More

  టూల్‎కిట్‎ వెనుక ఐఎస్ఐ..! ఎవరీ పీటర్ ఫ్రెడరిక్..?

  సగటు భారతీయుడు ఊహించిందే నిజమవుతోంది. రైతుల ఉద్యమం పేరుతో దేశవిచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రల వెనుక నిజాలు నిగ్గుతేలుతున్నాయి. టూల్‎కిట్‎ను తవ్వుతున్న కొద్దీ నమ్మశక్యం కాని వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కొత్త కొత్త పేర్లు బయటికొస్తున్నాయి. గ్రేటా థన్ బర్గ్, మో ధలీవాల్, రిహానా, మీనా హారిస్, దిశా రవి, నికితా జాకబ్, శంతను ములుక్.. ఇలా చెప్పుకుంటూపోతే ఇప్పటకే చాంతాడంత లిస్టు బయటికొచ్చింది. వ్యక్తులే కాదు, పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్, ఎక్స్ టింక్షన్ రిబిలియన్ వంటి సంస్థలు కూడా.. టూల్ కిట్ తయారీకి ఇతోధికంగా సాయం చేసినట్టు పోలీసుల విచారణలో తేలిపింది. ఈ క్రమంలో తాజాగా బయటికొచ్చిన మరో పేరు కలకలం సృష్టిస్తోంది. ఇదుగో ఇతడే ఆ వ్యక్తి.. పేరు.. పీటర్ ఫ్రెడరిక్. ఇంతకీ ఎవరీ పీటర్ ఫ్రెడరిక్..? టూల్ కిట్ తో ఇతనికి సంబంధం ఏమిటి..? ఓసారి చూద్దాం..

  కరుడుగట్టిన ఖలిస్తానీ నాయకుడు భజన్ సింగ్ భిందర్.. పీటరకు చాలా దగ్గరి మిత్రుడు. భజన్ సింగ్ తో కలిసి పీటర్ ఖలిస్తానీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడట. అంతేకాదు, ఐ.ఎస్‌.ఐ.కి చెందిన ఇక్బాల్‌ చౌదరి కంపెనీలో పీటర్‌ పేరు వెలుగుచూడటంతో పీటర్ ఫ్రెడరిక్ పై 2006 నుంచి దర్యాప్తు సంస్థలు నిఘా వేసి ఉంచాయి. ఐఎస్‌ఐకు చెందిన కే2 డెస్క్‌.. అదేనండీ కశ్మీర్, ఖలిస్తానీ డెస్క్ లో ఫ్రెడరిక్ కీలక పాత్రధారి. పీటర్ ఫ్రెడరిక్ పేరు వెలుగులోకి రావడంతో.. టూల్‌కిట్‌ కేసులో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు డాక్యుమెంట్‌లో పీటర్‌ పేరు ఎందుకుందన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. సహజంగానే మోదీ వ్యతిరేకి అయిన పీటర్ బహిరంగంగానే చాలా సార్లు మోదీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అమెరికాలో గతేడాది మోదీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ కూడా నిర్వహించాడు.

  జనవరి 26 న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లతో కూడా పీటర్ కు సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ టూల్‌కిట్‌ను బాగా స్ప్రెడ్ చేసేందుకు ముందుకొచ్చారని పోలీసులు చెప్పారు. టూల్‌కిట్‌ వ్యాప్తికి హాష్ ట్యాగ్స్‌ను రూపొందించడంలో పీటర్ ఫ్రెడరిక్ కీలకంగా వ్వవహరించినట్లు తెలిపారు. అయితే దిశా, నికితాలతో ఫ్రెడరిక్ డైరెక్ట్‌గా టచ్‌లో ఉన్నాడా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఈ టూల్‌కిట్‌లో గూగుల్ డాక్యుమెంట్స్‌ను పొందుపరిచిన కొన్ని హైపర్ లింక్స్ ఉన్నాయని.. ఇందులో చాలావరకూ ఖలీస్తానీ ఉద్యమానికి సంబంధించివే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

  ఫాసిజంపై పరిశోధనలు చేస్తున్న పీటర్ ఫ్రెడరిక్ ప్రస్తుతం మలేషియాలో ఉన్నాడు. అంతేకాదు, గతేడాది అమెరికాలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూల్చిన ఘటనలో పీటర్‌ కూడా ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. పీటర్‌ ఖలీస్తానీ ఉద్యమానికి మద్దతుదారు కూడా. అతడికి ఖలీస్తాన్‌ గ్రుపులతో దగ్గర సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అందులోనూ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి గూఢచారిగా ఉన్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పీటర్‌పై ఢీల్లీ పోలీసులు స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. అతడికి టూల్‌ కీట్ వ్యవహారంలో లీంకులపై ఆరా తీస్తున్నారు.

