ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా.. కన్ను రెప్పవేయకుండా నిఘా పెట్టినా.. ఉగ్రమూకలు రెచ్చిపోతూనేవున్నాయి. ముష్కరులు నిత్యం ఏదో ఒక మూల ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేస్తూనేవున్నారు. తాజాగా దేశంలోనే అతిపెద్ద భారీ ఉగ్ర కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న పక్కా సమాచారంతో.. NIA అధికారులు మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించారు. న్యూఢిల్లీ, కర్ణాటక, కేరళలో దాడులు నిర్వహించి పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
ఒకేసారి తమ స్థావరాలపై NIA విరుచుకుపడటంతో ముష్కరులు హడలిపోయారు. ఉగ్రవాదులతో ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉంటూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. NIA అధికారులకు పక్కా సమాచారం అందడంతో.. ఉగ్రవాదుల సానుభూతిపరుల కదలికలపై 48 గంటల ముందే అలర్టయ్యారు. కర్ణాటక, కేరళ, న్యూఢిల్లీ ప్రాంతాలపై నిఘా పెట్టారు. సోమవారం న్యూఢిల్లీలోని జఫరాబాద్ లోని రెండు ప్రాంతాలు,.. బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక ప్రాంతాలు,.. కేరళలోని కొచ్చి, కన్నూర్‌లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి NIA అధికారులు దాడులు నిర్వహించారు. అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
ISIS ఉగ్రవాదులతో ఏడుగురు వ్యక్తులకు గత కొంతకాలంగా టచ్‌లో వున్నట్టు నిఘా వర్గాల పరిశీలనలో వెల్లడయ్యింది. సోషల్ మీడియా ద్వారా ముస్లిం యువతను పాకిస్థాన్ ఆకర్షించి రిక్రూట్ చేసుకుని, ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి స్థానికంగా దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు NIA గుర్తించింది. అంతేకాదు, ఈ ISIS ఉగ్రవాదులకు పాకిస్థాన్ సహకారం అందిస్తూ దాడులకు వ్యూహరచన చేసిందని తేలింది. దీంతో ISIS ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు చేసింది. అటు, అరెస్ట్ చేసినవారి పేర్లు బయటికి రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పట్టుబడినవారిలో నలుగురు మహిళలు కూడా వుండటంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారిని త్వరలో కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపింది. చదువుకున్న యువతను ఆకర్షించి, వీరి సాయంతో ISIS పలుచోట్ల దాడులకు కుట్రపన్నినట్టు గుర్తించామని NIA అధికారులు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ISISతో సంబంధాలున్నట్టు ఇటీవల పలు సోదాల్లో బయటపడింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో ఐఎస్ సానుభూతిపరులు.. అనేక మార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు.
అరెస్టయిన వారిలో.. కేరళకు చెందిన మహమ్మద్ అమీన్ నేతృత్వంలోని బృందానాకి చెందిన వారు ఉన్నట్టు NIA అధికారులు తెలిపారు. ఉగ్రవాద సంబంధాలపై ఇటీవల కొందరు మహిళలను ఐన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోగా.. వారిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టింది. సోషల్‌మీడియా వేదికల్లో స్థానిక యువతను ఆకర్షించి, వారికి ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందింది. వీరి ద్వారా దేశంలో పలు చోట్ల పేలుళ్లు జరిపేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.