కంచే చేనుమేస్తే ఎవరూ ఏమీ చేయలేరని సామెత. ముఖేష్ అంబానీ ఇంటిముందు కారు బాంబు కేసుకు.. ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఈ కేసులో ఓ పోలీసు అధికారి ప్రమేయం వెలుగుచూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుతో సంబంధం వుందన్న అనుమానాల నేపథ్యంలో.. ముంబై పోలీస్ అధికారి సచిన్ వఝేను NIA శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుంది. ఆదివారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా మార్చి 25 వరకు కస్టడీ విధించింది. ఇక, సచిన్ వఝేను కస్టడీలోకి తీసుకున్న NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. అయితే, ఈ దర్యాప్తులో కళ్లుబైర్లు కమ్మే అనేక విషయాలు బయటికొస్తున్నాయి.
ఫిబ్రవరి 25న.. దక్షిణ ముంబయిలోని ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో.. పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం పార్క్ చేసి వుండటం సంచలనం సృష్టించింది. ఆ తరువాత ఆ వాహన యజమానిగా చెబుతున్న ఆటో స్పేర్ పార్టుల డీలర్ మాన్ సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం పెద్ద సంచలనం అయింది. అంతకుముందు, పేలుడు పదార్థాలతో దొరికిన వాహనం తనదేనని, కానీ, ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు దాన్ని ఎవరో దొంగిలించారని హిరేన్ పోలీసులకు చెప్పారు. అయితే, హిరేన్ పై నేరం మోపి.. సచిన్ వఝేనే అతడిని వేధించాడని.. అందువల్లే అతను చనిపోయివుంటాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వాహన యజమానిని వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. హిరేన్‌తో సచిన్ తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని ఫడ్నవీస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్‌ను అసెంబ్లీ ముందుంచారు. అంబానీ ఇంటి బయట వాహనాన్ని నిలిపిన ప్రదేశానికి చేరుకున్న తొలి వ్యక్తి వఝేనే అని కూడా ఫడ్నవీస్ చెప్పారు.
కానీ, ఫడ్నవీస్ ఆరోపణలను సచిన్ ఖండించారు. ఫడ్నవీస్ ఈ ఆరోపణలు చేసిన అదే రోజు హిరేన్ ఒక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తన భర్త మరణానికి సచిన్ వఝేనే కారణమని, ఆయన వేధింపుల వల్లే తన భర్త మృతి చెందాడని సుఖ్ హిరేన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు.. కొన్ని నెలల పాటు దొంగతనానికి గురైన స్కార్పియో సచిన్ వద్దే ఉందని ఆమె ఆరోపించారు. దీంతో శివసేన ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ థాకరే.. వఝేను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇక, సచిన్ వఝేపై ఆరోపణలు ఎక్కువ కావడంతో.. రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్.. ఈ కేసు దర్యాప్తు ముగిసేవరకు వఝేను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వం అతన్ని క్రైం ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుంచి కూడా బదిలీ చేసింది.
ఇక, కీలక సాక్షిగా భావిస్తున్న వాహన యజమాని హిరెన్ హత్యకు గురికావడంతో.. కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో రంగంలోకి దిగిన NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం సచిన్‌ను 12 గంటల పాటు ప్రశ్నించింది. సంఘటన జరిగిన సమయంలో సచిన్ వఝే అక్కడే ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు NIA వర్గాలు ప్రకటించాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు సంఘటనా స్థలంలోని CCTV ఫుటేజీని పరిశీలించగా,. PPE కిట్ ధరించిన ఓ వ్యక్తి ఆ వాహనాన్ని అక్కడ నిలిపినట్లు గుర్తించారు. అయితే ఆ PPE కిట్ వేసుకున్న వ్యక్తి సచిన్ వఝేనేనా, లేదా మరో వ్యక్తి అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు NIA వర్గాలు వెల్లడించాయి. సంఘటనపై CCTV ఫుటేజ్ లతో పాటు వఝే వివరణకు పరిశీలిస్తున్నట్లు NIA అధికారులు తెలిపారు. అంతేకాదు, అంబానీ ఇంటికి సమీపంలో పార్క్ చేసిన స్కార్పియో వాహనం కేసుకు సంబంధించి ఓ తెలుపు రంగు ఇన్నోవా కారును NIA ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలున్న వాహనాన్ని అనుసరించిన కారు ఇదేనా..? కాదా అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు, సచిన్ వఝే నివాసం వుంటున్న హౌసింగ్ సొసైటీకి చెందిన CCTV ఫుటేజీ ఖాళీగా వుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ డిజిటల్ వీడియో రికార్డర్ ను.. ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో నాడు అధికారిగా ఉన్న సచిన్ వఝేనే స్వాధీనం చేసుకున్నారు. వఝేను అరెస్ట్ చేసిన తర్వాత NIA ఈ డిజిటల్ వీడియో రికార్డ్ నుండి వచ్చిన CCTV ఫుటేజీని పరిశీలించింది. అయితే, అందులో ఏమీలేకపోవడం అధికారులను షాక్ కు గురిచేసింది. వాహన యజమాని హిరేన్‌తో తన సంబంధాలు బహిర్గతం అయిన తర్వాత.. అతనిపై ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోననే ఉద్దేశంతో.. సచిన్ వఝేనే CCTV ఫుటేజీని డిలీట్ చేసి ఉండవచ్చని NIA అనుమానిస్తుంది. ప్రసుత్తం అధికారులు డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఫుటేజ్ తొలగింపుకు సంబంధించి క్రైం ఇన్వెస్టిగేషన్ యూనిట్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రియాజ్ కాజీని కూడా NIA ప్రశ్నిస్తోంది.