  అయితే, పోలీసుల వాదనను ఫ్రెడరిక్ ఖండిస్తున్నాడు. ఖలిస్తానీ ఉద్యమంతో తనకు సంబంధం లేదని, తన పేరును అన్యాయంగా ఎఫ్.ఐ.ఆర్ లో పోలీసులు చేర్చారని అమాయక పలుకులు పలుకుతున్నాడు. కుల వ్యతిరేక పోరాటానికి, సిక్కిజానికి మధ్య ఉన్న సంబంధంపై.. భజన్ సింగ్ తో కలిసి తాను రెండు పుస్తకాలు రాశానని చెప్పాడు. ఖలిస్తానీ వేర్పాటువాదితో కలిసి పుస్తకాలు రాసి.. ఆ ఉద్యమానికి సంబంధం లేదంటున్న.. పీటర్ డొంకతిరుడుగు మాటల్ని పోలీసులు నమ్మడం లేదు. అటు, టూల్ కిట్ కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని పీటర్ చెబుతున్నాడు. అంతేకాదు, భారత్ లో మానవహక్కుల సమస్యలకు పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఓ సంఘ సంస్కర్తగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటున్నాడు పీటర్ ఫ్రెడరిక్. పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెబుతున్న పీటర్.. టూల్ కిట్ కేసులో మీడియా తనను విలన్ గా చూస్తోందని ఆరోపించాడు.

  ఇదిలావుంటే, టూల్ కిట్ వ్యవహారంలో కొత్త కొత్త పేర్లు వెలుగుచూస్తుండటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే దిశ రవితో పాటు నికిత జాకబ్‌, శంతను అరెస్ట్ చేశారు. ఖలిస్థాన్‌ అనుకూల పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌తో జనవరి 11న జూమ్‌లో నిర్వహించిన సమావేశానికి నికిత, శంతనులు హాజరైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా వీరంతా టూల్‌ కిట్‌ రూపొందించారని పోలీసులు స్పష్టం చేశారు. శంతను ఈ-మెయిల్‌ ఖాతా నుంచే ఈ గూగుల్‌ పత్రం రూపొందినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు.

  మరోవైపు, దిశా రవి వ్యవహారంలోనూ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గ్రెటా థన్ బర్గ్ ట్విట్టర్ లో టూల్ కిట్ ను అప్ లోడ్ చేసిన వెంటనే.. దిశా రవి ఆమెకు వాట్సాప్ మెసేజ్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. టూల్ కిట్ ను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా హెచ్చరించిందని చెబుతున్నారు. ఆ పోస్టును డిలీట్ చేయకపోతే.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గ్రెటాకు చెప్పినట్టు సమాచారం. టూల్ కిట్ లో తన పేరు ఉండడంతో వెంటనే ఆ ట్వీట్ ను తొలగించాల్సిందిగా గ్రెటాను దిశా రవి కోరిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దిశ చెప్పాకే గ్రెటా ఆ ట్వీట్ ను డిలీట్ చేసిందని, తర్వాత మార్పుచేర్పులు చేసిన టూల్ కిట్ ను పోస్ట్ చేసిందని చెబుతున్నారు. టూల్ కిట్ లో మార్పులు చేసింది దిశానేనని అంటున్నారు.

  ఇదిలావుంటే, టూల్ కిట్ కుట్రపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అనూహ్య కామెంట్లు చేశారు. టూల్ కిట్ సూత్రధారులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో భారత్ ప్రపంచానికి పీపీఈ కిట్లు అందిస్తుంటే.. దేశ విచ్ఛిన్నకర శక్తులు.. భారతీయులకు వ్యతిరేకంగా టూల్ కిట్లు తయారు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

  Trending Stories

  Related Stories