ఆచరణాత్మక జాతీయవాదం, దేశీయ ఆర్థిక విధానం, రాజీలేని సైనిక వ్యూహం ఈ మూడింటి సంక్లిష్టమైన కూర్పు ప్రధాని నరేంద్ర మోదీ. సాంస్కృతిక ఏకసూత్రతనూ, ఆర్థిక సమతూకాన్నీ, మిలట్రీ ఎత్తుగడల్నీ ఒకే ఫిరంగిలో కూర్చడం అంత సులభం కాదు.
ఆర్థిక మందగమనం వెంటాడుతున్న కాలంలోనే డ్రాగన్ వ్యాప్తి చేసిన వైరస్ అర్థవ్యవస్థ మూలుగుల్ని పీల్చి పిప్పి చేసింది. ’జనతా కర్ఫ్యూ’ నుంచి ‘ఆత్మనిర్భర భారత్’ వరకూ యాభై రోజులపాటు లోకం స్వచ్ఛందంగా బందీ అయింది. మాస్క్ వేసుకున్న ప్రధాని మోదీ, ముసుగు ధరించిన 130కోట్లమందితో మాట్లాడటం మినహా భూగోళం కాలు కదపలేదు. చిల్లిగవ్వకోసం దేబిరించింది పేదజనం.
శాస్త్ర ప్రగతికీ, సాంకేతిక ఆవిష్కరణలకూ, వైద్య విఙ్ఞానానికీ ఉన్న పరిధులూ, పరిమితులనూ అర్ధక్రిమి అత్యంత క్రూరంగా బట్టబయలు చేసింది. ‘ప్రపంచీకరణ భ్రమ’ వీగిపోయింది. అగ్రరాజ్యాలు సైతం అల్పప్రాణులైన ఉదంతం కళ్లముందే కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి కష్టకాలంలోనే భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఆత్మనిర్భర భారత్’ను దేశ పౌరులకు పరిచయం చేశారు. ఒడ్డుకు చేర్చే ఓదార్పు ఉందని, ప్రకటించారు.
నలభై ఏళ్ల బీజేపీ చరిత్రలో, అర్ధ శతాబ్దపు మోదీ రాజకీయ, సామాజిక జీవితంలో, ఆరేళ్ల ప్రధాని ప్రయాణంలో ఇంతటి విపత్తును చూడలేదు. ఇంత సాహసాన్ని ఏ రాజకీయ సంస్థ ప్రకటించిన దాఖలా లేదు. ఇంతకూ మోదీ ఆర్థిక వ్యూహం మూలాలేంటి? సైనిక సాహసం వెనుక ఉన్న ధైర్యం ఎక్కడిది? మోదీ ఆచరణాత్మక జాతీయవాదం ఏమటోంది? ‘‘ప్రాక్టికల్ నేషనలిజం’ అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుంగదీస్తున్నది. దీని ధాటికి గత 40 రోజుల లాక్‌డౌన్ పీరియడ్‌లో స్థూల దేశీయోత్పత్తి -జీడీపీ పరంగా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 320 బిలియన్ డాలర్ల అంటే రూ.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఓ నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కన రోజుకు 800 కోట్ల డాలర్ల అంటే రూ.60,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు స్పష్టమవుతోంది.
లాక్‌డౌన్ ప్రభావం ట్రావెల్, మొబిలిటీ రంగాలపై తీవ్రంగా ఉందని ఆర్థిక స్థితి గణనీయంగా క్షీణించిందని ‘డాటాల్యాబ్స్’ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల -ఎంఎస్‌ఎంఈ రంగం కూడా కరోనా కాటుతో తల్లడిల్లుతున్నది. ఈ రంగంలోని అనేక చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి.
మరికొన్ని పరిశ్రమలు అతితక్కువ మంది కార్మికులతో పనిచేస్తున్నాయి. ఫలితంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో ఆదాయానికి భారీగా గండిపడినట్టు కొవిడ్-19 స్టార్టప్ ఇంపాక్ట్ నివేదిక పేర్కొన్నది. మరికొన్ని రంగాల్లోనూ కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగించగా.. సరఫరాల వ్యవస్థలో ఏర్పడిన అవాంతరాలతో తయారీరంగం తీవ్రంగా నష్టపోతోంది. అయితే ప్రస్తుతం వినియోగదారుల స్వభావంలో వచ్చిన మార్పులు మరికొన్ని రంగాల ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. టెక్ అప్లికేషన్లకు అకస్మాత్తుగా డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. దీని ఫలితంగా మున్ముందు కొన్ని దేశీయ స్టార్టప్‌ల ఆదాయం మరింత పెరిగే అవకాశముంది.
