More

  కూతురికి ప్రేమతో.. సీబీఐకి నో ఎంట్రీ..?! జీవో 51కు అంత సీనుందా..?

  ‘Condemnation before investigation is the highest form of conspiracy’ నేర విచారణ మొదలవ్వక ముందే ఖండనమండనలకు దిగితే అంతకు మించిన గూడుపుఠాణీ మరొకటి ఉండదంటుంది రాజనీతి శాస్త్రం. తాజాగా కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. లిక్కర్ స్కాంలో తన కూతురుపైకి విచారణకు ఎక్కడ వస్తారో అని ముందస్తుగానే కాపాడుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలతో మునిగిపోతున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షంలో ఎవ్వరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా రాష్ట్రంలో సీబీఐకు ముందస్తు అనుమతిని నిరాకరిస్తూ జీవో 51ను కేసీఆర్ తీసుకువచ్చారు. అంటే ఇక నుంచి తెలంగాణలో సీబీఐ ఎటువంటి దాడులు చేయాలన్నా, రాష్ట్రప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అయితే కేసీఆర్ సరిగ్గా రెండు నెలల క్రితమే ఈ జీవోను తీసుకురావడానికి కారణాలేంటి..? ఉన్నపళంగా తన రాజకీయ గురువు చంద్రబాబు చాణక్యాన్ని ఎందుకు ఆశయించినట్లు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  ఢిల్లీ లిక్కర్ స్కాం కొద్ది నెలలుగా దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. కేజ్రీవాల్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు బహిరంగానే గుప్పుమంటున్నాయి. అయితే ఈ స్కాంలో పాత్రధారులు కేజ్రీవాల్ ఆమాద్మీ పార్టీ అయినా,.. అందులోని సూత్రధారులు మాత్రం హైదరాబాద్ వ్యవసాయక్షేత్ర కుటుంబీకులే అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గతంలోనే పలు ఫోటోలను బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఈ కుంభకోణంలో కవితే స్వయంగా పాల్గొని డీల్స్ కుదిర్చినట్లు, సొంత వ్యక్తులే ఛార్టెడ్ ఫ్లైట్లలో తీసుకెళ్ళి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సమావేశమైనట్లు ప్రధాన ఆరోపణ. ఇందుకు బదులుగా ఆమాద్మీ పార్టీ కి కవిత నుంచి భారీగా నిధులు చేకూర్చినట్లు తెలుస్తోంది. ఈ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. దీంతో సీబీఐ ఎప్పుడైనా తలుపుతట్టవచ్చని భావించిన కేసీఆర్ ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇందుకు తన రాజకీయ గురువు చంద్రబాబు అనుసరించిన చాణక్యాన్నే కేసీఆర్ కూడా అనుసరించాడు.

  ఇకపై తెలంగాణలో సీబీఐ ఎటువంటి దాడులు చేయాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ జీవో నెంబర్ 51 ని తీసుకొచ్చారు. అది కూడా ఎటువంటి పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా అత్యంత రహస్యంగా తీసుకు వచ్చారు. దీనికి ఇప్పటివరకూ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కానీ ఎటువంటి వివరణా ఇవ్వలేదు. ఈ విధంగా అనుమతి నిరాకరించడంతో కేసీఆర్ తన కూతురిని కాపాడుకోగలరా..? సీబీఐ కు ముందస్తు అనుమతి నిరాకరిస్తే ఏమవుతుంది..? రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా చేయవచ్చా..? అనేది ఒక్కసారి చూద్దాం.

