నెమలిపింఛం, నీలవర్ణం, నల్లని గొల్లవాడు పిల్లనగ్రోవితో భాగవతంలో వెన్నదొంగగా దర్శనమిచ్చే నీలమేఘ శ్యాముడు మహాభారతంలో నగర రాజ్యాల నిర్మాతగా, యుద్ధవీరుడిగా, తాత్వికుడిగా, రాజనీతిజ్ఞుడిగా అరివీర భయంకర యుద్ధానికి దార్శనిక సమాధానమిచ్చే వ్యూహకర్తగా ప్రత్యక్షమవుతాడు. మహాభారత యుద్ధమైదానంలో అర్జునుడి నైతిక సంశయాన్ని పటా పంచలు చేసే చింతనాపరుడిగా రూపుగడతాడు.
కృష్ణజన్మాష్ఠమి సందర్భంగా…నేషనలిస్ట్ హబ్ టీమ్…జగద్గురువు గురించి కించిత్ అన్వేషణ చేసింది. నడయాడే ఙ్ఞాన భాండాగారం దేవీ మాతా వనమాలి రచించిన ‘‘The Complete Life of Krishna: Based on the Earliest Oral Traditions and the Sacred Scriptures’’, ‘‘In the Lost City of Sri Krishna: The Story of Ancient Dwaraka’’, ప్రాచీనతను అత్యంత సృజనాత్మకంగా కొత్త తరానికి పరిచయం చేస్తున్న ఒడిశాకు చెందిన దేవ్ దత్ పట్నాయక్ రాసిన ‘‘Krishna’s Secret’’ పుస్తకాల ఆధారంగా శ్రీకృష్ణుడి గురించి కొన్ని కొత్త విషయాలు చెప్పాలని ప్రయత్నించింది. మా పరిశోధనలోని లోటుపాట్లను గుర్తించి ఎరుక కలిగించే ప్రేక్షకులే అంతిమ నిర్ణతలు.
‘నల్లనివాడు పద్మనయనంబులవాడు’అంటూ శ్రీకృష్ణుడి రూపాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు పోతనామాత్యుడు. తన ఆంధ్ర మహాభాగవతంలో శ్రీకృష్ణుని రూప స్వభావ లీలా విలాసాలను అత్యంత రమ్యంగా వర్ణించాడు. ‘కృష్’ అంటే దున్నడమనే అర్థం ఉంది. భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి కర్రు మొన నల్లగా ఉంటుంది. అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నలుపు’ అనే అర్థం ఏర్పడింది.
‘‘Krishna is an unusual God. He challenges all conventional notions of divinity and appropriate social conduct. His name literally translates as ‘black’,challenging the traditional Indian discomfort with the dark complexion. He is visualised as either cowherd or charioteer, never as priest or king, a deliberate association with the lower strata of society’’.
‘‘శ్రీకృష్ణుడు అసాధారణ దైవం. అన్ని సాంప్రదాయ దైవ భావనలనూ సవాలు చేస్తాడు. సామాజిక నియమాలను ప్రశ్నిస్తాడు. కృష్ణ శబ్దమే భారతీయ సంస్కృతి ద్వేషించే నలుపు వర్ణాన్ని సూచిస్తుంది. శ్రీకృష్ణుడిని గోపాలకుడిగానే చూస్తాం తప్ప రాజుగా మనం చూడలేం. సమాజంలోని నిమ్నవర్గాలతో శ్రీకృష్ణుడికి ప్రయత్న పూర్వక బంధం ఉంది’’ అంటాడు దేవదత్ పట్నాయక్.
దేవ్ దత్ పట్నాయక్ అమోఘమైన కృషిని ప్రశంసిస్తూనే…నేషనలిస్ట్ హబ్ మైత్రీపూర్వకమైన ఒక విజ్ఞప్తి చేయదలచుకుంది. ప్రాచీన కావ్యాల్లో దర్శనమిచ్చే మహానుభావుల గురించి వర్తమాన పరిశోధనల వల్ల కలిగిన ఆధునిక జ్ఞానంతో తీవ్రమైన తీర్మానాలు చేయడం భావ్యం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో సరికొత్త పరిశీలనలు కొత్తతరానికి పరిచయం చేసేందుకు ఉపకరించే మాట నిజమని కూడా మా టీమ్ భావిస్తోంది.
శ్రీకృష్ణుడిని కేవలం ఒక సాహిత్య పాత్రగా భావిస్తే ఆ పాత్ర విశ్వసాహిత్య జగత్తులో నిరుపమాన సృష్టి. ఒక చారిత్రక వ్యక్తి అనుకుంటే, ఆ వ్యక్తి ప్రపంచ చరిత్రలో ‘నభూతో న భవిష్యతి’. లీలామానుష వేషధారి అని తలస్తే… అవాఙ్మనసగోచరం అని వేదాంతులు చెప్పిందే ఖచ్చితంగా నమ్మి తీరాలి.
