ఉగ్రవాద పాకిస్తాన్, విస్తరణవాద డ్రాగన్ కు మాత్రమే కాదు.. తమ సార్వభౌమత్వానికి అడ్డొస్తే.. అగ్రదేశాలను కూడా లెక్కచేయమని చెబుతోంది భారత్. చెప్పడమే కాదు చేతల్లోనూ చూపిస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే.. ప్రపంచ దేశాలు వెనుకాముందు ఆలోచించే పరిస్థితి. ఇందుకు భారత్ కూడా మినహాయింపేమీ కాదు. అమెరికా ఇష్టానికి భిన్నంగా వ్యవహరించాలంటే అది కత్తిమీద సామే. ఆ దేశానికి ఎదురు చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. కానీ, ఇది ఒకప్పటిమాట. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్న భారత్.. అగ్రదేశాలను సైతం శాసించే స్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో.. పెద్దరికాన్ని నిలుపుకునే నెపంతో అడ్డగోలు ఆంక్షలు విధిస్తే.. ఊరుకునేది లేదని అమెరికాకు సైతం తెగేసి చెబుతోంది. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు విషయంలో అడ్డుపడుతున్న అమెరికా వైఖరి పట్ల భారత్ సీరియస్ గా స్పందించింది.
నిన్నమొన్నటివరకు అధికారంలో వున్న ట్రంప్.. భారత్ తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలకు సానుకూలంగా వ్యవహరించాడు. కానీ, బైడెన్ రాకతో పరిస్థితుల్లో కొంత మార్పు కనబడుతోంది. ముందు నుంచి ఊహించినట్టే.. భారత్ పై పెద్దరికాన్ని పునరుద్ధరించుకోవడం కోసం.. బైడెన్ ప్రయత్నిస్తున్నట్టే కనబడుతోంది. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను దిగుమతి చేసుకోవడం అమెరికాకు ససేమిరా ఇష్టం లేదు. గతంలో ఎన్నోసార్లు ఆంక్షలు విధిస్తామంటూ బెదిరించిన సందర్భాలున్నాయి. అయితే, ట్రంప్ హయాంలో అమెరికా తన వైఖరి కొంత మార్చుకున్నా.. బైడెన్ రాకతో మళ్లీ అదే తీరును కనబరుస్తోంది. దీనిపై భారత్ ఘాటుగానే స్పందించింది. ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో గానీ, ఎస్-400 ట్రైనింగ్ కోసం భారత ఆర్మీని రష్యాకు పంపించే విషయంలో గానీ.. మీ ఒత్తిడికి తలొగ్గేది లేదంటూ అమెరికాకు స్పష్టం చేసింది. అంతేకాదు, మీకు అణగిమణగి వుండటానికి ఇది నైన్టీస్ జమానా కాదంటూ ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేసింది భారత్.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఎరో ఇండియా ఎగ్జిబిషన్లో.. భారత్ ఎక్కువగా రష్యాకు చెందిన ఫైటర్ జెట్లనే ప్రదర్శించింది. వీటిలో సుఖేయ్, మిగ్ శ్రేణికి చెందిన యుద్ధవిమానాలే ఎక్కువగా వున్నాయి. ఇందులో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిజానికి, రష్యా నుంచి మరో అత్యాధునిక రక్షణ వ్యవస్థను కూడా కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఆధునిక తరానికి చెందిన టి-14 యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి రెడీ అయ్యింది. ఈ నిర్ణయమే అమెరికాకు కంటగింపుగా మారింది. ఇప్పటికే రష్యా నుంచి ఎస్-400 లను కొనుగోలు చేసిన చైనా, టర్కీలపై.. 2017 కాట్సా యాక్ట్ ను ప్రయోగించింది అమెరికా. భారత్ పైనా ఇలాంటి ఆంక్షలే అమలు చేయాలని చూసింది. అయితే, భారత్ విషయంలో మాత్రం మాజీ అధ్యక్షుడు ట్రంప్ మినహాయింపు ఇచ్చాడు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయబోమన్న భారత్ హామీ మేరకు.. ఆంక్షలు ఎత్తివేసింది అమెరికా.
కానీ, జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. బైడెన్ భారత్ బంధువు కాదన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో.. తమ శాశ్వత శత్రువైన రష్యా నుంచి భారత్ రక్షణ పరికరాలు కొనుగోలు చేయడం నచ్చని అమెరికా.. భారత్ పై ఆంక్షలు విధించే సంకేతాలు కనపిస్తున్నాయి. దీనిని ముందే పసిగట్టిన భారత్.. బైడెన్ సర్కార్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. రక్షణ కొనుగోళ్ల విషయంలో భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందని,.. జాతీయ ప్రయోజనానికి అగ్రస్థానం ఇస్తుందని తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదని మోదీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. ఓవైపు, బైడెన్ ప్రభుత్వానికి స్నేహ హస్తం అందిస్తూనే.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే.. అమెరికా కంపెనీలను కూడా వదలబోమన్న సంకేతాలిచ్చింది. ఇందుకు టూల్ కిట్ వ్యవహారమే ఉదాహరణ. రైతు ఉద్యమం వెనుకనున్న అదృశ్య శక్తులకు వేదికగా నిలిచిన ట్విట్టర్ పై ఇటీవల భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి రక్షణ కొనుగోళ్ల విషయంలో తలదూర్చితే.. పరిణామాలు ఇంతకన్నా సీరియస్ గా వుంటాయని చెప్పకనే చెప్పింది.
కొద్దిరోజుల క్రితం.. భారత్లో అమెరికా దౌత్యాధికారి డొనాల్డ్ హెఫ్లిన్ మాట్లాడుతూ.. రష్యాతో రక్షణ కొనుగోళ్లు మానుకోవాలని తమ మిత్రదేశాలను కోరుతున్నాం.. లేదంటే, అది ఆంక్షలు విధించే పరిస్థితికి దారితీయొచ్చని అన్నాడు. అంతేకాదు, ఈ విషయంలో భారత్ కు మినహాయింపు ఇవ్వాలని.. తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ.. పరోక్షంగా బెదిరింపు దోరణిలో మాట్లాడారు. అయితే, అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం బెదరలేదు సరికదా.. రష్యాతో మరో కొత్త రక్షణ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ఈ చర్య ద్వారా బైడెన్ సర్కార్ కు తమ స్టాండ్ ను చెప్పకనే చెప్పింది భారత్. 1990వ దశకంలో భారత్ అణుపరీక్షలు జరిపినప్పుడు.. నాటి క్లింటన్ ప్రభుత్వం భారత్ పై ఆంక్షలు విధించింది. ఆ ఉదంతాన్ని గుర్తుచేసిన భారత్.. ఇది నైన్టీస్ జమానా కాదంటూ అమెరికాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. భారత్ విషయంలో విదేశీ జోక్యంపై మోదీ ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవరిస్తోంది. విదేశాల ఒత్తిడికి ఏమాత్రం లొంగకుండా ‘నేషన్ ఫస్ట్’ విధానానికి మోదీ పెద్దపీట వేస్తున్నారు.