  సీబీఐ అనేది చట్టబద్దమైన కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‎మెంట్ యాక్ట్ 1946 కింద ఏర్పడిన సంస్థ. ఈ చట్టంతో సీబీఐకు దేశంలో ఎక్కడైనా దాడులు చేసేందుకు అనుమతి లభిస్తుంది కానీ,.. దాడులు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ముందస్తు అనుమతులు తీసుకోవాలని చట్టంలో పొందుపర్చబడింది. అయితే అప్పట్లో అన్ని రాష్ట్రాలూ సీబీఐ కు మందస్తు అనుమతులిస్తూ నిర్ణయించుకున్నాయి. 2014 వరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ సీబీఐ విచారణకు ముందస్తు అనుమతులు నిరాకరించిన దాఖలాలు లేవు. కానీ ఈ విధంగా అనుమతుల నిరాకరణ 2015నుంచే మొదలైంది. మొట్టమొదటిసారిగా 2015లొ మేఘాలయ ప్రభుత్వం సీబీఐ కు ముందస్తు అనుమతిని నిరాకరించింది. అప్పట్లో మేఘాలయలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని తర్వాత శివసేన ఆధ్వర్యంలోని మహారాష్ట్ర తో పాటు పంజాబ్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‎ఘర్, కేరళ ప్రభుత్వాలు సీబీఐ తమ రాష్ట్రాల్లో ముందస్తు అనుమతిని నిరాకరించాయి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్, మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు వెంటవెంటనే అనుమతి నిరాకరించడంతో ఈ విషయం పై తీవ్రంగా చర్చ జరిగింది. అయితే సీబీఐకి అనుమతి నిరాకరించిన ప్రభుత్వాలన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలే కావడం, ఇందులో కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు చేసినవే కావడం విశేషం.

  జీవో 51 వల్ల ఆయా రాష్ట్రాల్లో ఇకపై సీబీఐ దాడులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేసుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి వివరించి ఎవరిపై దాడులు చేస్తున్నారని ముందస్తుగా చెప్పి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా ప్రభుత్వాలకు ఎవరిపై దాడులు చేస్తున్నారనే విషయం ముందుగానే తెలిసి తమవారిని జాగ్రత్త చేసే అవకాశం ఏర్పడుతుంది. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు ఈ విధమైన వ్యూహాన్ని అనుసరించాయి. అయితే సీబీఐకి ఈ విధంగా ముందస్తు అనుమతి నిరాకరించడం సబబేనా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 168 సీబీఐ కేసులు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అనుమతి కోసం పెండింగ్ లో ఉన్నాయి. ఈ విధంగా కేసులు అనుమతి వద్దే ఆగిపోవడం వల్ల నిందితులు ముందుగా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. అవినీతిపై అనుమానం వచ్చినప్పుడే ఆకస్మిక దాడులు చేస్తే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికే అవకాశముంటుంది. కానీ ఈ విధంగా అనుమతి నిరాకరించడం వల్ల అంతిమంగా నిందితులకే లాభమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  అయితే ఈ విధంగా ముందస్తు అనుమతి రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించవచ్చా అనే దానిపై నైతిక ప్రశ్నలు పలువురిని తొలుస్తున్నాయి. ఏదైనా విచారణ అంటే దానికి తగిన సాక్ష్యాధారాలు తప్పనిసరిగా ఉంటాయి. సీబీఐ తలుపు తట్టడమంటే ఎక్కడో ఒకచోట అవినీతికి మూలాలున్నాయనే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా అవినీతి చేయకపోతే విచారణలో తాము పరిపూర్ణులమని నిరూపించుకుంటే ఏ గొడవా ఉండదు. నిర్భయంగా విచారణను ఎదుర్కొని సచ్ఛీలురుగా బయటపడితే ప్రజల్లో కూడా ఆయా నాయకులపై అభిమానం పెరుగుతుంది. కానీ ఈ విధంగా ముందుగానే అనుమతిని నిరాకరిస్తే ప్రతిపక్షాలకు ఆయుధమిచ్చినట్లు అవుతుంది. తాము అవినీతి చేసి భయపడుతున్నట్లు ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలిచ్చినట్లవుతుంది. తాజాగా సీబీఐ అనుమతి నిరాకరణ విషయం బయటపడగానే బండిసంజయ్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సీబీఐ కు భయపడుతోందనీ,.. తప్పు చేయకుంటే ఇంత భయమెందుకని ప్రశ్నించారు.