కరోనా కలిగించిన సామాజిక, ఆర్థిక నష్టాన్ని లెక్కవేయడానికి సరైన ఉపకరణాలు కానీ, అంచనాలు కానీ లేవు. 65 శాతం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కరోనా విధ్వంసానికి గురైన ప్రతి దేశ ఆర్థికవ్యవస్థ 7-15 శాతం వరకు ఆర్థి క మందగమనానికి గురవుతుందని ఒక అంచనా. లెక్కలు పక్కాగా ఉండే అమెరికాలోనే కనీసం 35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఆర్థిక సామాజిక నష్టం ఒకప్పుడు గ్రేట్ డిప్రెషన్, మహా మాంద్యం, స్పానిష్‌ఫ్లూ సృష్టించిన నష్టం కంటే చాలా పెద్దది.
ప్రతి సంక్షోభం వెనుకా గొప్ప అవకాశం దాగి ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకుంటే త్వరితగతిన అభివృద్ధి రథచక్రాలను పరుగుపెట్టించడం పెద్ద కష్టం కాదు. జపాన్ ఆర్థికవ్యవస్థ అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి. అణుబాంబు దాడికి బలై సర్వం కోల్పోయిన జపాన్, అచిరకాలంలోనే బలమై న ఆర్థికశక్తిగా ఎదిగింది. సరిగ్గా ఈ సూత్రాన్నే పాటించారు ప్రధాని మోదీ.
‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’పథకానికి రూపకల్పన చేసింది కేంద్రం. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని మే 12న ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఈ ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు.
భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10 శాతం. ఆర్బీఐ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో కలిపి ఇది రూ. 20 లక్షల కోట్లు.
ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం. ఈ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజం ఇస్తుందని మోదీ భావించారు. 5 మూల సూత్రాల ఆధారంగా ప్యాకేజీ ప్రకటించారు. లోకల్ బ్రాండ్ కు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో MSMEలకు పెద్దపీట వేశారు. 3 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం ఆరు అంశాల్లో భారీ ప్రయోజనాలు కల్పించారు. ఆర్థిక కష్టాలతో కొట్టిమిట్టాడుతోన్న విద్యుత్ డిస్కమ్ లకు కొత్త ఊపిరులూదే ప్రయత్నం చేసింది కేంద్రం.
నగదు లభ్యత కొరత రాకుండా 90 వేల కోట్లు కేటాయించింది మోదీ ప్రభుత్వం. డిస్కంలు వినియోగదారులకు కూడా బదిలీ చేయాలని సూచించారు ఆర్థిక మంత్రి.
నాన్ బ్యాకింగ్ పవర్ సెక్టార్స్ కు కూడా చేయూత ఇచ్చింది. 30 వేల కోట్లతో స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ను ప్రకటించింది. పార్షియల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద మరో 45 వేల కోట్లు అందుబాటులో ఉంచనున్నారు.
కొవిడ్ సమయాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్‌గా చూడాలన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంట్రాక్టు పనులు పూర్తి చేసేందుకు 6 నెలల వరకు వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపారు..కేంద్ర ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల.. బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేస్తామన్నారు. ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. మరో మూడు నెలలపాటు కంట్రిబ్యూషన్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రస్తుతం ఉన్న TDS, TCS రేట్లు 25% తగ్గించింది. ఇన్ కం టాక్స్ రిటర్స్ గడువును కూడా నవంబర్ 30 వరకు పొడిగించారు.
లోకల్ – వోకల్ ఫార్ములా వెనుక అంతస్సారమేంటి?
