చైనా.. మన నోటికాడి ముద్దనూ లాగేస్తుంది జాగ్రత్త..! : బైడెన్

0
1348

చూడబోతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ బాటలోనే నడుస్తున్నట్టు వుంది. మిగతా దేశాల విషయంలో ఎలావున్నా.. చైనా విషయంలో మాత్రం ఆయన ట్రంప్ నే ఫాలో అవుతున్నట్టు కనబడుతోంది. చైనా విస్తరణవాదం, కరోనా మహమ్మారి వ్యాప్తి, ఉగ్రవాద దేశాలతో అనుబంధం.. వంటి అంశాల్లో అమెరికా మొదటి నుంచి గుర్రుగానేవుంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయితే, చైనా పేరు చెబితేనే ఒంటికాలిపై లేచేవాడు. అంతగా కాకపోయినా, ప్రస్తుత బైడెన్ కూడా చైనా పట్ల గుర్రుగానే వున్నాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మనం అప్రమత్తంగా వుండకపోతే.. చైనా మన నోటికాడి ముద్దను కూడా లాగేసుకుంటుందని హెచ్చరించారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత చైనా విషయంలో అడపాదడపా స్పందించడం తప్ప.. బైడెన్ ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి.

అమెరికా అధ్యక్షుడైన తర్వాత జో బైడెన్ తొలిసారిగా జీ జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనా ప్రజలకు.. బైడెన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా కొవిడ్-19 కట్టడి, ప్రపంచ ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు, ఆయుధ విస్తరణకు అడ్డుకట్టవేయడం తదితర అంశాలపై జిన్‌పింగ్‌తో బైడెన్ చర్చించారు. అయితే, వీరిద్దరి తీవ్రమైన చర్చ జరిగినట్లు వార్తలు గుప్పుమంటన్నాయి. జిన్ పింగ్ తో ఫోన్ సంభాషణ ముగిసిన వెంటనే.. జో బైడెన్ వైట్ హౌజ్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చైనాను ఉద్దేశించి బైడెన్ ఘాటుగా స్పందించారు. త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే.. చైనా వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చిరించారు. చైనా మన భోజనాన్ని తినడానికి సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. రవాణా, పర్యావరణం తదితర రంగాల్లో చైనా బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్టు బైడెన్ వెల్లడించారు. దీని వల్ల అమెరికా తీవ్రంగా ప్రభావితం అవుతుందన్నారు.

చైనా తమకు వ్యూహాత్మక ప్రత్యర్థి అని పేర్కొన్న బైడెన్.. ఫసిఫిక్-ఇండో ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదే సమయంలో చైనాకు సంబంధించిన పలు అంశాలపై జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా అనుసరిస్తున్న బలవంతపు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, హాంకాంగ్‌లో అణచివేతలు, జింజియాంగ్‌లో ముస్లిం వర్గాలపై ఉక్కుపాదం మోపడం, తైవాన్ సహా చిన్న చిన్న దేశాలపై చైనా దురాక్రమణకు పాల్పడటం వంటి అంశాలపై బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ పట్ల చైనా వ్యవహరాశైలిపై బైడెన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వైట్ హౌజ్ మీడియా ప్రతినిధి జెన్నిఫర్ సాకి వెల్లడించారు.

అమెరికాను దాటేయకుండా చైనాను అడ్డుకోవాలంటే.. బైడెన్ ప్రభుత్వానికి ఆసియా దేశాల మద్ధతు ఎంతో అవసరం. అందులోనూ.. ప్రస్తుతం అన్నిరంగాల్లో చైనాకు దీటుగా పోటీపడుతన్న భారత్ తో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనావుంది. అందుకే, అన్యమనస్కంగానైనా.. భారత్ కు అనుకూలంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవలికాలంలో బైడెన్ భారత్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు విదేశాంగ నిపుణులు అంచనావేస్తున్నారు. భారత్ ఆర్థికశక్తిగా ఎదగడానికి అమెరికా మద్దతు ఎప్పుడూ వుంటుందని.. ఇటీవల బైడెన్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here