  అంతేకాదు, ఇలాంటి నర్ణయాల వల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఉంది. దొరికిన చోటల్లా సీబీఐ అనుమతి నిరాకరిస్తూ దర్యాప్తు సంస్థలను అడ్డుకుంటే,.. కేంద్ర ప్రభుత్వం అవినీతిపై పోరాడాలనే ఆశయానికి కూడా అడ్డంకి ఎదురవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ రాష్ట్రాల్లో అడుగుపెట్టకూడదనే మూసధోరణి ఇదేవిధంగా అవలంభిస్తే,.. ఏమీ చేయలేని పక్షంలో సీబీఐ చట్టానికి కూడా సవరణ తీసుకువచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎన్ఐఏ లాగే మందస్తు అనుమతి అవసరం లేదన్న నిబంధనా తీసుకురావచ్చు.

  దేశ రాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్‌లు ఇస్తుంటాయి. సమ్మతి నోటిఫికేషన్‌ ప్రకారం… ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ తనిఖీలు, దర్యాప్తులు చేయవచ్చు. జనరల్ కన్సెంట్ రద్దు చేస్తే రాష్ట్రంలో సీబీఐ కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగాల్‌, ఛత్తీస్ గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లు తమ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నాయి. రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడం ఆపలేరు. కోర్టులు ఆదేశిస్తే… దర్యాప్తు చేయవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు.

  అయితే, సీఎం కేసీఆర్ జీవో 51 జారీ చేసినంత మాత్రాన.. సీబీఐకి తలుపులు పూర్తిగా మూసిపోయినట్టు కాదు. సీబీఐకి కూడా కొన్ని వెసులుబాట్లు వున్నాయి. పైగా రాష్ట్రం బయట నమోదైన కేసుల విషయంలో జీవో 51 పనిచేయదనే వాదన వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ ఢిల్లీలో నమోదైంది. దీంతో ఢిల్లీలో నమోదైన కేసుల విచారణను రాష్ట్రాల్లో చేయాల్సి వస్తే అలాంటి విచారణను ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు ఆపలేవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి మీద సీబీఐ ఉద్యోగాల కుంభకోణం కేసు పెట్టింది. బిహార్‌ కూడా ఇటీవలే జనరల్‌ కన్సెంట్‌ ను రద్దు చేసింది. సీబీఐ తేజస్వి మీద కేసును ఢిల్లీలో నమోదు చేసింది కాబట్టి దర్యాప్తునకు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా సోదాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా అక్కడే నమోదైంది. అందుకే తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు.

  అంతేకాదు, అవసరమైతే సీబీఐ కోర్టుకెళ్లి జీవో 51ను రద్దు చేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. దాణా కుంభకోణంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సీబీఐని తమ రాష్ట్రాలోకి రాకుండా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వులను కొట్టివేయించడంతో లాలూ జైలుకెళ్లారు. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంగా పనిచేసిన వీరభద్రసింగ్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. వీరభద్ర సింగ్‌ సీబీఐని తమ రాష్ట్రంలోకి రావద్దంటూ జీవో ఇచ్చారు. సుప్రీంకోర్టు సదరు జీవోను కొట్టివేయడంతో వీరభద్రసింగ్‌ జైలుకు వెళ్లారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి మధుకోడా అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ప్రారంభించింది. జార్ఖండ్‌లో సీబీఐకి అనుమతి లేదంటూ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు సదరు జీవోను రద్దు చేయడంతో సీబీఐ తనపని తాను చేసుకుపోయింది. సీఎం హోదాలో మధు కోడా అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇలాంటి ఉదాహరమణలు చాలా ఉన్నాయి.

  జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా సీబీఐకి కొన్ని పరిమితులు పెట్టగలిగినప్పటికీ.. ఇలాంటి దాడులు, అరెస్టులు చేయాలనుకుంటే ఈడీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అవినీతి, పెద్ద మొత్తంలో నగదు బదిలీకి సంబంధించి ఈడీ చేపడుతున్న నల్లధనం చెలామణి కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని అడ్డుకోగలుగుతాయి. ఈడీ వంటి సంస్థల్ని కట్టడి చేయలేవని చెబుతున్నారు. ఐటీ కూడా అంతే. ఇవన్నీ చూస్తే.. సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం ఉండదనేది న్యాయ నిపుణుల అభిప్రాయం.

  Trending Stories

  Related Stories