గమనించిన ఇజ్రాయిల్ హమాస్ ఉద్దేశ పూర్వకంగా చేపట్టిన చికాకు చర్యలకు ఎందుకు ప్రతిస్పందించిందన్నదే అసలు సవాలు. గాజా చుట్టూ ఉండే ఇజ్రాయెల్, ఈజిప్టు సరిహద్దులలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉన్నప్పటికీ హమాస్‌కు ఇన్ని అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి ? గాజాలోని పాలస్తీనా గ్రూపులు, ఇరాన్ టెక్నాలజీని ఉపయోగించి సాధారణ వస్తువులతోనే దేశీయంగా రాకెట్లు తయారు చేసుకున్నట్లు నిపుణుల నివేదికలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఆయుధాలను తయారు చేయడానికి పైపులు, కాంక్రీట్‌లాంటి కొన్ని వస్తువులు, పదార్థాలను ఉపయోగించారు. అంటే, హమాస్ తీవ్రవాదులు ఇలాంటి ఆయుధాలను పదేపదే తయారు చేసుకోగలరు. వారిని ఎవరూ అడ్డుకోలేరు. 2014లో ఇజ్రాయెల్‌తో ఘర్షణ తర్వాత హమాస్ వర్గాలు భారీ సంఖ్యలో ఇలాంటి ఆయుధాలను తయారు చేసుకోవడం ప్రారంభించాయి. రాకెట్ల నాణ్యత, సంఖ్య పెరిగింది. హమాస్ ఇస్లామిక్ వర్గాలు తమపై 4,360 రాకెట్లను ప్రయోగించాయని, వీటిలో 680 రాకెట్లు గాజా ప్రాంతంలోనే పేలాయని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ ఉపయోగించిన రాకెట్లలో ఎక్కువ భాగం షార్ట్ రేంజ్ రాకెట్లని, దేశీయంగా తయారైన చవక రకం ఆయుధాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇనుప పైపులు, గొట్టాలను ఉపయోగిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు ఇజ్రాయెల్ వేసిన రాకెట్ల శకలాలను కూడా తమ రాకెట్ల తయారీకి ఉపయోగిస్తారు.

  హమాస్‌కు ఇరాన్ పరోక్షంగా సాయం చేస్తోంది. ఆయుధ డిజైన్‌లు ఇరాన్ నుంచి రాగా, హమాస్ వీటిని స్థానికంగా దొరికే పదార్ధాలు, వస్తువులతో తయారు చేసుకుంటుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ‌నెతన్యాహు కూడా ఇరాన్‌పై ఆరోపణలు చేశారు. ఇరాన్ మద్దతు లేకపోతే, ఈ సంస్థలన్నీ రెండు వారాల్లో కుప్ప కూలిపోతాయి. హమాస్ కేవలం ప్రాథమిక శ్రేణి రాకెట్లను మాత్రమే తయారు చేసుకోగలదు. గైడెడ్ రాకెట్లను తయారు చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అవసరం. అయితే, ఇటీవల హమాస్ ఒక డ్రోన్‌ను కూడా తయారు చేసిందని, ఇందుకోసం వివిధ దేశాలకు చెందిన విడి భాగాలను ఉపయోగించిందని తేలింది. చైనాకు చెందిన ఇంజిన్, మరో సంస్థకు చెందిన జీపీఎస్ వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ముందు హమాస్ టెక్నాలజీ తేలిపోతుందని, వీరి సాంకేతిక పరిజ్ఞానం ఇరాన్ సాయం తీసుకుంటున్న హౌతీ తిరుగుబాటు దారుల టెక్నాలజీ మాదిరిగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాలస్తీనా ఉగ్రవాద గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి కొన్నేళ్లుగా రాకెట్లను ఉపయోగిస్తున్నాయి. 2005 లో గాజా నుండి ఇజ్రాయెల్ వైదొలగడానికి ముందు, పాలస్తీనా పట్టణాల నుండి గాజాలోని ఇజ్రాయెల్ స్థావరాలపై మోర్టార్లు, రాకెట్లను పేల్చారు.

