More

    చైనాపై జపాన్ ‘ఆర్థిక’ బాంబు..! భారత్‎కు క్యూకట్టనున్న కంపెనీలు

    This Content Is Only For Subscribers

    Please subscribe to unlock this content.

    విస్తరణకాంక్షతో రగిలిపోతూ సరిహద్దు దేశాలతో కయ్యం పెట్టుకుంటున్న జిత్తులమారి చైనాకు.. జపాన్ భారీ షాక్ ఇచ్చింది. ఇటీవలికాలంలో భారత్ తో పాటు జపాన్ తోనూ గొడవలకు దిగుతోంది డ్రాగన్. జపాన్ సముద్ర జలాల్లో అక్రమంగా చొరబడి నానా రచ్చ చేసింది. దీంతో ఆగ్రహించిన జపాన్ ప్రభుత్వం.. చైనాకు గూబగుయ్యిమనేలా సమాధానం చెప్పింది. చైనాలోని జపాన్ కంపెనీలు, పెట్టుబడిదారులంతా వెనక్కి వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

    చైనాకు వ్యతిరేకంగా జపాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలకు ‘ప్యాక్ అప్ ఫ్రమ్ చైనా’ అంటూ పిలుపునిచ్చింది. తయారీదారులంతా ఇకపై జపాన్ లేదా చైనాయేతర దేశాల నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని సూచించింది. దీంతో జపాన్ కంపెనీలన్నీ తమ స్థావరాలను స్వదేశానికి, లేదా చైనాయేతర దేశాలకు మళ్లించేందుకు సిద్ధమవుతున్నాయి.అంతేకాదు, చైనా నుంచి తరలివచ్చేందుకు తమ కంపెనీలకు జపాన్ భారీ ఉద్దీపనలు ప్రకటించింది. కరోనా మిగిల్చిన ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి షింజో అబే ప్రభుత్వం.. తాజాగా 993 బిలియన్ డాలర్ల ఉద్ధీపన ప్యాకేజీని ప్రకటించింది. జపాన్ ఆర్థిక ఉత్పత్తిలో ఇది 20 శాతానికి సమానం. అయితే, ఈ ప్యాకేజీలో 2.2 బిలియన్ల భారీ మొత్తాన్ని.. చైనా నుంచి తరలివచ్చే తమ కంపెనీల కోసం ఉపయోగించనుంది. ఇందులో 2 బిలియన్ డాలర్లను జపాన్ కు తిరిగివచ్చే వ్యాపారస్తుల కోసం కేటాయించగా.. మిగతా మొత్తాన్ని చైనాయేతర దేశాలకు వెళ్లే జపాన్ వ్యాపారస్తుల కోసం కేటాయించింది. అనూహ్యంగా జపాన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో బీజింగ్ పాలకుల కళ్లు బైర్లు కమ్మాయి. అసలే కరోనా దెబ్బతో కదేలలైన చైనా ఆర్థిక వ్యవస్థకు.. జపాన్ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది.

    జపాన్ నిర్ణయం చైనాకు కోలుకోలేని దెబ్బేనంటున్నారు ఆర్థిక నిపుణులు. నిజానికి, జపాన్ వాణిజ్య భాగస్వాముల్లో చైనాయే పెద్ద దేశం. కానీ, కరోనా ప్రభావం వల్ల ఫ్యాక్టరీలు మూతపడటంతో.. చైనా నుంచి దిగుమతులు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి ప్రారంభంలో దిగుమతులు సగానికిపైగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో జపాన్ తీసుకున్న తాజా నిర్ణయం చైనాకు శరాఘాతంలా మారింది. ఇటీవలికాలంలో డ్రాగన్ దుందుడుకు చర్యలతో విసిగిపోయిన జపాన్, ఆ దేశానికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పైగా చైనా వైరస్.. అదేనండీ కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశాన్ని కోల్పోయింది జపాన్. దీంతో ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లింది. డ్రాగన్ కు తొత్తుగా మారిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యం వల్లే.. కరోనా ప్రపంచ మహమ్మారిగా మారిందని జపాన్ బలంగా నమ్ముతోంది. టోక్యో ఒలింపిక్స్ నిర్వహించలేకపోవడానికి పరోక్షంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే కారణమని ఆరోపిస్తోంది. తాజాగా జపాన్ డిప్యూటీ పీఎం టారో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరును చైనా ఆరోగ్య సంస్థగా మార్చుకుంటే బాగుంటుందని ఘాటుగా విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ గా టెడ్రోస్ అథనోమ్ ను తొలగించాలన్న పిటిషన్ కు మద్దతుగా ఇటీవల జపాన్ పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన W.H.O. పై విరుచుకుపడ్డారు. ఈ సమస్యలన్నింటీకి మూలం చైనాయే కాబట్టి.. ఆ దేశం పేరు వినపడితేనే జపాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. దీనికి తోడు ఇటీవల పెరిగిన చైనా కవ్వింపు చర్యలు అగ్ని మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో ఆర్థికంగా డ్రాగన్ దెబ్బకొట్టే ఏ అవకాశాన్ని కూడా జపాన్ వదులుకోవడం లేదు.

