ఇండో చైనా సరిహద్దు వివాదం.. సీఐఏ సీక్రేట్ పేపర్స్

0
1263

చారిత్రకంగా చైనా కుట్రను ఒంటబట్టించుకున్న దేశం. సుదీర్ఘమైన యుద్దాలూ, సన్ జూ గెరిల్లా యుద్ధకళ, జపాన్ దురాక్రమణా, మావో వార్ స్ట్రాటజీల మధ్య ఎదిగిన దేశం చైనా. మంగోల్ పీఠభూమి సాంతం యుద్ధాన్ని ఒంటబట్టించుకున్నదే!  ఈ కారణంగానే చైనా, జపాన్, తైవాన్, మంగోలియా, ఉత్తర, దక్షిణ కొరియాలు నిరంతరం యుద్ధాన్ని స్మరిస్తాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవాల్సిన దశ ముందుకు వచ్చింది. నాటి ప్రధాని నెహ్రూకు వ్యూహాత్మక దృష్టి లేని కారణంగా, చైనా కుట్రల మూలంగా సరిహద్దు వివాదాలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. 1950-59వరకూ సరిహద్దు వివాదాల విషయంలో చైనా ఎలాంటి వైఖరి అవలంబించిందో అమెరికా అంతర్జాతీయ నిఘా సంస్థ సీఐఏ తన రహస్య పత్రాల్లో తేటతెల్లంగా వివరించింది. 1950 నుంచి 1963 వరకూ చైనా కుట్రలనూ, భారత్ ఉదాసీన వైఖరినీ సీఐఏ ప్రస్ఫుటంగానే వెల్లడించింది.

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ మూడో వారం నుంచి సరిహద్దుల్లోని కనీసం ఆరు ప్రాంతాల నుంచి  చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నాలు చేసింది. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. ఇది సాధారణంగా సరిహద్దుల్లో జరిగే చిన్న పాటి ఘర్షణల్లాంటివి కావని, చైనా ఒక వ్యూహం ప్రకారం భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విదేశాంగ, రక్షణ నిపుణులు అంటున్నారు.

లద్దాఖ్‌లోని గాల్వాన్‌, పాంగాంగ్‌, డెమ్‌ చోక్‌ ప్రాంతాల్లో కనీసం 10 వేల మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. భారత్-చైనా వివాదంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

భారత్-చైనా సరిహద్దు వివాద పరిష్కారంలో భారత్ చూపిన చొరవేంటి? చైనా చేసిన కుట్ర ఏంటి? అమెరికాకు ఉన్న ప్రయోజనమేంటి? ఇంతకూ  భారత్-చైనా సరిహద్దు వివాదం ఎక్కడ మొదలైంది?

ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం….

ఇటీవలి కాలంలో భారత్, చైనా దేశాల మధ్య చెలరేగుతోన్న సరిహద్దు వివాదం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ఇరుపక్షాల చొరవతో తాత్కాలికంగా వివాదానికి తెరపడింది. కానీ భవిష్యత్‌లో మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముంది.

యూరప్‌లో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీల మధ్య వంద సంవత్సరాలు యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఈ మూడు దేశాలు మిత్రదేశాలయ్యాయి. మరి ఇండియా, చైనా దేశాలు అలాంటి శాంతియుత వాతావరణాన్ని సృష్టించుకోలేవా? అన్న సందేహం అంతర్జాతీయ విదేశాంగ నీతి చరిత్రలో నిరంతరం తారసపడుతూ ఉంటుంది. జనాభా దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలు భారత్, చైనా.

ప్రపంచ జనాభాలో 35 శాతం అంటే 260 కోట్లమంది నివసించే ఈ రెండు దేశాలూ ఘర్షణకు దిగితే ప్రపంచంలో మూడోవంతు జనాభా తల్లడిల్లిపోతుంది. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం. ఇండియా, చైనాలు అతిశక్తివంతమైన రాజ్యాలు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ నదీజలాల వినియోగం విషయంలో, ముఖ్యంగా బ్రహ్మపుత్ర జలాల వినియోగం,  వాస్తవాధీనరేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించే విషయంలో చైనా వైఖరిలో హేతుబద్ధత లోపించింది.