  2003లో గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించి, వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించిన తర్వాత హమాస్‌కు ఒకే ఒక రాకెట్ అందుబాటులో ఉంది. ఈజిప్టు సినాయ్ ద్వీపంలో తయారైన క్షిపణులను హమాస్ సంపాదించింది. ఈజిప్టు పాలకుడు మహ్మద్ మోర్సీని 2013లో ప్రజలు అధికారం నుంచి తొలగించే వరకు హమాస్‌కు సినాయ్ ద్వీపం నుంచి ఆయుధాలు అందాయి. కానీ, ప్రస్తుత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అధికారంలోకి వచ్చిన తర్వాత గాజా నుంచి ఈజిప్టులోకి ఉన్న సొరంగాలను మూసివేశారు. దీంతో ఆయుధాల రాక కూడా ఆగిపోయింది. ఈజిప్టు నుంచి సహకారం ఆగిపోయిన తర్వాత, ఇరాన్ సాయంతో స్థానికంగానే ఆయుధాలు తయారు చేసుకోవాలని హమాస్ నిర్ణయించినట్లు ఇజ్రాయిల్ అధికారి వెల్లడించారని రాయిటర్స్ పేర్కొంది. ఇందులో భాగంగా గాజా, ఇరాన్‌ల మధ్య కొందరు వ్యక్తులు పర్యటించినట్టూ ఆధారాలు సేకరించింది ఇజ్రాయిల్. గాజాలో హమాస్ గెరిల్లాలు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల రాకెట్లు తయారు చేస్తున్నారని, వీటి బరువు సుమారు 100 కిలోలు ఉంటుందని, ఇవన్నీ ఇరాన్ సహాకారంతోనే తయారవుతున్నాయని ధృవీకరించింది. ఇటీవల పాలస్తీన మిలిటెంట్‌ ఒకరు తన కరకు స్వరంతో ఇజ్రాయెల్‌కు ఓ హెచ్చరిక పంపారు. హమాస్ డిమాండ్‌లు నెరవేర్చక పోతే ఇజ్రాయిల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ హెచ్చరించింది.

  గాజాలో ఇజ్రాయెల్‌కు మోస్ట్ వాంటెడ్ లీడర్ మహ్మద్ డేఫ్‌. గాజా మీద తీవ్రంగా దాడులు జరుగుతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మహ్మద్ డేఫ్‌ గొంతు తొలిసారి వినిపించింది. కాకపోతే, ఆయన హెచ్చరికలను ఆ సమయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 11 రోజుల ఘర్షణ తర్వాత గాజా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇటీవలి ఘర్షణల సందర్భంగా కనీసం రెండుసార్లు డేఫ్‌‌ను చంపేందుకు ప్రయత్నించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బీబీసీకి ధ్రువీకరించింది. దీంతో డేఫ్‌ ఇప్పటి వరకు ఏడుసార్లు ఇజ్రాయెల్ హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నట్లయింది. డేఫ్ ను చంపడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలతో విసిగి పోయిన ఇజ్రాయెలీ దళాలు, ఇటీవలి ఘర్షణల సందర్భంగా హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. హమాస్‌లో అత్యంత ముఖ్యమైన నాయకులెవరు అన్నదానిపై వారి దగ్గర ఒక జాబితా ఉంది. డేఫ్‌ గురించిన సమాచారం ఎక్కువగా ఇజ్రాయెల్, పాలస్తీన మీడియాల నుంచే వస్తుంది. వాటి ప్రకారం డేఫ్‌ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్ధి శిబిరంలో 1965లో పుట్టారు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఈజిప్ట్ ఆక్రమణలో ఉంది. మహ్మద్ దయాబ్ ఇబ్రహిం అల్-మస్రి ఆయన అసలు పేరు. అయితే ఆయన వివిధ ప్రదేశాలకు తిరుగుతున్న క్రమంలో తన పేరును డేఫ్‌గా మార్చుకున్నారు. డేఫ్‌ అంటే అతిథి అని అర్థం. డేఫ్ ఎక్కడ ఎక్కువ కాలం ఉన్నారు, ఏం చదువుకున్నారు అన్నది మాత్రం పెద్దగా తెలియదు.