ఇదిలావుంటే, ఈ కేసులో ఉగ్రలింకులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు పదార్థాలను ఉంచడానికి కారణమైన ఫోన్ తిహార్ జైల్లో దొరకడం.. అదికూడా బ్యారక్ నంబర్ 8లో శిక్ష అనుభవిస్తున్న.. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది తెహసీన్ అక్తర్ నుంచి స్వాధీనం చేసుకోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఆ ఫోన్ ను సేకరించింది. ఆ ఫోన్ నుండే టెలిగ్రామ్ ఛానల్ పనిచేస్తుందని, దీని నుండి అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలను ఉంచే పని చేపట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక, ఉగ్రలింకులపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అటు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసుకు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయన్న కోణంలో ATS అధికారులు సచిన్ వఝేను విచారించినట్టు తెలుస్తోంది.
మొత్తానికి, ఈ కేసు శివసేన ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం ముంబై పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వఝెకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుంది. తన కెరీర్లో ఇప్పటివరకు 63 మందిని ఎన్‌కౌంటర్ చేసినట్టు రికార్డు వుంది. ఆయన ట్రాక్ రికార్డును పరిశీలిస్తే.. అంతా గందరగోళమే. ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. సచిన్ వఝే 1990లో పోలీసు విభాగంలో చేరారు. అతడికి మొదటి పోస్టింగ్ గడ్చిరౌలిలో ఇచ్చారు. ఆ తరువాత థానేకు, ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో చాలామంది నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఒక కస్టోడియల్ డెత్ కేసు విషయంలో ఆయనపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. 2004లోనే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 2007లో ముంబై పోలీస్ విభాగంలో చేరేందుకు అర్జీ పెట్టుకున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో శివసేన పార్టీలో చేరారు. షీనా బోరా హత్య కేసు, ఉగ్రవాది డేవిడ్ హెడ్లీపై రెండు పుస్తకాలను సైతం రాశారు. సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో కూడా పోలీసులకు కొన్ని కేసుల దర్యాప్తులో సహాయం చేశాడని ఆయన అభిమానులు చెబుతుంటారు.
ఇక, కోవిడ్-19 సమయంలో సిబ్బంది కొరత కారణంగా.. శివసేన సర్కార్ తన మాజీ కార్యకర్త అయిన సచిన్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంది. సస్పెన్షన్ తొలగించి మరీ లాఠీ చేతికిచ్చింది. దీంతో 16 ఏళ్ల విరామం తర్వాత గతేడాది జూన్ లో ఆయన మళ్లీ విధుల్లో చేరారు. వచ్చీరాగానే సచిన్‌ను శివసేన సర్కార్ ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు పంపించింది. ఆ తరువాత ఏకంగా CIUకు ఇన్‌చార్జిగా ప్రమోట్ చేసింది. దీంతో జూనియర్ పోలీసు అధికారి అయినప్పటికీ, సచిన్ తన అర్హతకు మించిన కేసులను దర్యాప్తు చేశారు. TRP రేటింగ్ కుంభకోణంలో ఆర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన బృందానికి నాయకత్వం వహించారు. దీంతో పాటు వార్తల్లో నిలిచిన ఎన్నో ప్రముఖ కేసుల దర్యాప్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. అంబానీ ఇంటిముందు కారు కేసుకు సంబంధించి.. సచిన్ వఝేపై వున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా, అసలు నిజాలు బయటికి రావాలంటే.. NIA, ATS దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచిచూడాల్సిందే.