ఒకదేశ విదేశాంగ విధానం చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, పరిసరాల, నాయకత్వ అంశాల వల్ల ప్రభావితమవుతుంది. 1950 నుంచి నేటివరకూ భారత్, చైనా దేశాల మధ్య వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాలకు అంతర్గత, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు కొంతవరకు కారణం. ద్వెపాక్షిక సంబంధాలు విశ్లేషించే ముందు ఇరుదేశాల భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంశాలను పరిశీలిద్దాం.

స్వతంత్య్ర భారత తొలి ప్రధానిగా విదేశీ వ్యవహారాల మంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ భారత్-చైనా సంబంధాలకు నాంది పలికారు. స్వాతంత్య్రానికి పూర్వమే 1935లో తాను రచించిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ లో నెహ్రూ ఇండియా, ఇంగ్లండ్ తర్వాత చైనాను అత్యంత ఇష్టమైన దేశాలంటూ ప్రస్తావించారు. నెహ్రూ భావుకత ముందు రాజనీతి నిలవలేకపోయిందంటారు బ్రిటిష్‌ జర్నటిస్ట్‌ నెవిలీ మాక్స్‌ వెల్‌ రాసిన ‘ఇండియాస్‌ చైనా వార్‌’ పుస్తకంలో. ఈ కారణంగానే చైనా, రష్యాల ‘‘స్ట్రాటజిక్ విజన్’ ను అంచనావేయలేకపోయారనేది మాక్స్ వెల్ పరిశీలన.

1939లో చైనాలో నెహ్రూ జరిపిన పర్యటన తర్వాత ఇరుదేశాలు మరింత చేరువవ్వాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత మల్టీపోలార్ ప్రపంచమేర్పడుతుందని అందులో ఇండియా, చైనా కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. 1949 చైనా విప్లవం తర్వాత కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. 1950 లో చైనా టిబెట్‌ను ఆక్రమించినప్పుడు.. ఉపప్రధాని సర్దార్‌వల్లభాయ్ పటేల్, చైనా దురాక్రమణ విధానాన్ని ఖండిస్తూ, ఆ చర్య భవిష్యత్‌లో భారత ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

1954లో చైనా ప్రధాని ‘చౌ ఎన్ లై’ భారతదేశాన్ని, నెహ్రూ చైనాను సందర్శించారు. చైనాలో తనకు లభించిన స్వాగతపురస్కారానికి నెహ్రూ పులకించిపోయారు. పటేల్ ముందుచూపుతో చేసిన వ్యాఖ్యానాన్ని నెహ్రూ పట్టించుకోలేదు. అదే ఏడాది భారత్ ప్రచురించిన భౌగోళిక చిత్రపటంలో అక్సాయ్‌చిన్-వాయవ్య సరిహద్దు మూలను ఇండియా లో అంతర్భాగంగా చూపించారు. చైనా దీన్ని ఖండించింది. నెహ్రూ నోరు మెదపలేదు.

1956లో చౌ ఎన్ లై భారత్‌ను సందర్శించారు. ఆయనతోపాటు వచ్చిన దలైలామా రహస్యంగా నెహ్రూని కలిసి భారత్‌కు పలాయనం గావిస్తానని, టిబెట్‌లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని చెప్పారు.

1958లో నెహ్రూ టిబెట్‌ను సందర్శించడానికి అనుమతి నిరాకరించడంతో చైనా కుటిల ప్రవర్తన బయటపడింది. అదే సంవత్సరంలో చైనా ప్రచురించిన భౌగోళిక చిత్రపటంలో భారత్ కు చెందిన విశాల భూభాగాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించింది.

ఈ విషయంలో భారత్ నిరసన తెలిపితే, చౌ ఎన్ లై బ్రిటిష్‌ పాలకులు రూపొందించిన ‘మెక్‌మోహన్ రేఖను’ గుర్తించమని జవాబిచ్చారు. ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న భూభాగపు సరిహద్దుల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. 1959లో దలైలామా టిబెట్ నుంచి పారిపోయి భారతదేశానికి రావడం, మన ప్రభుత్వం ఆశ్రయమివ్వడం చైనాకు కోపం తెప్పించింది.