మే12న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఉపన్యాసం వెనుక అంతస్సారమే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ వెనుక అసలు ఉధ్దేశం. మోదీ ప్రసంగంలో సాంతం కనిపించేదీ అదే…స్వయం సమృద్ధి సాధించడం ఇప్పుడు అత్యావశ్యకమనే అంశాన్ని పదే పదే గుర్తు చేశారు ప్రధాని. స్వయం సమృద్ధ భారత్ ఇప్పుడు అత్యంత అవసరమనీ…. అంతర్జాతీయంగా స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు అర్థం మారిందంటూ వినూత్నమైన సూత్రీకరణ చేశారు. భారత సంస్కృతి, సంప్రదాయం చెప్పేది ‘వసుధైక కుటుంబం’ అనే అర్థంలోనే ఉందని గుర్తు చేశారు.
విశ్వమానవాళి సంక్షేమమే భారత స్వయం సమృద్ధికి విస్తృతార్థం అనీ తాత్విక నేపథ్యాన్ని విడమరిచి చెప్పారు. భారత్ సాధించిన ప్రతీ విజయం ప్రపంచంపై ప్రభావం చూపిందనీ…. గ్లోబల్ వార్మింగ్‌పై పోరులో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతీ అన్నారు. భారత్ ఇప్పుడు ఏదైనా సాధించగలదు అని ప్రపంచం నమ్ముతోందంటూ గాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
వనరులూ, శక్తి, సామర్థ్యాల శక్తిని గుర్తు చేశారు. అత్యుత్తమ వస్తువులను ఉత్పత్తి చేయాలి. మన సప్లై చెయిన్‌ను ఆధునీకరించుకోవాలి. ఇవి మనం చేయగలం. చేస్తాం. మనమంతా దేశీయ ఉత్పత్తులను కొనడమే కాదు. వాటికి ప్రచారం కూడా చేయాలంటూ నూతన ఆర్థిక వ్యవస్థ గురించి విశ్వాసం కల్పించారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంస్థలన్నీ ఒకప్పుడు స్థానికంగా ఏర్పడినవే…. కృషి, పట్టుదల, నాణ్యత, ప్రచారం.. మొదలైన వాటితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. దేశీయ సంస్థలు ఆ దిశగా ముందుకు వెళ్లాలి. అందుకు మనమంతా ప్రోత్సహించాలన్నారు ప్రధాని మోదీ.
చారిత్రక అనుభవాలను మరోమారు గుర్తు చేశారు. మంచి ప్రోత్సాహం అందించడంతో ఖాదీ, చేనేతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అవి బ్రాండ్‌ల స్థాయికి వెళ్లాయి. 1999లో వై2కే సమస్య వచ్చింది. అంతర్జాతీయంగా భయభ్రాంతులను సృష్టించింది. అయితే, భారతీయ సాంకేతిక నిపుణులు ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించారు. 2001 లో కచ్ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. కచ్ అంతా మృత్యువనే దుప్పటి కప్పుకుందా? అనేలా కనిపించింది. మళ్లీ సాధారణ స్థితి సాధ్యమా? అని అంతా అనుమానించారు. కానీ కచ్ మళ్లీ నిలబడింది. త్వరలోనే సగర్వంగా సాధారణ స్థితికి చేరుకుంది. అదే భారత్ ప్రత్యేకత.
అంతర్జాతీయంగా ఏర్పడిన అవకాశంపై మోదీ దృష్టి సారించారా?
అంతర్జాతీయంగా చైనా-అమెరికా ట్రేడ్ వార్ నేపథ్యంలో దేశీయ మార్కెట్ విస్తరించేందుకు భారీ ప్రణాళిక రూపొందించారు మోదీ. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌ను ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులకు చెక్ పెట్టాలంటే… చైనా నుంచీ దిగుమతులు తగ్గించి, భారత్ నుంచీ దిగుమతులు పెంచుకోవడమే సరైన మార్గమని భావిస్తోంది. మొత్తం ఏడు రంగాల్లో భారత్ నుంచీ ఉత్పత్తులు తెప్పించుకునేందుకు అమెరికా సన్నద్ధమవుతోందని తెలిసింది.
ప్రస్తుతం చైనా నుంచీ అమెరికాకు క్రీడా వస్తువులు, బొమ్మలు, స్టేషనరీ, కేబుల్స్, ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఎగుమతి అవుతున్నాయి. ఐతే… చైనా, అమెరికా రెండూ… తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఎక్సైజ్ సుంకాలు పెంచేసుకోవడంతో… ఇప్పుడు చైనా నుంచీ అమెరికాకు వస్తున్న వస్తువుల రేట్లు బాగా పెరిగాయి.
