భవిష్యత్తుకు ఊహను కలిపితే కల్పనతో కూడిన ఓ ఆసక్తికరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. అలాంటి ఊహను ప్రపంచ ఆర్థిక రాజకీయాలకు జోడిస్తే కథ మరింత రసవత్తరంగా మారుతుంది. 2022లో అమెరికా నిఘా వర్గాలకు ఇజ్రాయిల్ గూఢచర్య విభాగం ‘మొస్సాద్’ నుంచి ఓ సమచారం అందుతుంది. అణ్వాయుధాలకు కావాల్సిన అత్యవసరాలను సమకూర్చుకుని ‘మిస్సైల్ పరీక్ష’కు ఇరాన్ సిద్ధమవుతోందన్నది ఆ సీక్రేట్ మెసేజ్. అమెరికా ఆంక్షలు కొనసాగుతుండగా…ఇరాన్ అణ్వాయుధ పరీక్షల సాహసం ఎలా చేయగలిగింది? ఇది అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టించే ప్రశ్న!
ఇరాన్ తన అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను అమెరికాతో తెంచేసుకుని చైనా డిజిటల్ కరెన్సీ ‘యువాన్’తో చెట్టాపట్టాలేసుకున్న తర్వాత అమెరికా ఆంక్షలకు అర్థం లేదు. ఖోమైనీని అదుపు చేసేందుకు ట్రంప్ చేతిలో ఏమీ ఉండదు. చైనా డిజిటల్ కరెన్సీ టెహ్రాన్ కు కొత్త ఊపిరి పోస్తే, అమెరికాతో ఆర్థిక లావాదేవీలకు కాలం చెల్లినట్టే.
భారత్, చైనా సహా యూరప్ దేశాలకు ఇరాన్ చమురు అమ్ముకుంటే సమకూరే భారీ సంపదపై అమెరికా నియంత్రణ సాధ్యంకాదు. పోగుపడిన సంపదతో ఇరాన్ మధ్య శ్రేణి అణు క్షిపణులను తయారు చేస్తే అమెరికా ఆంక్షల బెదిరింపు అర్థం లేని హూంకరింపుగానే మారిపోతుంది.
ఇదంతా ప్రస్తుతానికి ఊహ మాత్రమ ! అయితే ఇది పసిపిల్లల చిలిపి ఊహ కాదు. త్వరలో ప్రపంచ ఆర్థిక వేదికపై జరగబోయే కీలక పరిణామం. నాలుగు దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు ‘స్టేబుల్ కాయిన్’ అత్యవసరమని చైనా ప్రభత్వానికి కీలక సలహాదారులు ఓ నివేదిక ఇచ్చారు.
చైనా డిజిటల్ కరెన్సీతో అమెరికాకు జరిగే నష్టమేంటి? ఇరాన్ – చైనా జతకలిస్తే ఆసియాలో జరిగే పరిణామాలేంటి? ఆంక్షల వల్ల ఇరాన్ ఎంత నష్టపోయింది? ఇరాన్ ఆంక్షల మూలంగా భారత్ కు వస్తున్న నష్టమెంత?
ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం….
జపాన్ కరెన్సీ యెన్, కొరియా కరెన్సీ వొన్, హాంకాంగ్ కరెన్సీ డాలర్, చైనా కరెన్సీ యువాన్ ల మధ్య ఆర్థిక సమన్వయాన్నీ, స్థిరత్వాన్ని కొనసాగించాలంటే డిజిటల్ కరెన్సీ తప్పనిసరని చైనా ప్రభుత్వ సలహాదారుల నివేదిక తేల్చింది. ఈ డిజిటల్ కరెన్సీని ఈ-ఆర్ఎంబీగా రూపొందించాలని నివేదించింది. ఈ-ఆర్ఎంబీ అంటే electronic form of the renminbi అన్నమాట. రెన్ మిన్ బీ అంటే చైనా అధికారిక కరెన్సీ పేరు.
అంతేకాదు చైనా సెంట్రల్ బ్యాంక్ సైతం ఐదేళ్లపాటు ‘స్టేబుల్ కాయిన్’ ఈ-ఆర్ఎంబీ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. ఏప్రిల్ లో పరిశోధనకు సంబంధించి తుది నివేదికను ప్రభుత్వం పరిశీలించి ట్రయల్ కు ఓకే చెప్పింది. మే మొదటి వారం నుంచి పైలెట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డ్రాగన్ ప్రభుత్వం.
ఒక వేళ ఇదే కనక విజయవంతమైతే ప్రపంచంలో డాలర్ ఆధిపత్యానికి గండిపడినట్టే అంటారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు.