సరిగ్గా ఈ తొమ్మిదేళ్ల కాలాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎలా పరిశీలించిందో-ఎలాంటి అంచనాలకు వచ్చిందో చూద్దాం….

Developments between late 1950 and late 1959 were marked by Chinese military superiority which, combined with cunning diplomatic deceit, contributed for nine years to New Delhi’s reluctance to change its policy from friendship to open hostility toward the Peiping regime.

తొమ్మిదేళ్లపాటు చైనా సైనిక ఆధిక్యతనూ, దౌత్య కుట్రనూ ప్రదర్శిస్తే నెహ్రూ మాత్రం ఉదాసీన వైఖరిని ప్రదర్శించారనీ, చైనా పాలసీలో మైత్రి బంధం స్థానంలో వైరి సంబంధంగా మార్చడంలో నెహ్రూ ఉదారంగా వ్యవహరించారని సీఐఏ పేర్కొంది. (1 ఇమేజ్)

అక్సాయ్ చిన్ మైదానం విషయంలో సైతం సీఐఏ ఇలాంటి పరిశీలనే చేసింది.

Behind the interminable exchange of letters and notes carrying territorial claims and counterclaims lies the view of the Indian leaders that Peiping surreptitiously had deprived India of a large corner of Ladakh…అంటూ వ్యాఖ్యానించింది. (ఇమేజ్ 2)

అక్సాయ్ చిన్ ను చైనా దురుద్దేశపూర్వకంగా ఎలా ఆక్రమించిందో, లఢక్ లోని సుదూర మైదానాన్ని ఎలా కుట్రపూరితంగా చైనా ఆక్రమించిందో సీఐఏ స్పష్టం చేసింది.

1960లో చౌ ఎన్ లై భారతదేశాన్ని సందర్శించినప్పుడు సరిహద్దు వివాదం విషయంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ప్రదర్శించాలనే పేరుతో లఢక్ ఆక్రమణను సుతిమెత్తగా ప్రతిపాదించారు.  ఈ ప్రతిపాదన ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియా నియంత్రణను చైనా గుర్తించడం, పశ్చిమ భూభాగంలో లఢక్ లో చైనా ఆధిపత్యాన్ని ఇండియా గుర్తించడం. ఇది చౌ ఎన్ లై ప్రతిపాదన. దీంతో నెహ్రూ మెతక వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  

1962 జూలైలో ఇండియా, చైనా సరిహద్దు బలగాల మధ్య ఘర్షణ తలెత్తింది. పశ్చిమ ప్రాంతంలో మన సాయుధ బలగాలు కొంత ప్రతిఘటించినప్పటికీ, తూర్పుభాగాన చైనా దళాలు తమ పూర్తి ఆధిక్యతను చాటాయి. బ్రహ్మపుత్రా లోయను దాటి, అస్సాంలోని తేజ్‌పూర్ టౌన్ వరకూ చైనా సైన్యం చొచ్చుకువచ్చింది.

ఆశ్చర్యకరంగా నవంబర్ 22న చైనా సైన్యం ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించి తాము ఆక్రమించిన భూభాగం నుంచి నిష్ర్కమించింది. ఈ సంఘటన నెహ్రూ అసమర్థ విదేశాంగ నీతికి ప్రతీకగా నిలిచిపోయింది.  భారత ప్రజలు తీరని అవమానంగా భావించారు.

అప్పటి నుంచి నేటివరకూ భారతీయులు చైనాను మిత్రద్రోహిగా, దురాక్రమణవాదిగా పరిగణిస్తారు. భారతీయ సైన్యం తగిన శిక్షణ, ఆయుధాలు లేక చైనీయుల ధాటికి నిలవలేకపోయింది. మన రాజకీయ నాయకత్వంలో ముందుచూపు కొరవడింది. చైనాను గుడ్డిగా నమ్మారు. నెహ్రూ అలీన విధానానికి ప్రాధాన్యం ఇస్తూ సామరస్యంతో సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకోవాలనే ఆచరణ సాధ్యం కాని వైఖరిని ప్రదర్శించారు.  చైనా మాత్రం వ్యూహాత్మకంగా  అలీన విధానాన్ని అపహాస్యం చేస్తూ కయ్యానికి కాలుదువ్వింది.