అంత రేటు పెట్టి… బ్రాండ్ లేని యూజ్ అండ్ త్రో చైనా ఉత్పత్తులు కొనేబదులు… బ్రాండ్ తో పాటు నాణ్యత ఉండే… ఎక్కువ కాలం మన్నే భారతీయ ఉత్పత్తులు కొనడం బెటరని అమెరికా భావిస్తోంది. అదే జరిగితే, వల్కనైజ్డ్ రబ్బర్, ఫుట్‌వేర్, కిచెన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారత్ నుంచీ చైనాకు ఎగుమతి అయ్యే అవకాశాలు మెరగవుతాయి.
ప్రస్తుతం చైనాలాగే… వియత్నాం, కాంబోడియా కూడా… అమెరికాకు తమ ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. ఇండియాతో అమెరికా కొత్త డీల్స్ కుదుర్చుకోవాలంటే… ఓ ఐదారు నెలలు పడుతుంది. ఈ లోపు వియత్నాం, కాంబోడియా… భారత్ ఎగుమతి చేయాలనుకునే వస్తువుల్ని అంతకంటే తక్కువ రేటుకే ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ రెండు దేశాలూ ఇండియాకి పోటీగా నిలిచే పరిస్థితి ఉంది.
ఈ వస్తువులకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ భారత్… 1.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది. ఒక్క బూట్ల విషయంలోనే… ఏడాదికి 10 లక్షల జతల షూలను అమెరికా డిమాండ్ చేస్తోంది. త్వరలో అమెరికా కోరినన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధమని భారత్ ప్రకటించింది. అదే జరిగితే… ఈ ఉత్పత్తుల్లో భారత్ ఎగుమతులు 25 శాతం పెరిగే అవకాశాలుంటాయి.
మే12 ప్రసంగంలో ఎవరూ ఊహించని విధంగా లోకల్-వోకల్ ఫార్ములాను ప్రతిపాదించారు మోదీ. ఈ ఫార్ములా ప్రకారం మన దేశం మునుపటి మాదిరిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశీయంగానే ఉత్పత్తులను సాగిస్తూ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, చైనా ఉత్పత్తుల ఆధిపత్యాన్ని తగ్గించనుంది. ఇందుకోసం ఆయా ప్రాంతాలలో తయారు చేసిన వస్తువుల వాడకానికి ప్రాధాన్యత కల్పించనున్నారు.
దీనికి పీపీఈ కిట్‌లనే ప్రధాని మోదీ ఉదాహరణగా చూపారు. దేశంలో తయారైన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించాలని ప్రధాని మోడీ నొక్కిచెప్పడానికి చైనాతో భారతదేశ దౌత్య సంబంధమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రపంచమంతా కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నిస్తుండగా, చైనా ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తూ, తద్వారా లభించిన ఆదాయంతో తన రహస్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే చైనా పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.
దీనికి చైనా – భారత సైన్యాల మధ్య లడఖ్, సిక్కింలలో చోటుచేసుకున్న ఘటనలే ఉదాహరణలుగా నిలిచాయి. ఇటువంటి పరిస్థితిలో ఆసియాలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించే సామర్ధ్యం భారతదేశానికి ఉంది. ఈ నేపధ్యంలో మోదీ చెప్పిన లోకల్-ఓకల్ ఫార్ములా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొబైల్స్, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్స్, లైటింగ్ సహా అనేక ఉత్పత్తులు చైనా నుండి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.
చైనా తన ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ సొమ్మును తన దేశాన్ని అభివృద్ధి చేయడానికి, ఆసియాపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చైనా ఉపయోగిస్తుంది. దౌత్య స్థాయిలో చైనా చేస్తున్న ఈ చర్యను అధిగమించి, భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకే ప్రధాని మోదీ లోకల్- వోకల్ నినాదం ఇచ్చారు. అమెరికా ఉక్కుకౌగిలి నుంచి భారత్ ను బయటకు రప్పించడం, డ్రాగన్ ఏకైక అతి పెద్ద మార్కెట్ అయిన భారత్ లో చైనాకు చెక్ పెట్టడం మోదీ విదేశాంగ నీతిలో భాగం. స్వతంత్ర్య దేశంగా భారత్ అవతరించేలా చేయడమే మోదీ కీలక వ్యూహం.