గుజరాత్లో మోర్బిలో తీగల వంతెన కూలిన దుర్ఘటనలో వందలాది మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనేవుంది. బ్రిటిష్ కాలంలో కట్టిన వంతెనపై వందలాది మంది ప్రజలు గుమిగూడగా,.. అది ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ప్రజలంతా నదిలో పడిపోవడంతో ఎక్కువగా మరణాలు సంభవించాయి. మృతుల్లో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలే ఉన్నారు. అయితే ఈ వంతెన వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీంతో హుటాహుటిన స్పందించిన గుజరాత్ ప్రభుత్వం బాద్యులపై చర్యలకు ఉపక్రమించింది.
గుజరాత్ లోని మోర్బి కేబుల్ బ్రిడ్జ్ ను 1879లో బ్రిటిష్ వారు నిర్మించారు. వందల ఏళ్ళనాటి పురాతన బ్రిడ్జి కావడంతో ఈ ఏడాది మార్చిలో మరమ్మత్తులకోసం ప్రభుత్వం ఒరేవా గ్రూప్ కు అప్పగించింది. ఏడునెలలుగా ఈ బ్రిడ్జిపై మరమ్మత్తులు జరుగుతున్నాయి. అయితే మరమ్మత్తులు పూర్తయిన తర్వాత స్థానిక మున్సిపల్ అధికారులతో చెక్ చేయించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒరేవా కంపెనీ ఇటువంటి అనుమతులేవీ తీసుకోకుండానే వంతెనను రీ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మోర్బి మున్సిపల్ ఆఫీసర్ సందీప్ జాలా వెల్లడించారు. మోర్భి బ్రిడ్జి నిర్వహణ ఒరేవా కంపెనీ ఆధ్వర్యంలోనే ఉంది. ఈ బ్రిడ్జిని సందర్శించడానికి ప్రజలకు టిక్కెట్లు కొనుగోలు చేయాల్సివుంటుంది. వంతెన సామర్థ్యం 100 నుంచి 150 వరకే ఉన్నా నిర్వహణ అధికారులు దాదాపు 650 టిక్కెట్ల వరకు అమ్మినట్లు వార్తా కథనాలు తెలుపుతున్నాయి. ఘటనా సమయంలో దాదాపు 400 నుంచి 500 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అంత మంది ఒకేసారి వంతెనపైకి చేరుకోవడంతో అది బరువుకు తట్టుకోలేకపోయింది. దీంతో పాటు బ్రిడ్జిపై కొంతమంది యువకులు ఆకతాయి పనులు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో బయట పడినట్లు కొన్ని వార్తాకథనాలు తెలుపుతున్నాయి. వంతెనపై ఉన్న యువకులు కొంతమంది బ్రిడ్జిని అటూ ఇటూ ఊపే ప్రయత్నం చేశారు. దీంతో భారీగా ఊగిసలాటకు గురైన వంతెన తీగలు తెగిపోయి వంతెన కూలిపోయింది. దీనికి తోడు నదిలో ఎక్కువగా నీరు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు ఉన్నట్లు తేలింది. దాదాపు 49మంది చిన్నపిల్లలే అని వార్తా కథనాలు తెలుపుతున్నాయి. బీజేపీ రాజ్కోట్ ఎంపీ మోహన్ భాయ్ కుందారియా కుటుంబంలో ఏకంగా 12 మంది ఈ దుర్ఘటనలో మృతిచెందినట్టు తెలుస్తోంది.
ఇక, బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో సందీప్ వాసవ, ఐఏఎస్ రాజ్ కుమార్ బేణీవాల్, ఐజీపీ సుభాష్ త్రివేది, కేఎం పటేల్, డాక్టర్ గోపాల్ తంక్ లను మెంబర్లుగా నియమిస్తూ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. దీంతో పాటు బ్రిడ్జ్ మరమ్మత్తులకు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 114, 304, 308 లతో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఒరేవా కంపెనీ కు చెందిన 8 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ కూడా ఈ ఘటనపై అధికారులతో సమావేశమై సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
అయితే ఈ దుర్ఘటనలో గల్లంతయిన వారిని గుర్తించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎంతో మంది గజ ఈతగాళ్ళు సహాయంతో మృతులను గుర్తించే పనిలో పడ్డారు. ఇందులో మరో వందమంది దాకా ఆచూకీ తెలియడం లేదు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ లో పాల్గొన్న ప్రధాని మోదీ తాను ఇక్కడ ప్రసంగిస్తున్నా కూడా తన మనసంతా మర్భీ ఘటనపైనే ఉందని వ్యాఖ్యానించారు. నవంబర్ ఒకటవ తేదీన ప్రధాని మోదీ స్వయంగా బాధితులను కలవబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే షెడ్యూల్ చేసిన అన్ని మీటింగ్ లను రద్దు చేసుకున్నారు.