  హమాస్ పుట్టే నాటికి డేఫ్‌ యువకుడు. 1980లలో ఆయన హమాస్‌లో చేరాడు. ఇజ్రాయెల్‌పై ద్వేషాన్ని నరనరాన నింపుకొన్న డేఫ్‌, హమాస్ సైన్యంలో వేగంగా ఎదిగాడు. హమాస్‌ కీలక నేతలకు డేఫ్ చాలా సన్నిహితుడు. ముఖ్యంగా బాంబ్ మేకర్, ఇంజినీర్ అనే పేరున్న అయ్యాష్‌‌కు డేఫ్ సన్నిహితుడు. 1990లలో ఇజ్రాయెల్ మీద బాంబులతో విరుచుకు పడిన వారిలో అయ్యాష్ కీలకమైన వ్యక్తి. 1996లో అయ్యాష్‌ను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. అయితే, ఆ తర్వాత మరిన్ని బాంబు దాడులను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వెనక ఉన్న వ్యక్తి డేఫ్‌ అని చెబుతారు. తన స్నేహితుడిని చంపినందుకు ఆయన ప్రతీకారం తీర్చుకున్నాడని అంటారు. తన వ్యూహాత్మక ఎత్తుగడలతో హమాస్‌లో వేగంగా అగ్రస్థాయికి చేరుకున్న డేఫ్ , 2002లో హమాస్ మిలిటరీ వింగ్‌ నాయకుడిగా మారాడు. కస్సామ్ అనే రాకెట్‌‌ను తయారు చేయడంలో డేఫ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ మిసైల్‌ను హమాస్ అత్యంత విలువైన ఆయుధంగా చెబుతారు. ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల నుంచి తప్పించుకోవడానికి డేఫ్‌ గాజాలోని సొరంగ మార్గాలలో నివసించేవాడు. అక్కడి నుంచి తన సైన్యానికి ఆదేశాలిచ్చేవాడు. ఇజ్రయెల్ రాడార్ నీడలో డేఫ్‌ నిత్యం మృత్యువుతో యుద్ధం చేస్తుండేవాడు. 2000 సంవత్సరం నుంచి ఆయనపై అనేకమార్లు ఇజ్రాయెలీ దళాలు దాడికి ప్రయత్నించాయి. ఈ దాడుల్లో కన్ను, ఎముక దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. అనేకమార్లు ఆయన ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడంతో హమాస్ వర్గాల్లో డేఫ్‌ అంటే క్రేజ్ పెరిగింది. అందరూ ఆయనను ‘క్యాట్ విత్ నైన్ లైవ్స్’ అని అనే వారు. 2014లో ఆయనపై 5వ సారి హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ”డేఫ్‌ జీవించే ఉన్నారు. మిలిటరీ ఆపరేషన్‌లలో పాల్గొంటున్నారు” అని హమాస్ ప్రకటించింది. డేఫ్ తప్పించుకోవడం ఇజ్రాయెల్ గూఢచార సాంకేతిక పరిజ్ఞానం మీదనే అనుమానాలు పెరిగేందుకు కారణమైంది.

  ఫోన్ వాడకపోతే, కంప్యూటర్ ఉపయోగించకపోతే, ఉగ్రవాది ఎక్కడున్నారన్నది కనుక్కోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా చాలా కష్టం. హమాస్ తవ్విన టన్నెల్స్ లోతు, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న కొంత పాత తరం టెక్నాలజీ కారణంగా డేఫ్‌ను గుర్తించి చంపడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మోస్సాద్ విఫలమవుతోంది. 1980లో హమాస్‌లో చేరిన డేఫ్‌ మిలిటరీ నేతగా ఎదిగారు. హమాస కీలక నాయకులు ఆయనకు సన్నిహితులు ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు కాల్పుల విరమణతో ముగియడానికి ఒక రోజు ముందు హమాస్ సీనియర్ అధికారి ఒకరు డేఫ్‌ నాయకత్వంలోనే గాజా మిలిటరీ ఆపరేషన్స్ జరిగాయని అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. డేఫ్‌ను అంతమొందించడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ఇజ్రాయిల్ సైనిక అనుభవం ప్రపంచ దేశాలకు అతిపెద్ద గుణపాఠం. దీన్ని ప్రపంచ దేశాలు నేర్చుకుంటాయని ఆశిద్దాం. అత్యాదునిక టెక్నాలజీ తో పటిష్టమైన నిఘా, రక్షణ వ్యవస్థతో శత్రు దేశాలను వణికించే ఇజ్రాయెల్ కు కొరకరాని కొయ్యగా మారిన ఈ ఒంటికన్ను మిలిటెంట్ “ డేఫ్ ”నిజంగా ఛాలెంజింగ్ టార్గెట్..! మరి ఈ ఉగ్రవాదిని ఇజ్రాయెల్ మట్టుబెడుతుందా..? LETS WAIT AND SEE.

  Related Stories