అలీన విధానం ఆచరణ సాధ్యం కానిదనీ, విదేశాంగ విధానాల్లో ఉండే సంక్లిష్టతల మూలంగా కుదరదనీ నిపుణులు హెచ్చరించినా నెహ్రూకు పట్టలేదు.

నెహ్రూ చైనాను గుడ్డిగా నమ్మడం, కమ్యూనిస్ట్ వ్యూహం-ఎత్తుగడల వెనుక ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం, నాటి రక్షణ శాఖ మంత్రి కృష్ణ మీనన్ అనుభవ రాహిత్యం వల్ల సాయుధ బలగాలను ఆధునికీకరణను తాత్సారం చేయడం 1962లో చైనా చేతిలో భారత్ భంగపాటుకు కారణం.

1967లో భారత బలగాలు చైనాకు దీటైన జవాబు ఇచ్చినా ఆ విజయం మరుగున పడింది. అందుకు ప్రధాన కారణం సందర్భ ఔచిత్యం లేని ఎదురుదాడికి చరిత్రలో ప్రాధాన్యత ఉండదంటారు నిపుణులు.

చైనా-భారత్ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోలేని నెహ్రూ రష్యా జోక్యాన్ని కోరారు. నాటి రష్యా అధినేత కృష్చేవ్ నెహ్రూ విజ్ఞప్తితో అనేక బహిరంగ ప్రకటనలు చేశారు. సరిహద్దు వివాదం విషయంలో చైనా వైఖరి చికాకు తెప్పిస్తోందన్నారు. ఈ విషయాన్ని సీఐఏ తన రహస్య పత్రాల్లో పేర్కొంది.

In this period, Khrushchev made several public statements in which he deplored the border dispute, clearly implying that Chinese military actions were jeopardising Moscow relations with New Delhi, he described the dispute as a “sad and stupid story…(ఇమేజ్ 3)

నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో విదేశాంగ విధానంపై రష్యా ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో ఈ ప్రకటన చూస్తే అర్థమవుతుంది. సరిహద్దు వివాదం విషయంలో చైనా వైఖరి రష్యా-భారత్ సంబంధాలను ఇరకాటంలో పెడుతోందని, తేలివిమాలిన వ్యవహారంగా మారిపోయిందంటూ కృష్చేవ్ ప్రకటించారని సీఐఏ పేర్కొంది.

1961లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దాదాపు తెగిపోయాయి. బీజింగ్‌లోని రాయబారిని భారత్ వెనుక్కి పిలిచింది. చైనా కూడా తన రాయబారిని ఉపసంహరించుకుంది. 1976లో మావో మరణం తర్వాత తిరిగి రాయబార కార్యాలయాలను పునరుద్ధరించారు. డెంగ్ గ్జియోపింగ్ వ్యూహాత్మక దృష్టితో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించాలని ఆశించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీని చైనా సందర్శనకు ఆహ్వానించారు. ఆమె దాన్ని తిరస్కరించారు.

ఆ తర్వాత ప్రధాని రాజీవ్‌గాంధీని చైనా ఆహ్వానించింది. 1988 డిసెంబర్‌లో రాజీవ్‌గాంధీ చైనాకు వెళ్లారు. క్రమేణ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. 1988-93 సంవత్సరాల మధ్య కాలంలో సరిహద్దు వివాదానికి సంబంధించి ఆరుసార్లు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

1993లో భారత ప్రధాని పి.వి.నరసింహరావు, చైనా ప్రధాని లీపెంగ్‌లు సరిహద్దు ఒప్పందం మీద సంతకాలు చేశారు. అయితే 1998లో భారత్ అణు పరీక్షలు జరపడం చైనాకు గిట్టలేదు. దీంతో మళ్లీ పూర్వపు ఘర్షణ పునరావృత్తమైంది.  2003లో భారత ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పాయి చైనా సందర్శించారు. 2006లో ప్రాచీన వాణిజ్య మార్గమైన ‘నాథులా’ను తెరిచారు.