అకస్మాత్తుగా చైనా తీసుకున్న ఈ కీలక నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. చైనా ఆర్థిక చరిత్రలో ఇదో మలుపురాయి కానుంది. కరోనా వైరస్, వాణిజ్య ఒప్పందాల్లో అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పుడు కరెన్సీకి పాకింది.
వచ్చే ఏడాది నాటికి కరెన్సీ మార్కెట్లో అగ్రగామి లక్ష్యంగా పావులు కదుపుతున్న చైనా…ఈ ఆర్థిక యుద్దానికి తెరలేపుతూ ‘ఈ-ఆర్‌ఎంబీ’ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి దశలో చైనాలోని నాలుగు నగరాల్లో అందుబాటులోకి రానున్న ఈ డిజిటల్ కరెన్సీని ప్రపంచ కరెన్సీ మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి దేశంగా చైనా రికార్డును సృష్టించింది.
తొలి విడుతగా రవాణా, ఆహారం, రిటైల్ విభాగాల్లో డిజిటల్ కరెన్సీని వినియోగించనున్నారు. చైనా కరెన్సీ అయిన యువాన్‌కు బదులు ఈ-ఆర్‌ఎంబీ రూపంలో బిల్లులు చెల్లించవచ్చును.
మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సర్వెంట్లు డిజిటల్ కరెన్సీ రూపంలో తమ జీత భత్యాలు పొందబోతున్నారు. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందిస్తున్న ఈ డిజిటల్ కరెన్సీ భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లో కీలకంకానున్నదని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు మేజర్ సిటీల్లో వచ్చేవారం నుంచి తన సొంత డిజిటల్ కరెన్సీ వాడకానికి ట్రయల్స్ నిర్వహించనుంది. ఈ–ఆర్‌ఎంబీ పేరుతో డిజిటల్ కరెన్సీని తీసుకువస్తున్నట్టు చైనా సెంట్రల్ బ్యాంక్ గతంలోనే ప్రకటించింది. డ్రాగన్ డిజిటల్ కరెన్సీని తీసుకురావడం ఇదే తొలిసారి. అయితే బీజింగ్ సౌత్, షియాంగన్, షెంజెన్, సుజు, చెంగ్డు నగరాల్లో ఇది వరకే ట్రయల్స్ మొదలయ్యాయి. 2022 లో జరిగే ఒలింపిక్స్ జరిగే ప్రాంతాల్లోనూ ప్రయోగాత్మకంగా వినియోగించాలని యోచిస్తోంది.
చాలా నగరాలు ఈ–ఆర్‌ఎంబీని అధికారిక కరెన్సీగా అంగీకరించాయని, మే నెల జీతాలను డిజిటల్ కరెన్సీలో చెల్లిస్తారని ప్రభుత్వ వార్తాపత్రిక చైనా డెయిలీ వెల్లడించింది. సుఝౌలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో చెల్లింపులకు కూడా ఈ–ఆర్‌ఎంబీనే వాడుతారని మరో మీడియా తెలిపింది. షియాంగన్‌లో మాత్రం ఆహారం, రిటైల్ పేమెంట్ల కోసం దీనిని ప్రయోగాత్మకంగా వాడుతున్నారు.
మెక్ డొనాల్డ్, స్టార్‌బక్స్ కూడా డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి అంగీకరించాయని సమాచారం. స్టార్‌బక్స్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చింది. ట్రయల్స్‌తో తమకు సంబంధం లేదని తెలిపింది. చైనాలో డిజిటల్ పేమెంట్స్ ను విపరీతంగా ఉపయోగిస్తారు. అలీ పే, వీచాట్ పే వంటి యాప్స్ కు ఆదరణ ఎక్కువ. ఆఫ్‌లైన్ పేమెంట్స్ వల్ల క్యాష్‌ఫ్లో గురించి కచ్చితమైన సమాచారం సెంట్రల్ బ్యాంకుకు అందని కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం.
అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి?
గతేడాది నవంబర్‌లో అమెరికా.. ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో ఏ కంపెనీలు వ్యాపారం కొనసాగిస్తే, వాటికి అమెరికాతో వ్యాపారం చేయడానికి అనుమతి లభించదు.అంతే కాదు, ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలతో లావాదేవీలున్న అమెరికా కంపెనీలు కూడా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే.
బంగారం, విలువైన లోహం, మోటార్ వాహనాల రంగం సహా చాలా పరిశ్రమలు ఈ ఆంక్షల బారిన పడ్డాయి. ఇరాన్‌తో చమురు వ్యాపారాన్ని పూర్తిగా ఆపివేయాలని అనుకుంటున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. కానీ ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోడానికి 8 దేశాలకు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. దిగుమతులు తగ్గించుకోడానికి గడువు ఇచ్చింది.ఆ ఎనిమిది దేశాల్లో భారత్ కూడా ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్‌పై అమెరికా గతంలోకంటే కఠినమైన ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఇనుము, అల్యూమినియం, ఉక్కు, రాగి ఎగుమతులపైనా ఆంక్ష లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు.
