ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దేవభూమి కేరళలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కూటమి రాజకీయాలకు పేరుగాంచిన కేరళలో ఇప్పటివరకు రెండు గ్రూపులే ఆజమాయిషీ చెలాయిస్తూ వచ్చాయి. ఓసారి ఎల్డీఎఫ్ కూటమి గెలిస్తే, మరోసారి యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తూ వచ్చాయి. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి గెలుపొందింది. ఈ లెక్కన చూసుకుంటూ ఈసారి యూడీఎఫ్ కూటమి విజయం సాధించాలి. కానీ, ఇటీవలి సర్వేలు మాత్రం మళ్లీ ఎల్డీఎఫ్ వైపే మొగ్గు చూపించాయి. మళ్లీ గెలిస్తే మాత్రం కేరళ రాజకీయాల్లో కొత్త చరిత్రే అవుతుంది.
సర్వేలు ఎల్డీఎఫ్ వైపు మొగ్గు చూపిస్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, అక్కడ రోజురోజుకూ పరిణామాలు మారిపోతున్నాయి. దేవభూమిలో బీజపీ కొత్త శక్తిగా ఎదుగుతోంది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా.. ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది. దీంతో అధికార కమ్యూనిస్టులకు ఇది జీవన్మరణ సమస్యగా మారింది. ప్రస్తుతం కేరళలో మినహా దేశంలో మరే ఇతర రాష్ట్రంలో సీపీఎం అధికారంలో లేదు. పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కేరళను కూడా కోల్పోతే.. దేశంలో కమ్యూనిస్టుల ఉనికికి దాదాపు ఎండ్ కార్డు పడినట్టే. అందుకే, రెండోసారి కూడా ఎలాగైనా ఎన్నికల్లో గట్టెక్కాలని సీఎం పినరయి విజయన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, అవినీతి ఆరోపణలు, బంగారం స్మగ్లింగ్ వంటి కేసులు పినరయి విజయన్ ను వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ కూడా పుంజుకుంటూ వుండటం.. ఆయనకు మింగుడుపడటం లేదు.
శబరిమల వివాదంతో సంఘటితమైన హిందూ ఓటు బ్యాంకు బీజేపీకి కలిసొస్తోంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓటు షేరు సాధించిన కమలనాథులు.. 2016 నాటికి 15 శాతానికి చేరుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఓ సీటును కూడా గెలుచుకుని.. 16 శాతం ఓట్లను సాధించారు. ఇక, తాజాగా మేథోవర్గం చేరికలు బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. ‘మెట్రోమ్యాన్’గా దేశవ్యాప్త మన్ననలు అందుకున్న శ్రీధరన్ ను పార్టీలోకి ఆహ్వానించి.. ఏకంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. శ్రీధరన్ కు సొంత రాష్ట్రం కేరళలో మంచి పేరుంది. ఇది ఆ పార్టీకి అనుకూలిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అటు బీజేపీలోకి చేరికలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజగా కేరళ పీపుల్స్ పార్టీ అధినేత, నటుడు దేవన్.. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం రాష్ట్రంలోని షంగుముఘంలో బీజేపీ నిర్వహించిన విజయయాత్రలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా మంది ప్రముఖులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇక, ఇప్పటిదాకా రాజ్యమేలిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు విషయానికి వస్తే.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ 91 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. యూడీఎఫ్‌కు 47 స్థానాలు లభించగా, ఎన్డీయేకు ఒక సీటు దక్కింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తం 20 లోక్‌సభ స్థానాలలో యూడీఎఫ్ కూటమికి అనూహ్యంగా 19 స్థానాలు లభించగా, అధికార ఎల్డీఎఫ్ కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ఎన్నికలతో ఇక వామపక్ష కూటమి పని అయిపోయిందనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సహా అందరూ భావించారు. అయితే గతేడాది నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ సంచలన విజయాన్ని నమోదు చేసి.. మళ్లీ పుంజుకుంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూడలేం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు వేరుగా వుంటాయి.
ఇదిలావుంటే, జాతీయ స్థాయిలో క్రమంగా ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి.. కేరళలో జీవగంజి పోసి బతికించాలని రాహుల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. పడరాని పాట్లు పడుతున్నాడు. ఈత కొట్టడం, చేపలు పడ్డం వంటి ఆకర్షక చర్యలతో ఓటర్లకు దగ్గరయ్యేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు. అయితే నాయకత్వ సంక్షోభం యూడీఎఫ్ కూటమిని పట్టిపీడిస్తున్నది. మాజీ సీఎం వూమెన్ చాందీకి ప్రజల్లో కాస్త ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు ఆయన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అధికార పక్షం అపజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితల వెనుకబడి ఉన్నారు. ఇది చాలదన్నట్టు సీనియర్లంతా పార్టీకి గుడ్ బై చెప్పి బయటికెళ్తున్నారు. ఈ పరిఱామాలన్నీ యూడీఎఫ్ గెలుపును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.