ఇటీవల కాలంలో బ్రహ్మపుత్రా నదీజలాల వినియోగం పేరుతో చైనా టిబెట్ పీఠభూమిలో భారీఎత్తున ఆనకట్టలు నిర్మించి దిగువ నదీపరీవాహక దేశాలైన ఇండియా, బంగ్లాదేశ్‌లను కలవరపెడుతోంది. 2020 నాటికి భారీ ఎత్తున బ్రహ్మపుత్రా నదీజలాలను చైనా ఉత్తరాది ప్రాంతాలకు తరలించాలని పథకం రూపొందించింది. ఈ ప్రయత్నం పర్యావరణ హానితోపాటు, దిగువ నదీపరివాహక దేశ ప్రజల జీవనోపాధికి గండికొడుతుంది. ఈ చర్య ఇండియా-చైనా సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది.

2013లో చైనా సైన్యం లడక్‌లోని డెప్సాంగ్ మైదాన ప్రాంతంలోని దౌలత్ బెగ్ ఒల్డీలో చొరబడి 21 రోజులు తిష్టవేసి చివరకు మే 5, 2013న సైనిక దళాలను ఉపసంహరించుకుంది. 1993, 1996 సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించి మన భూభాగంలోకి చొరబడుతోందంటే భారత్ వాస్తవాధీనరేఖను చైనా గుర్తించడంలేదని తేటతెల్లమవుతోంది.

దక్షిణ, తూర్పు చైనా సముద్ర తీరంలోని దేశాలతో కయ్యానికి దిగడానికి సిద్ధపడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలన్నీ చైనా తొందరపాటు చర్యలపై అసంతృప్తితో ఉన్నాయి.

నెహ్రూ లాంటి ఆదర్శవాదులు ‘హిందీ- చీనీ భాయి భాయి’ లాంటి నినాదాలతో చైనాను లాలించడానికి ఎంత ప్రయత్నించినా చైనాకు భారత్ అంటే ఏవగింపు, చిన్నచూపు. చైనా కాంప్రహెన్సివ్ నేషనల్ పవర్ భారత్ కంటే మూడు, నాలుగు రెట్లెక్కువ.

ద్వైపాక్షిక, ప్రాంతీయ, జాతీయ సమస్యల మీద రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. దక్షిణాసియాలో భారత్ ఎదుగుదలను చైనా సహించదు. భారతదేశాన్ని బలహీనపరచాలనే కాంక్షతోనే పాక్ అణ్వాయుధాల తయారీలో సాయపడింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ భారత్ ను బలహీన పరుస్తోంది.

ఇటీవల కాలంలో భారత్ అమెరికాకు దగ్గరకావటం చైనాకు మింగుడుపడడం లేదు. అమెరికా-భారత్‌ల మధ్య అణు ఒప్పందం చైనాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ‘ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వమివ్వడానికి చైనా అభ్యంతరం చెబుతోంది. భారత్ అనుసరిస్తున్న ‘లుక్ ఈస్ట్ పాలసీ’ చైనాకు చేదుగుళికలాంటిది.

తన పొరుగు దేశాలైన జపాన్, వియత్నాం దేశాలతో దూకుడుగా వ్యవహరించినట్లే, మన విషయంలో కూడా ప్రవర్తిస్తోంది. ఆర్థికంగా, సైనికంగా అగ్రరాజ్యంగా రూపొందుతూ, అమెరికానే సవాలు చేసే స్థితిలో ఉన్న చైనా, తన పొరుగు దేశమైన ఇండియా ఆర్థిక శక్తిగా ఎదగడాన్ని సహించలేకపోతోంది. వీలైనంతవరకు అణచివేయాలని ప్రయత్నిస్తోంది.

ఇలాంటి స్థితిలో భారత్ అనుసరించాల్సిన వ్యూహమేమిటి? ఇండియా తన సైనిక పాటవాన్ని త్వరితగతిన మెరుగుపర్చుకోవాలి. సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పటిష్టం చేయాలి. ఆర్థిక ప్రగతి సాధించాలి. సంక్షోభం తలెత్తినప్పుడు స్పందన దీటుగా ఉండాలి. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలనే’’ సామెతను సార్థకం చేస్తూ, చైనాకు వ్యతిరేక శక్తులతో అమెరికా, జపాన్, కొరియా లాంటి దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవాలి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

12 + four =