కశ్మీర్ లోయలో శాంతికుసుమాలు

0
1211

బారాముల్లా బాంబుల మోత, బందీపురాలో బందూకుల గర్జన,. పుల్వామాలో పేలుళ్లు, షోపియాన్ లో గ్రెనేడ్ల దాడులు. కొన్నాళ్ల క్రితం వరకు ఇలాంటి వార్తలు సర్వసాధారణంగా వినపడుతూనేవుండేవి. జమ్ము కశ్మీర్ లోని ప్రతి జిల్లాలో నిత్యం ఏదో ఓ చోట టెర్రరిస్టు యాక్టివిటీ జరుగుతూనేవుండేది. కశ్మీర్ లోయ నిత్యం రక్తమోడుతూనేవుండేది. ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు లేవని కాదు, కానీ, గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆర్టికల్ 370 రద్దు కేంద్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆలౌట్ తో.. దశాబ్దాలుగా రావణ కాష్టంలా రగిలిన కశ్మీర్ లోయలో మెల్లమెల్లగా శాంతి కుసుమాలు విరబూస్తున్నాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే ప్రయత్నాలను కేంద్రం పకడ్బందీగా అమలు చేస్తోంది. ఇప్పటికే కరుడుగట్టిన ఉగ్రవాదులంతా హతమయ్యారు.

ఓవైపు ఉగ్రవాదుల పీచమణచివేస్తూనే.. మరోవైపు కశ్మీరీ యువత ఉగ్రవాదంవైపు మొగ్గకుండా వినూత్న కార్యక్రమాలు చేపట్టింది కేంద్రం. యువత దృష్టిని ఉగ్రవాదం వైపు కాకుండా ఉపాధి వైపు మళ్లించడంలో అధికారుల ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. నూతన కార్యక్రమాలు సత్ఫలితాల నిస్తున్నాయి. దీంతో నేడు కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంఖ్య మునుపెన్నడూ లేనంతగా తగ్గుముఖం పట్టింది. గతేడాది కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల్లో తగ్గుదల కనిపించిందని కేంద్ర భద్రత సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. 2021లో ఇప్పటివరకు టెర్రరిస్టు ఘటనలు 25 శాతం మేర తగ్గాయి. ముఖ్యంగా ఇక్కడి యువత ఉగ్రవాద కార్యకలాపాల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

2020లో 167 మంది కశ్మీరీలు టెర్రరిస్టు సంస్థల్లో చేరగా, ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది మాత్రమే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. వారిలో కనీసం 8 మంది ఎన్ కౌంటర్లలో హతం కావడమో, లేక పట్టుబడడమో జరిగింది. 2020లో ఇదే సీజన్ లో జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడుల సంఖ్య 58 కాగా, ఈ ఏడాది 43 ఘటనలే జరిగాయి. అదే సమయంలో… ఆచూకీ లేకుండా పోయారని, లేక, ఉగ్రవాద సంస్థల్లో చేరారని భావించిన 9 మంది తమ ఇళ్లకు తిరిగిరావడం కొత్త మార్పునకు సంకేతం. ఇటీవల జమ్మూకశ్మీర్ లో యువత ప్రాతినిధ్యం ఉండేలా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దేశాన్ని చుట్టివచ్చేలా స్టడీ టూర్లు, ఏడాది పొడవునా క్రీడాపోటీలు, విద్యాభ్యాసానికి సాయం చేసే చర్యలు, డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్లు నిర్వహించడం ద్వారా యువత దృష్టిని ఉగ్రవాదం నుంచి మరల్చగలుగుతున్నట్టు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు.

అటు కశ్మీర్ లో ఉగ్రవాదం గణనీయంగా తగ్గినట్టు కేంద్ర హోం శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి సైతం ప్రకటించారు. ఇటీవల రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జమ్ము కశ్మీర్‌లో 859 ఉగ్రవాద ఘటనలు జరిగాయన్నారు. బీజేపీ ఎంపీ హరనాథ్‌ సింగ్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019లో 594, 2020లో 244 ఘటనలు జరిగాయని అన్నారు. ఇక, ఈ ఏడాది మార్చి 15 వరకు.. 21 ఉగ్రవాద ఘటనలు జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. గత మూడేళ్లలో ఉగ్రవాద ఘటనల్లో 237 మంది భద్రతా సిబ్బంది, 117 మంది సామాన్య ప్రజానీకం మరణించినట్లు సమాధానమిచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

ten + sixteen =