More

  టూల్‎కిట్ ఫైల్స్..! ‘జూమ్’ మీటింగ్‎లో ధ్వంసరచన..?!

  రైతుల ఉద్యమం వెనక దాగున్న.. విదేశీ మూకల కుతంత్రాలు వెలుగుచూస్తున్నాయి. పుట్టపగిలి చెద పురుగులు బయటికొచ్చినట్టు.. దేశ విచ్ఛిన్నకర శక్తుల కుట్రలు బయటికొస్తున్నాయి. పోలీసులు విచారణలో నమ్మలేని నిజాలు బహిర్గతమవుతున్నాయి. రైతుల ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్ర ఉందని విచారణలో ఇప్పటికే బయటపడింది.

  రిపబ్లిక్ డే నాటి హింసనే జాతి వ్యతిరేక శక్తులే ప్రేరేపించాయని మరోసారి రూఢీ అయ్యింది. అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన ‘టూల్ కిట్’ ద్వారా హింస ప్రజ్వరిల్లినట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు, విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రిపబ్లిక్ డే హింసకు సరిగ్గా 15 రోజుల ముందు జరిగిన ఓ జూమ్ మీటింగ్ లోనే ధ్వంస రచన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు జూమ్ మీటింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థకు లేఖ రాశారు. రిపబ్లిక్ డే ముందు పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మో ధలీవాల్, యాక్టివిస్ట్‌ దిశారవి, నికితా జాకబ్, తదితరులు నిర్వహించిన జూమ్ మీటింగ్ వివరాలు తెలియజేయాలని ఆ లేఖలో కోరారు.

  నిజానికి.. ఢిల్లీలో రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమంలో హింసకు రూపకల్పన చేసే లక్ష్యంతోనే జనవరి 11న.. అంటే రిపబ్లిక్ డేకి 15 రోజులకు ముందే జూమ్ మీటింగ్ జరిపారని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ‘టూల్‌కిట్’ విధివిధానాలను నిర్ణయించేందుకే మీటింగ్ ఉద్దేశించినట్టు సైబర్ సెల్ అధికారులు చెబుతున్నారు. టూల్‌కిట్‌ను రూపొందించిన దిశారవి, నికితా జాకబ్, శంతను ఇతరులకు షేర్ చేశారని అంటున్నారు. దిశా రవిని బెంగళూరులో శనివారంనాడు అరెస్టు చేసి ఐదురోజుల పోలీస్ రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న లాయర్ జాకబ్, ఇంజనీర్ శంతను ములుక్‌‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.

  రిపబ్లిక్ డే ముందు రోజున.. ముగ్గురు ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థకు చెందిన వ్యక్తులు.. పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌కు హాజరైనట్టు నికితా జాకబ్ అంగీకరించారు. ఈ మేరకు నికితా తరఫున లాయర్ ముంబయి పోలీసులకు డాక్యుమెంట్లు సమర్పించారు. అయితే, ఢిల్లీ పోలీసులు చెబుతున్నట్టు టూల్‌కిట్‌ రూపకల్పనలో తమ ప్రమేయం లేదని.. దానిని ఎక్స్టింక్షన్ రెబెలియన్ వాలంటీర్లు తయారుచేశారని తెలిపారు. అంతేకాదు, గ్రెటా థన్‌బర్గ్‌కు తాను ఎటువంటి సమాచారం షేర్ చేయలేదని స్పష్టం చేశారు. అయితే, మో ధలీవాల్ సహచరుడు, కెనడాకు చెందిన పునీత్.. నికితా జాకబ్ ను కలిశారని, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో రైతు ఉద్యమంపై ట్విట్టర్ లో ఒక తుపాను సృష్టించాలని ఆమెకు సూచించారని పోలీసులు చెబుతున్నారు. ఇక, పోలీసుల అదుపులో ఉన్న దిశా రవి సైతం తాను కేవలం టూల్‌కిట్‌లో రెండు లైన్లు మాత్రమే ఎడిట్ చేసినట్టు కోర్టులో వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ విధించింది. అయితే, వీరి వాదనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  వ్యవసాయ చట్టాల విషయంలో భారత ప్రతిష్ఠను మసకబార్చే లక్ష్యంతో రూపొందించిన ఈ టూల్‌కిట్‌కు సంబంధించి.. ఇప్పటికే గూగుల్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి వివరాలను సేకరించారు. ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ ఏర్పాటు చేసినట్లు భావిస్తోన్న ఈ జూమ్‌ సమావేశంలో దాదాపు 70 మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ 70 మందిలో నికితా జాకబ్‌, శంతనులు వున్నట్టు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే, వీరితోపాటు జూమ్ మీటింగ్ లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనే విషయంపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే, ఈ టూల్‌కిట్ కోసం వినియోగించిన ఈ మెయిల్‌ శంతునుదేనని పోలీసులు గుర్తించారు. ఇదిలావుంటే, టూల్ కిట్ ను ఎక్స్ టింక్షన్ రిబిలియన్ అనే సంస్థ తయారు చేసిందని.. నికితా జాకబ్ పోలీసులకు చెప్పడం కొత్త ట్విస్టు. దీంతో అసలు ఆ సంస్థ ఎక్కడిది..? దీని మూలాలు ఎక్కడున్నాయి..? ఈ సంస్థ కార్యకలాపాలు ఏమిటి..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  Trending Stories

  Related Stories