అణ్వస్ర్తాలు, ఇరాన్‌లో ఖండాంతర క్షిపణుల తయారీతోపాటు మధ్యప్రాచ్యంలో ఆ దేశ పలుకుబడిని నియంత్రించడమే లక్ష్యంగా ట్రంప్ ఈ ఆంక్షలు విధించారు. ఇరాన్‌కు ఆదాయం సమకూర్చి పెట్టే మూడు ప్రధాన రంగాలు.. చమురు, పెట్రో కెమికల్స్, లోహా ల ఎగుమతులపై నిషేధం ప్రకటించారు. ఇరాన్‌కు మద్దతు ప్రకటించినా తీవ్ర పరిణామాల ను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైట్‌హౌస్ హెచ్చరించింది.
ఇరాన్ నుంచి భారత్ కు చమురు సరఫరా ఎంత?
ఇరాన్ నుంచి భారత్ కు నెలకు 12 లక్షల టన్నుల చమురు దిగుమతి అవుతుంది. ఇది మొత్తం దిగుమతుల్లో పది శాతం. సౌదీ అరేబియా, ఇరాక్ తరవాత భారత్‌కు భారీగా చమురు ఎగుమతి చేసే దేశం ఇరాన్. ఇరాన్‌తో వ్యాపారం వల్ల భారత్‌కు అనేక లాభాలున్నాయి.
ఇరాన్ సరఫరా చేసే చమురు చౌకగా అందడంతో పాటు ఎక్కువ కాలం అరువు లభిస్తుంది. భారత్ ఎక్కువ భాగం యూరోలలో ఇరాన్‌కు డబ్బు చెల్లిస్తుంది. మిగతాది రూపాయలలో చెల్లిస్తుంది. అంటే అమెరికా డాలర్ మీద ఆధార పడవలసిన అవసరం లేదన్నమాట. రూపాయల్లో చెల్లించే మొత్తంలో కొంత వస్తు రూపంలో కూడా ఉండేది. బియ్యం, ఔషధాలు, ఇతర వస్తువులు ఇరాన్‌కు సరఫరా చేసేది.
మనకు అవసరమైన చమురులో 84 శాతం దిగుమతుల పైనే ఆధారపడతాం. చమురు దిగుమతి కోసం మనం ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 2018-19లో 100 బిలియన్ డాలర్లు వెచ్చించాం. అంటే ఇదీ 70 వేల కోట్ల రూపాయలతో సమానం.
ఆంక్షల గురించి అమెరికా ఏమంటుందో చూద్దాం…?
తమ ఆంక్షల మేరకు ఇరాన్ నుంచి చమురు దిగుమతి తగ్గిస్తే తాము ప్రత్యామ్నాయం చూపిస్తామని అమెరికా చెబుతోంది. ప్రపంచంలో అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ చమురు ఉత్పత్తుల్లో ముందంజలో ఉన్నాయని, వీటితో పాటు, ఇతర మిత్ర దేశాల నుంచి ప్రత్యామ్నాయంగా సరఫరా చేస్తామని చెబుతోంది. ఇంతవరకు అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. చమురు దిగుమతులు క్రమంగా తగ్గుతూ ఉంటే.. దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతుంది. అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరుగుతాయి.
అమెరికా విధాన నిర్ణేతలు మాత్రం చైనా డిజిటల్ మనీ వల్ల వచ్చే పరిణామాల గురించి ఇప్పుడే అంచనాకు రాలేమంటున్నారు. అమెరికా ఆంక్షల బుట్టదాఖలు కావడంతో పాటు ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా దేశాల బెదిరింపులను నిలువరించే అవకాశం లేకుండా పోతుంది. అంతేకాదు చైనా ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫార్మ్స్ అలీపే, వీ చాట్ లాంటి యాప్ లు ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లోకి విస్తరిస్తాయి. దశాబ్దాల డాలర్ ఆధిపత్యం కుప్పకూలిపోతుంది. ఆధిపత్యాన్ని కాపాడుకునే ప్రయత్నాల కన్నా డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు ఉన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశాల డిజిటల్ కరెన్సీలకు ఉన్న ప్రాధాన్యాన్ని అమెరికా గుర్తించాలి. ఏకపక్ష ఆంక్షల విధింపు లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం డిజిటల్ యుగంలో పెద్దగా ప్రయోజనముండదంటారు నిపుణులు.