ఇమ్రాన్‎కు మోదీ లేఖ..! ఏం రాశారో తెలుసా..?

0
1333

భారత్‎పై నరనరానా విద్వేషం నింపుకున్న శత్రుదేశం ఏదైనా వుందంటే అది పాకిస్తాన్ మాత్రమే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఎందరో భారత ప్రధానులు.. పాక్ తో మంచి సంబంధాలను నెలకొల్పేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే, ఎన్నిసార్లు స్నేహ హస్తం అందించినా.. దశాబ్దాలుగా అది మనపై విషం కక్కుతూనేవుంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తే దేశంలో అశాంతిని రేపుతూనేవుంది. కశ్మీర్ కల్లోలానికి కారణమవుతూనేవుంది. ఇటీవల చైనా తొత్తుగా మారిన తర్వాత.. పాక్ పైత్యం మరింత పెరిగిపోయింది. దాని ఆగడాలకు అడ్డూ అదుపూలేకుండా పోయాయి. అయితే, పాక్ ఉగ్ర పన్నాగాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతూనే.. మరోసారి స్నేహ హస్తం అందించింది.

నమ్మకమనే పునాదిపై స్నేహసౌధం నిర్మిద్దామంటూ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ పలుపునిచ్చారు. పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఒక లేఖ రాశారు. ఒక పొరుగు దేశంగా భారత్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాన్ని కోరుకుంటుందని.. ఇందుకోసం ఉగ్రవాదం, శతృత్వం లేని నమ్మకం, విశ్వాసంతో కూడిన వాతావరణం అవసరమని లేఖలో రాశారు. కోవిడ్ 19 మహమ్మారితో పోరాడుతూ, సవాళ్లను అధిగమిస్తున్న క్లిష్ట సమయంలో మీకు, పాకిస్తాన్ ప్రజలకు నా అభినందనలు అంటూ.. లేఖలో పేర్కొన్నారు. అటు, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేశ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వికి లేఖ రాశారు.

కరోనా బారిన పడిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలంటూ.. ఇటీవలే ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఇప్పుడు లేఖ కూడా రాశారు. అంతేకాదు, భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ నదీ జలాల వివాదంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే.. మోదీ ఈ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. గత నెలలో ఇరు దేశాల మధ్యా జరిగిన చర్చల్లో వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణను పాటించాలని నిర్ణయానికి వచ్చారు. ఆపై రెండున్నరేళ్ల తరువాత తొలిసారిగా తాజాగా పాక్ అధికారులు భారత్ కు రాగా, నదీ జలాల పంపిణీపై చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల దిశగా సానుకూల వాతావరణం నెలకొంటున్న సమయంలో మోదీ ఈ లేఖను పంపించడం మరింత మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఏర్పడుతున్న స్నేహపూర్వక సంబంధాల వెనుక మూడో దేశం జోక్యం ఉండి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి.. సౌదీ అరేబియా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి ఆదిల్ అల్ జుబైర్ మాటల ద్వారా తెలుస్తోంది. ఇటీవల అరబ్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియా ఈ ప్రాంతం మొత్తంలో శాంతిని కోరుకుంటోందని, అందుకు తగిన ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య యూఏఈ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు కొన్ని వార్తాపత్రికలు కూడా పేర్కొన్నాయి. అయితే, ఈ విషయాలను భారత్, పాకిస్తాన్‌లు ధ్రువీకరించనప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న స్నేహ సంబంధాలకు ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఈ లేఖ ప్రతి ఏటా పంపించే రొటీన్ లెటర్ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశాధినేతలకు కొన్ని కొన్ని ప్రత్యేక రోజుల్లో సాధారణంగానే ఇలాంటి లేఖలు వెళ్తుంటాయనీ, అందులో భాగంగానే పాకిస్తాన్ డే సందర్భంగా ప్రధాని మోదీ, ఇమ్రాన్ ఖాన్ కు ఆ లేఖను పంపించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతియేటాలాగానే ఈ ఏడాది కూడా ప్రధాని తన తరపున శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను పంపారన్నారు. ఇది రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు తోడ్పడుతుందని చెబుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

9 − seven =