వజ్ర వ్యూహంతో మొదలై త్రిశూల వ్యూహంతో ముగిసిన మహాభారత యుద్ధానికి తాత్విక సమర్థన చెప్పి, దారి చూపింది కూడా జగన్నాటక సూత్రధారే! మౌనం కూడా ఆయుధమనీ, మాట శరమనీ, సందర్భం విచ్చుకత్తుల బోను అనీ హెచ్చరించినవాడు శ్రీకృష్ణపరమాత్ముడు. ఆలోచన స్తంభించినపుడు ఆయుధం అక్కరకు రాదనే ఎరుక కలిగించినవాడు జనార్దనుడు.
మనకు తెలిసిన దశావతారాల లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు నారాయణుడి ఎనిమిదో అవతారం. ధర్మగ్లాని సంభవించినప్పుడు దుష్ణశిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు ఎత్తే అవతారాలను లీలావతారాలంటారు. శ్రీకృష్ణుడి అవతారం కూడా లీలావతారమే! భాగవత కథనం ప్రకారం నారాయణుడి లీలావతారాలు ఇరవైరెండు. వాటిలో శ్రీకృష్ణావతారం ఇరవయ్యవది. లీలావతరాల్లోని ముఖ్యమైన పదింటినే పురాణాలు దశావతారాలుగా చెబుతున్నాయి. శ్రీకృష్ణావతారం నారాయణుడి అవతారంగా భావిస్తారు. మధురలో బాలకృష్ణుడిగా, పూరీలో జగన్నాథునిగా, పండరీపూర్ లో విఠోబాగా, తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిగా, ఉడిపిలో శ్రీకృష్ణుడిగా, గురువాయూరులో గురువాయూరప్పగా శ్రీకృష్ణుని ఆరాధిస్తారు.
శ్రీకృష్ణారాధన సామాన్యశకం ఎనిమిదో శతాబ్ది నాటికే బాగా ఉనికిలో ఉండేది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో లభించిన సామాన్య శకంఎనిమిదో శతాబ్ది నాటి చిత్రంలో సుదర్శనచక్రాన్ని ధరించిన రథసారథి కృష్ణుడేనని పండితుల అంచనా. శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఛాందోగ్యోపనిషత్తు.
సామవేదానికి ఈ ఉపనిషత్తు సామాన్య శకం 8–6 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు చెబుతారు. ఛాందోగ్యోపనిషత్తులో శ్రీకృష్ణుని ప్రస్తావన, ధృతరాష్ట్రుడి ప్రస్తావన కనిపిస్తాయి. ఛాందోగ్యోపనిషత్తు తర్వాతి కాలానికి చెందినవైన నారాయణ అధర్వ శీర్షోపనిషత్తు, ఆత్మబోధోపనిషత్తు వంటి ఉపనిషత్తుల్లో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణకర్త పాణిని తన గ్రంథంలో ‘వాసుదేవకుడు’ అంటే వాసుదేవుడి భక్తుడు అనే అర్థాన్ని చెప్పాడు. పాణిని గ్రంథంలో అర్జునుడి ప్రస్తావన కూడా ఉంది.
‘‘Kind-hearted people might of course think there was some ingenious way to disarm or defeat an enemy without too much bloodshed, and might imagine this is the true goal of the art of war. Pleasant as it sounds, it is a fallacy that must be exposed; war is such a dangerous business that the mistakes which come from kindness are the very worst.’’ అన్నాడు ప్రష్యన్ యుద్ధ నిపుణుడు కార్ల్ వోన్ క్లాస్ విట్జ్ తన ‘‘ON WAR’’ పుస్తకంలో.
‘కొంతమంది దయార్ద్ర హృదయులు తీవ్ర రక్తపాతాన్ని నివారించి, వైరిని నిరాయుధయుణ్ని చేయాలనుకుంటారు. ఇదే యుద్ధనీతి అంతిమ లక్ష్యమని కూడా పరిగణిస్తారు. వినడానికి ఇది బాగానే ఉంటుంది. అయితే ఇందులోని భ్రమను పటా పంచలు చేయాల్సిన అవసరముంది. దయాగుణం వల్ల యుద్ధంలో వచ్చే అత్యంత దారుణమైన ప్రమాదాలు ఊహించలేని పతనానికి కారణమవుతాయి’’ అంటాడు.
ఈ కఠోర వాస్తవాన్ని శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధకాలంలోనే పక్కాగా చెప్పాడు. యుద్ధంలోని అనివార్యత, అమానవీయత, తప్పని రక్తతర్పణ, బంధాల విచ్ఛిన్నం అన్నింటి గురించి అర్థవంతమైన నైతిక సూత్రాలు చెప్పినవాడు శ్రీకృష్ణుడు.
నెత్తుటి గడ్డ కురుక్షేత్ర యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది. ఈ మహాసంగ్రామంలో పద్ధెనిమిది ఔక్షౌహిణుల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అసలు ఈ ఔక్షౌహిణికి బలం ఎంత? ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు భటులు కలిగిన బృందాన్ని ‘‘పత్తి’’ అంటారు. అలాంటి పత్తి సమూహాలు మూడు కలిస్తే ఒక ‘‘సేనాముఖం’’.
