రూల్స్ బ్రేక్ చేయడం.. ఆ తరువాత తూచ్ తప్పయిపోయిందని చెప్పడం.. మళ్లీ యధావిధిగా తన తప్పుల తడకను ప్రదర్శించడం అలవాటు పడిన సంస్థ ఏదయినా ఉంది అంటే అది అమేజాన్. ఈ సారీ ఈ కంపెనీ వేసిన ఓ భారీ ఎత్తుగడ బయటపడింది. రాయటర్స్ సంస్థ ప్రచురించిన ఓ కథనం ఆధారంగ ఆ సీక్రెట్ స్ట్రాటజీ వెలుగులోకి వచ్చింది.
2019 మొదట్లో అమెజాన్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన జే కార్నే ఓ ముఖ్యమైన మీటింగ్ కోసం బయలుదేరారు. ఆయన అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వద్ద ప్రెస్ సెక్రటరీగా కూడా పనిచేశారు. కార్నే అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత అంబాసిడర్‌తో మాట్లాడడానికి మీటింగ్ షెడ్యూల్ అయింది. అదే సమయంలో భారతప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కొన్ని మార్పులు తెచ్చింది. అయితే, ఆ రూల్స్ వల్ల అమెజాన్‌కు భారత్‌లో పెద్ద దెబ్బ పడడం ఖాయం. అప్పుడు మీటింగ్‌కు ముందు అమెజాన్ ఉద్యోగులు కార్నే కోసం ఓ నోట్ రెడీ చేశారు. అందులో ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు అనే పాయింట్లను ప్రస్తావించారు. ఆ నోట్‌ను రాయిటర్స్ సంపాదించినట్టు తెలిపింది.
అందులో ఏం చెప్పారంటే అమెజాన్ సంస్థ భారత్‌లో 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుంది. అలాగే, 4 లక్షల మంది భారతీయ చిరు వర్తకులకు తమ వ్యాపార కలాపాలు సాగించేందుకు ఆన్ లైన్ ప్లాట్ ఫాం కల్పిస్తుందనే పాయింట్ హైలైట్ చేయాలి. అయితే, కంపెనీ వెబ్ సైట్‌లో విక్రయించే మొత్తం వస్తువుల విలువలో మూడింట ఒక వంతు కేవలం 33 మంది మంది అమెజాన్ అమ్మకందారులే అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పొద్దని ఆ నోట్‌లో పేర్కొన్నారు. అది చాలా సున్నితమైన, బహిర్గతం చేయకూడని అంశంగా తెలిపారు.
ఇంకా మరికొన్ని పత్రాలు కూడా ఇలాంటి మరిన్ని విషయాలను వెల్లడించాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. అమెజాన్ సంస్థ పరోక్షంగా పెట్టుబడులు కలిగిన ఉన్న మరో రెండు పెద్ద వ్యాపార సంస్థలు.. 2019వ సంవత్సరంలో అమెజాన్ ప్లాట్ ఫాం మీద జరిపిన విక్రయాల్లో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంటే, మొదట 33 మంది మూడింట్ ఒక వంతు, ఈ రెండు పెద్ద వ్యాపార సంస్థలు మరో 35 శాతం వాటా అంటే మొత్తంగా మూడింట రెండు వంతులు కలిగిఉన్నాయన్నమాట. 4 లక్షల మంది వ్యాపారులు చేసేది మూడింట ఒక వంతు అయితే, ఈ 35 మంది చేసేది మూడింట రెండు వంతులు.
‘ఈ సమాచారం అంతా రాజకీయంగా సున్నితమైంది. ఒకవేళ ఈ విషయం తెలిస్తే భారత్‌లో చిన్న వర్తకుల ఆగ్రహాన్నికి అజ్యం పోసినట్టు అవుతుంది. అమెజాన్ రూల్స్ బ్రేక్ చేస్తూ బడాబాబులకు మేలు చేస్తోందని వారు భావించే అవకాశం ఉంది. చిన్న వర్తకులే ప్రధాన బేస్‌గా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది ఆగ్రహాన్ని కలిగించవచ్చు. అదే సమయంలో అమెజాన్ సంస్థ తాము చిన్న వర్తకులకు ఫ్రెండ్ అనే భావన తొలగిపోయే ప్రమాదం ఉంది.’ అయితే, ఈ విషయాన్ని కార్నే భారత అంబాసిడర్‌కు చెప్పారో లేదో తెలీదు. 2019 ఏప్రిల్‌లో ఎలాంటి మీటింగ్ జరగలేదు.
అమెజాన్ సంస్థకు భారత్.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. బయటకు లక్షలాది మంది వర్తకులకు ప్లాట్ ఫాం అందిస్తున్నట్టు చెబుతున్న అమెజాన్, వాస్తవంలో పెద్ద కంపెనీలకే ఎక్కువ వ్యాపారన్ని అందిస్తోంది. అమెజాన్ సంస్థ బడాబాబులకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోందని కొందరు చిన్న వర్తకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వాదనను అమెజాన్ ఖండించింది. భారత చట్టాలను తాము గౌరవిస్తున్నామని తెలిపింది. అమెరికాలో అయితే, వెబ్ సైట్ సొంత ఉత్పత్తులను కూడా విక్రయించుకోవచ్చని, కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండా కేవలం తాము కొంత ఫీజు తీసుకుని అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య ప్లాట్ ఫాం అందిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ మాటల్లో వాస్తవం లేదనేది వెలువడిన డాక్యుమెంట్ల ఆధారంగా తెలుస్తోంది.