గల్వాన్ ఘటన మొదలుకొని.. భారత్ చేతిలో డ్రాగన్ డక్కాముక్కీలు తింటూనేవుంది. జిత్తులమారి విస్తరణవాదానికి భారత్ ఆర్మీ ఎక్కడికక్కడ చెక్ పెడుతూనేవుంది. భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరించినా.. అత్యాధునిక ఆయుధ సంపత్తిని తరలించి బెదిరించినా.. మన వీరజవాన్లు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓవైపు మోదీ ప్రభుత్వం దౌత్య పరంగా ఆటాడుకుంటూవుంటే.. మరోవైపు మన సైనికులు సరిహద్దుల్లో చైనా పొగరును అణచివేశారు. అయినా, కిందపడినా నాదే పైచేయి అని చెప్పుకోవడం బీజింగ్ పాలకులకు అలవాటైపోయింది. గల్వాన్ ఘటనలో చనిపోయిన చైనా సైనికుల వివరాలను అధికారికంగా ప్రకటించకపోవడమే ఇందుకు నిదర్శనం. గల్వాన్ హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులవగా.. చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై ఎక్కడా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. చైనా జవాన్లే ఎక్కువగా మరణించారని భారత్ చెప్పినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
తమ సైనికులు చనిపోయిన విషయాన్ని ఒప్పుకోవడానికి చైనాకు అహం అడ్డొచ్చింది. తమ దేశ సైనికులు మరణాలను కూడా దాచి.. ప్రపంచం చేత ఛీకొట్టించుకుంది. అమెరికా, రష్యా దేశాలకు చెందిన ఏజెన్సీలు, పలు సర్వే సంస్థలు కూడా గల్వాన్ ఘటనపై పూర్తి వివరాలు అందించారు. లెక్కలతో సహా తేల్చిచెప్పారు. అయినా, దాని బుద్ధి మారలేదు. గల్వాన్ లో మరణించిన చైనా సైనికుల సంఖ్యపై ఇప్పటికీ ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా భారత లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి కూడా చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై మాట్లాడారు. ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ముఖాముఖీలో.. గల్వాన్ ఘటన, తదనంతరం పరిణామాలపై ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. ఆ హింసాత్మక జరిగిన దాదాపు 8 నెలలకు మొదటిసారిగా ఆయన ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
గాల్వన్ లోయలో చోటు చేసుకున్న ఆ హింసాత్మక ఘటనలో 45 మంది చైనా జవాన్లు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చని కూడా అన్నారు. ఈ దాడి ద్వారా చైనా తమ జవాన్లను పోగొట్టుకున్నదే తప్ప సాధించిందేమీ లేదన్నారు. అంతేకాదు, లద్ధాక్, గల్వాన్ లో పరిస్థితులపై అనేక విషయాలను పంచుకున్నారు వైకే జోషి. తాను తన జీవితం మొత్తం లద్ధాక్ లోనే గడిపానని అన్నారు. ఇలాంటి ఓ పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఆ స్థాయిలో బలగాలు, ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు వస్తాయని ఊహించలేదని తెలిపారు. అయితే సరిహద్దుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు అక్కడ పని చేసే సమయంలో నీటి సమస్య ఉండేదని తెలిపారు. బలగాల కోసం నీటిని తీసుకెళ్లామని అన్నారు. అయితే ఆ తరువాత ఇంజినీర్లు రంగంలోకి దిగి 20 బోర్లు తవ్వారని వివరించారు. అలా నీటి సమస్యను అధిగమించామని అన్నారు. ఈ విషయంలో సైనికులు పడిన శ్రమను మర్చిపోలేమని లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. ఒక్కోసారి మైనస్ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని గుర్తు చేసుకున్నారు. అయితే మంచి టెంట్లు, బెడ్లు వంటిని చాలావరకు ఉపయోగపడ్డాయని తెలిపారు. ఓ వైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు చైనా బలగాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితిని అధిగమించామని వెల్లడించారు.
ప్రస్తుతం జరుగుతున్న బలగాల ఉపసంహరణపైనా జోషీ స్పందించారు. ప్రస్తుతం తూర్పు లదాఖ్‌లోని ప్యాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలో సైన్యం ఉపసంహరణ ప్రక్రియ సాఫీగా సాగుతోందన్నారు. ఫిబ్రవరి 10న ఈ ప్రక్రియ మొదలైందని.. మొత్తం నాలుగు దశల్లో ఇది పూర్తవుతుందని చెప్పారు. మొదటి దశలో సాయుధ బలగాలు,మెకానికల్ రెజిమెంట్‌ను అక్కడినుంచి ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఆ తర్వాత రెండో దశ,మూడో దశల్లో ప్యాంగాంగ్ త్సో సరస్సుకు దక్షిణ,ఉత్తర భాగాన ఉన్న సైన్యాన్ని వెనక్కి రప్పించడం జరుగుతుందన్నారు. చివరి నాలుగో దశలో రెజాంగ్ లా,రెచిన్ లా,కైలాష పర్వత ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణ ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని శాటిలైట్స్,యూఏవీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని.. కొన్నిచోట్ల కెమెరాలను సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు.
గతేడాది ఏప్రిల్‌కు ముందు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు చైనా చేపట్టిన నిర్మాణాలన్నింటినీ పూర్తిగా తొలగించబడుతున్నాయని జోషీ తెలిపారు. టెంట్లు, బంకర్లు, డగౌట్స్ ఇలా అన్నీ తొలగించేస్తున్నట్లు చెప్పారు. ప్యాంగాంగ్ సో ఉత్తర భాగాన భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వాదనలో నిజం లేదన్నారు. ఫింగర్ 8 భారత్ ఆధీనంలోనే ఉంటుందని.. అక్కడి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటోందని చెప్పారు. ఈ పరిధిలో ఇకపై చైనాకు సంబంధించి ఎలాంటి మిలటరీ కార్యకలాపాలు ఉండబోవన్నారు. చైనాతో సరిహద్దు ప్రతిష్ఠంభన ఒక కొలిక్కి రావడం భారత్‌కు కచ్చితంగా విన్-విన్ సిచ్యుయేషన్ అన్నారు. నిజానికి, మొదట్లో చర్చల ద్వారా చైనా దారికి రాకపోవడంతో ఆర్మీ చీఫ్ నుంచి తనకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ మేరకు చైనా పట్ల తాము కూడా దూకుడుగా వ్యవహరించామని.. రెజాంగ్ లా, రెచిన్ లా, ప్యాంగాంగ్ దక్షిణ, ఉత్తర తీరాల్లోని వ్యూహాత్మక శిఖరాలపై పాగా వేయగలిగామని అన్నారు. దీంతో చైనా ఒత్తిడికి లోనైందని.. ఎట్టకేలకు భారత్ అనుకున్నట్లుగా సైన్యం ఉపసంహరణ కొనసాగుతోందని తెలిపారు.
అయితే, జిత్తులమారి డ్రాగన్ ను ఎప్పటికీ నమ్మలేమని కూడా చెప్పారు లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి. వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉద్రిక్తతలు పెంచడం ఆ దేశానికి అలాటేనని అన్నారు. చైనీయులు గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిన సందర్భాలను గుర్తుచేశారు. మళ్లీ వారిని నమ్మడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం చైనా చాలా చేయాల్సి ఉందని అన్నారు. కమాండర్ స్థాయిలో జరిగిన చర్చలు ఇరు దేశాలకు చెందిన బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించారని వైకే జోషి తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడానికి ఉన్నాయని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు.