ఐదు దశాబ్దాల భారత అంతరిక్ష పరిశోధనా చరిత్రలో.. ఇస్రో ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసింది. ప్రపంచాన్ని అబ్బురపరచేలా ఎన్నో ప్రయోగాలను తొలి అడుగులోనే విజయవంతం చేసి సత్తాచాటింది. అలాంటి ఇస్రో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ ఏడాది మొదటి ప్రయోగాన్నే వేదికగా మార్చుకుంది. మొట్టమొదటిసారిగా స్పేస్ లో కి దేశీయ ఉపగ్రహాలను పంపిస్తోంది. ఈ విషయమై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే, స్వదేశీ ఉపగ్రాహాలతో పాటు ఓ అరుదైన వస్తువులను కూడా అంతరిక్షంలోకి పంపించబోతోంది ఇస్రో. ఇది భారత అంతరిక్ష పరిశోధనా చరిత్రలో మునుపెన్నడూ లేని అరుదైన ఘటనగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇస్రో చరిత్రలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను, భగవద్గీత పుస్తకాన్ని అంతరిక్షంలోకి పంపించబోతోంది. దేశీయంగా తయారైన ప్రైవేటు సంస్థల ఉపగ్రహాల్లోని.. ఒక శాటిలైట్‌లో భగవద్గీత కాపీ, మోదీ ఫోటో, అలాగే 25 వేల మంది పౌరుల పేర్లను కూడా అంతరిక్షంలోకి పంపించనుంది.
ఈ ప్రయోగం ద్వారా ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ‘ఆనంద్’, ‘సతీశ్ ధావన్’, ‘యునిటీశాట్’ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. భారతీయ ఉపగ్రహాల్లో ‘ఆనంద్’ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్’ రూపొందించగా, ‘సతీశ్ ధావన్’ను చెన్నైకు చెందిన ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’, ‘యునిటీశాట్’ను జిట్‌శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్, శ్రీశక్తి శాట్ కళాశాలల విద్యార్థులు రూపొందించారు. వీటిలో స్సేస్ కిడ్జ్ ఇండియా ‘సతీశ్ ధావన్’ ఉపగ్రహాన్ని ప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త సతీశ్ ధావన్ పేరు మీదుగా రూపొందించింది. తమ సంస్థ నుంచి నింగిలోకి వెళ్తున్న తొలి ఉపగ్రహం కావడంతో ఈ ప్రయోగానికి మరింత ప్రత్యేక తీసుకురావాలని స్పేస్‌కిడ్జ్ ఇండియా భావించింది.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఫోటోను స్పేస్ లోకి పంపించనున్నామని స్పేస్ కిడ్జి ప్రకటించింది. మోదీ పేరు, దాని కింద ఆత్మ నిర్భర్ భారత్ పదాలు, భగవద్గీత ప్రతి, 25 వేల మంది పేర్లను పంపనున్నామని సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ వెల్లడించారు. స్పేస్ సైన్స్ తో పాటు తమ ప్రయోగం పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు కావాలని అడిగినట్టు కేసన్ తెలిపారు. వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయన్నారు. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి కాగా.. చెన్నైకి చెందిన ఓ పాఠశాల తమ విద్యార్థుల అందరి పేర్లు పంపిందన్నారు. ఈ పేర్లతో పాటు మోదీ ఫొటోను పంపిస్తున్నామని తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయని.. అందుకే, మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను పంపించాలనుకుంటున్నట్టు అని డాక్టర్ శ్రీమతి కేసన్ వెల్లడించారు. ఈ రాకెట్ 28వ తేదీ ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ-51 వాహక నౌక ద్వారా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఇలా ప్రత్యేక మైన వస్తువులను కూడా అంతరిక్షంలోకి పంపడం కూడా ఇదే తొలిసారి కానుందని తెలుస్తోంది. అంతరిక్షంలో భారత్ ప్రాధాన్యతను తెలియజేసేలా ఈ మూడింటిని పంపనున్నట్లు తెలుస్తోంది.