మూడు సేనాముఖాలు ఒక గుల్మం. మూడు గుల్మాలు ఒక ‘‘గణం’’. మూడు గణాలు కలిస్తే ఒక ‘‘వాహిని’’. మూడు వాహినులొక ‘‘పృతన’’. మూడు పృతనలొక ‘‘చము’’. మూడు చములొక ‘‘అనీకిని’’. పది అనీకినులు కలిస్తే ఒక ఔక్షౌహిణి. అంటే ఔక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, మూడింతలు గుర్రాలు, లక్షాతొమ్మిది వేల మూడు వందల యాభైమంది సైనికులు వుంటారు. దీన్ని బట్టి వివిధ బలాలు, సైనికులు ఎందరు నశించారో తెలుసుకోవచ్చు.
కేవలం 18 రోజులు జరిగిన యుద్ధమది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే, కురుక్షేత్రంలో చనిపోయిన వారి సంఖ్య తక్కువే. రెండో ప్రపంచయుద్ధంలో సైనికులు, సామాన్యులు వెరసి 7కోట్ల 20 లక్షల మంది మరణించారని అంచనా. ఇందులో సిపాయిలు, యుద్ధఖైదీలు, సామాన్యప్రజలు, యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాలవల్ల మరణించిన వారు వున్నారు.
మౌనాన్ని అర్థం చేసుకోగల శక్తి అందరికీ ఉండదు. మౌనమే ఆధ్యాత్మిక భాష అని చెప్పింది శ్రీకృష్ణుడే! మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మనసును శూన్యం చేసుకోవడం. ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోవడం. పెద్దలు మౌనం పాటించినపుడు పిల్లలకు కంపరం కలుగుతుంది. కానీ, మౌనం చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ కఠోర వాస్తవాన్ని శ్రీకృష్ణుడు తన జీవితంలో పాటించి, ఇతరులకు చెప్పకనే చెప్పాడు. పి.వి.నరసింహారావు పాటించిన మౌనం గురించి మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. మరీ ముఖ్యంగా ‘బాబ్రీ ఘటన’ విషయంలో. వర్తమానంలో దాని పర్యవసానం ఆలయ నిర్మాణానికి దారితీసింది.
ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం. తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత పవిత్ర నగరం ద్వారక సముద్రపు జలాల్లో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది.
శ్రీ కృష్ణుడి ఆదేశంతో అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ద్వారక వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ఊరు దాటించిన మరు నిమిషం ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారక మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడి ముని మనుమడు వజ్రనాభుడు ఆ ఆలయానికొక రూపునిచ్చాడు. ఇప్పుడు మనకు కనిపించే ఐదంతస్తుల దివ్య ఆలయ శిఖరంపై సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం ఆ తుది రూపులో భాగమే!
ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలున్నాయి. ద్వార్ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అత్యతం పవిత్రంగా భావించే చార్ ధామ్-నాలుగు ధామాల్లో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం.
ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యులు ద్వారకా పీఠం స్థాపించారు. ఇది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇదీ ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం.
ఇక్కడే శ్రీకృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనమిస్తాడు. మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవతం, విష్ణుపురాణాల్లో ద్వారకాపురి ప్రస్తావన ఉంటుంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదనీ.. పురాణేతిహాసాలలో వర్ణించిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తారు.
ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణం కోసం ఎంచుకున్నారట. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనల్లో సముద్రగర్భంలోని ద్వారాపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో దీన్ని కనుగొన్నారు. ఈ పరిశోధన తర్వాత 2001లో చేసిన పరిశోధనల్లో సముద్రజలాల్లో మునిగిపోయిన కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిశోధనల్లో లభించిన కళాఖండాల్లోని భాగాలు యు.కె లోని ఆక్స్ ఫర్డ్, జర్మనీ లోని హానోవర్ తో పాటు ఇతర భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధన కోసం పంపారు.
‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం….ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!’’
సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి ధర్మసంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటానని లోకానికి భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కురుక్షేత్రంలో మోహరించిన సేనలను చూసి, విచలితుడైన అర్జునుడు ధనుర్బాణాలు విడిచి, చేష్టలుడిగి కూలబడిపోతే, తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ‘గీత’బోధ చేసినవాడు. ‘గీత’బోధ కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త లోకానికీ ఉద్దేశించిన కర్తవ్యబోధ! అందుకే శ్రీకృష్ణుడు గీతాచార్యుడిగా, జగద్గురువుగా పూజలందుకుంటున్నాడు.
శ్రీకృష్ణుడి జన్మించాడంటే….యుద్ధం ఆసన్నమైందని అర్థం. అలాంటి యుద్ధం లోక కల్యాణార్థమే కావాలని ఆశిద్దాం. కృష్ణం వందే జగద్గరుమ్..!