    నిజానికి, జపాన్-చైనా వైరం ఈనాటిది కాదు. ప్రాదేశిక వివాదాలు, రెండో ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాలు.. దశాబ్దాలుగా ఇరు దేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వైరం ఇరు దేశాల ప్రజల్లో నరనరానా జీర్ణించుకుపోయింది. ఇటీవల చైనాలోని ఓ రెస్టారెంట్ యజమాని జపాన్ పై తన అక్కసు వెళ్లగక్కిన తీరే ఇందుకు నిదర్శనం. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందినందుకు అమెరికాకు అభినందనలు.. అలాగే ఈ మహమ్మారి జపాన్ లోనూ శాశ్వతంగా వుండాలని కోరుకుంటున్నా’.. అంటూ తన రెస్టారెంట్ ముందు ఓ బ్యానర్ ను ప్రదర్శనకు ఉంచాడా యజమాని. దీనిని బట్టి చైనా – జపాన్ సంబంధాలు ఎంత దారుణంగా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ఇటీవలికాలంలో బలోపేతమైన అమెరికా, జపాన్ సంబంధాలు.. చైనాపై మరింత ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో బీజింగ్ తో సత్సంబంధాలను ఏర్పరుచుకునేందుకు షింజే అబే చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ముఖ్యంగా ట్రంప్ సర్కార్ చైనాపై ట్రేడ్ వార్ ప్రకటించడంతో.. షింజో అబే ఇరు దేశాలతో సమానంగా సత్సంబంధాలను కొనసాగించలేకపోయారు. దీంతో చైనా – జపాన్ సంబంధాలు మరింత క్షీణించాయి. నిజానికి, ఈ నెలలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, జపాన్ ప్రధాని షింజో అబే భేటీ కావాల్సివుంది. దశాబ్దకాలంలో ఇరు దేశాధినేతల మధ్య తొలి సమావేశం అంతా సిద్ధమైంది. కానీ, చివరి క్షణంలో జిన్ పింగ్ అనూహ్యంగా తన పర్యటను రద్దు చేసుకున్నారు. పైకి కరోనా వ్యాప్తిని కారణంగా చూపిస్తున్నా.. ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు ఇందుకు కారణమని తెలుస్తోంది.

    ఇదిలావుంటే, జపాన్ ప్రభుత్వం తీసుకున్న ‘ప్యాక్ అప్ ఫ్రమ్ చైనా’ నిర్ణయంతో చైనా ఆర్థికమూలాలు కదిలిపోనున్నాయి. అక్కడ వేలకొద్ది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. ఇదే సమయంలో జపాన్ నిర్ణయం భారత్ తో పాటు.. దక్షిణాసియా వరంగా మారింది. చైనా నుంచి తరలిరానున్న జపాన్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ఇప్పుడు భారత్ స్వర్గధామంలా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ తో పాటు వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలు కూడా ఉత్సాహంగా వున్నాయి. ముఖ్యంగా జపాన్ కంపెనీలకు భారత్ ప్రధాన గమ్యస్థానంగా మారనుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఎందుకంటే, ఉత్పత్తి ఖర్చు తక్కువగా వుండటం.. పుష్కలమైన మానవవనరులు అందుబాటులో వుండటం.. భారత్ కు కలిసొచ్చే అంశం. పైగా భారత్ – జపాన్ మధ్య నాగరిక సంబంధాలకు 14 వందల చరిత్ర వుంది. ఇప్పటికే భారత్ లో 1,441 జపనీస్ కంపెనీలు రిజిస్టరయి వున్నాయి. ఈ కంపెనీలకు దేశవ్యాప్తంగా 5,102 శాఖలున్నాయి. కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో జపాన్ కంపెనీలు విస్తరించివున్నాయి. ఒక్క కర్నాటక రాష్ట్రంలోనే 530 కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో 200 కంపెనీలు గత ఐదేళ్లలో వచ్చినవే. ఇవన్నీ రానున్న జపాన్ కంపెనీలకు మరింత ఊతమివ్వనున్నాయి. పైగా నరేంద్ర మోదీ ప్రభుత్వ అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా కార్యక్రమాలపై జపాన్ సానుకూల దృక్ఫథంతో వుంది. దీంతో జపాన్ కంపెనీలు కచ్చితంగా భారత్ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. మొత్తానికి, జపాన్ ఇచ్చిన పంచ్ తో డ్రాగన్ కంట్రీకి దిమ్మదిరిగిపోయింది. మిగతా సంపన్న దేశాలు కూడా జపాన్ బాటలోనే ‘ప్యాక్ అప్ ఫ్రమ్ చైనా’ నినాదం వినిపిస్తే.. డ్రాగన్ కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయమంటున్నారు ఆర్థికవేత్తలు.

    Related Stories